Bonds: 10 వేల కోట్ల అప్పు.. బాండ్ల రూపంలో!
ABN, Publish Date - Dec 28 , 2024 | 03:33 AM
తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఇటీవల సేకరించిన రూ.10 వేల కోట్ల అప్పు.. బాండ్ల రూపంలో సమకూరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రుణం పొందిన టీజీఐఐసీ .. 3-10 ఏళ్ల కాలవ్యవధితో బాండ్ల విడుదల
నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ ద్వారా రుణ సేకరణ
‘అకౌంట్ బ్యాంక్’గా ఐసీఐసీఐ ఇన్వెస్టర్ల హక్కుల ట్రస్టీగా ‘బీకాన్ ట్రస్టీషిప్’
హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఇటీవల సేకరించిన రూ.10 వేల కోట్ల అప్పు.. బాండ్ల రూపంలో సమకూరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎ్‌సఈ) ద్వారా సెక్యూరిటీ బాండ్లను విడుదల చేసి టీజీఐఐసీ ఈ రుణాన్ని సేకరించింది. మూడేళ్ల నుంచి పదేళ్ల కాల వ్యవధితో ఈ బాండ్లను విడుదల చేసింది. ఈ రుణ సేకరణలో ఐసీఐసీఐ బ్యాంకు మధ్యవర్తి పాత్ర (అకౌంట్ బ్యాంక్)ను పోషించింది. ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసిన 400 ఎకరాల భూమిని సెక్యూరిటీగా చూపించి బాండ్లను రిలీజ్ చేసినట్లు తెలిసింది. టీజీఐఐసీ ఈ రుణాన్ని బ్యాంకుల నుంచి సేకరించినట్లు ప్రభుత్వ వర్గాల్లో తొలుత చర్చ జరిగింది. కానీ, ఈ రుణం బ్యాంకుల నుంచి తీసుకున్నది కాదని, టీజీఐఐసీయే స్వయంగా బాండ్లను రిలీజ్ చేసి రుణాన్ని సేకరించిందని ఆ సంస్థ వర్గాలు స్పష్టతనిచ్చాయి. కాగా, రుణంగా తీసుకున్న ఈ మొత్తం సొమ్ము ప్రభుత్వ ఖజానాకు బదిలీ కానుంది. ఈ నిధులను ప్రభుత్వం రైతు భరోసా, రైతు కూలీలకు రూ.12 వేల భృతి పథకాలను వినియోగించనుంది.
ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. నెలవారీగా సమకూరుతున్న రాబడులు, మార్కెట్ రుణాల రూపంలో వస్తున్న సొమ్ము.. ప్రభుత్వ పథకాలకు, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు వడ్డీలు, అసలు చెల్లించడానికే సరిపోతోంది. దీంతో రైతు భరోసా, రైతు కూలీలకు రూ.12 వేల భృతి వంటి పథకాలను అమలు చేయాలంటే నిధుల కోసం ఇబ్బంది పడాల్సి వస్తోంది. మార్కెట్ నుంచి మరిన్ని రుణాలను సేకరిద్దామంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. పైగా.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి రుణాలు తీసుకునే పరిస్థితి లేదు. ఏదైనా కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకుందామన్నా... గ్యారెంటీ అప్పులను కూడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోనే పరిగణిస్తామని కేంద్రం గతంలోనే తేల్చి చెప్పింది. దీంతో ప్రస్తుతమున్న రుణాలను రీ-స్ట్రక్చర్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని, తద్వారా వడ్డీ భారం తగ్గి.. కొంతమేరకైనా నిధులు ఆదా అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరిస్తూ వచ్చింది. కానీ, కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. మరోవైపు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు పెద్దగా కనిపించడం లేదు.
భూములను విక్రయిస్తే విమర్శలొస్తాయనే..
రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావాలంటే భూములను విక్రయించడమొక్కటే మార్గంగా కనిపిస్తోంది. కానీ, ప్రభుత్వమే నేరుగా భూములను విక్రయిస్తే విమర్శలు వచ్చే అవకాశాలున్నాయి. అందుకే టీజీఐఐసీకి భూమిని బదలాయించి, నిధులు సేకరించాలని యోచించింది. టీజీఐఐసీకి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భూములు, ఇతర ఆస్తులున్నాయి. వీటిని తనఖా పెట్టడం, లేదంటే ఆస్తుల పేరిట సెక్యూరిటీ బాండ్లను రిలీజ్ చేసి అప్పులను సేకరించడం వంటి ప్రయత్నాలు చేయొచ్చని ఆలోచించింది. ఈ మేరకే జూన్ 26న 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 54ను జారీ చేసింది. అప్పటినుంచి టీజీఐఐసీ అప్పుల వేటలో పడింది. మొదట ఈ భూమిని తనఖా పెట్టి రుణం తీసుకోవాలని యోచించింది.
అయితే బ్యాంకులు ప్రభుత్వం నుంచి గ్యారెంటీ ఇప్పించాలని కోరాయి. కానీ, ప్రభుత్వం గ్యారెంటీలు ఇస్తే.. మళ్లీ కేంద్రంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పేచీ ఎదురవుతుంది. ప్రభుత్వ బడ్జెట్ అప్పుల కింద ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోనే పరిగణిస్తామని కేంద్రం చెబితే మళ్లీ తలనొప్పిగా పరిణమిస్తుంది. అందుకే టీజీఐఐసీ ‘సెక్యూరిటీ బాండ్ల’ పద్ధతిని ఎంచుకుందని తెలిసింది. దీనికి ఐసీఐసీఐ బ్యాంకు ‘అకౌంటు బ్యాంకు’గా వ్యవహరించగా, బాండ్ ఇన్వెస్టర్ల హక్కులకు ‘బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్’ ట్రస్టీగా నిలిచింది. ఇలా బాండ్లను రిలీజ్ చేసిన టీజీఐఐసీ, ఐసీఐసీఐ బ్యాంకు, బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు టీజీఐఐసీకి రూ.10 వేల కోట్ల రుణం అందింది.
Updated Date - Dec 28 , 2024 | 03:34 AM