Mahabubnagar : విషాద యాత్ర!
ABN, Publish Date - Aug 30 , 2024 | 03:11 AM
రేడియం స్టిక్కర్లు గానీ, పార్కింగ్ లైట్లు గానీ లేకుండా రోడ్డుపై ఆగివున్న ఆ వ్యాను తీర్థయాత్ర ముగించుకొని కారులో తిరుగు ప్రయాణమైన వారి పాలిట మృత్యువై నిరీక్షించింది!
ఆగివున్న వ్యానును ఢీకొన్న కారు
నలుగురి మృతి.. మరో నలుగురికి గాయాలు
మృతుల్లో తండ్రి, కుమారుడు, అల్లుడు
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన
భూత్పూర్, సైదాబాద్, కేతేపల్లి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రేడియం స్టిక్కర్లు గానీ, పార్కింగ్ లైట్లు గానీ లేకుండా రోడ్డుపై ఆగివున్న ఆ వ్యాను తీర్థయాత్ర ముగించుకొని కారులో తిరుగు ప్రయాణమైన వారి పాలిట మృత్యువై నిరీక్షించింది! మరో గంటలో ఇంటికి చేరుకుంటారనగా వారు ప్రయాణిస్తున్న కారు ఆ ఆగివున్న వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో నలుగురు మృతిచెందారు.
మృతుల్లో తండ్రి, కుమారుడు, అల్లుడు.. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురున్నారు. మిగతా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండ గ్రామ స్టేజీ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ మాదన్నపేటకు చెందిన ఉర్సుల కెంపురావు (75) రిటైర్డ్ ఉద్యోగి. ఆయన కుమారుడు ఉర్సుల వెంకట్ యాదవ్ (43), భార్య, కుమారుడితో కలిసి లండన్‌లో స్థిరపడ్డాడు. పది రోజుల క్రితం ఒక్కడే లండన్ నుంచి హైదరాబాద్‌కొచ్చాడు.
తండ్రి కెంపు రావు, తల్లి సువర్ణ, అక్కా, బావలు అశోక్ యాదవ్, అంబిక.. ఈ దంపతుల కుమారుడు గోవింద్, కూతురు అక్షిత, బడంగ్‌పేటకు చెందిన బాల్య స్నేహితుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి గోనె వెంకటరమణ (43)తో కలిసి మూడు రోజుల క్రితం వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం కారులో తిరుపతి బయలుదేరాడు. దర్శనం అయ్యాక వీరంతా బుధవారం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయణమయ్యారు.
గురువారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు.. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండ గ్రామ శివారులోని పోల్కంపల్లి స్టేజీ వద్ద ప్రమాదానికి గురైంది. అక్కడ ఎలాంటి సిగ్నల్ వేయకుండా రోడ్డుపై ఆగి ఉన్న వ్యానును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న అశోక్ యాదవ్, గొనె వెంకట రమణ, కెంపురావు అక్కడికక్కడే మృతిచెందారు. అక్షిత, అంబిక, సువర్ణ, వెంకట్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొందుతూ వెంకట్ యాదవ్ మృతి చెందా డు. మిగతా నలుగురిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మృతుల బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - Aug 30 , 2024 | 03:11 AM