ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌కు ఒప్పుకోం

ABN, Publish Date - Dec 20 , 2024 | 05:47 AM

గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌ నిర్మాణానికి ఒప్పుకోబోమని తెలంగాణ స్పష్టం చేసింది. అక్కడ రిజర్వాయర్‌ కడితే సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం)పై ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.

  • కృష్ణా జలాల్లో వాటా తేలాకే ‘అనుసంధానం’ చేపట్టాలి.. కేంద్రానికి తెలంగాణ స్పష్టీకరణ

  • త్వరలో రాష్ట్రాలతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీ: కేంద్రం

హైదరాబాద్‌/అమరావతి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌ నిర్మాణానికి ఒప్పుకోబోమని తెలంగాణ స్పష్టం చేసింది. అక్కడ రిజర్వాయర్‌ కడితే సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం)పై ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం ఢిల్లీలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం వర్చువల్‌ విధానంలో జరిగింది. ఆరు రాష్ట్రాలతో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షత వహించగా ఆ శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఈఎన్‌సీ (జనరల్‌) జీ అనిల్‌ కుమార్‌, అంతరాష్ట్ర వ్యవహారాల చీఫ్‌ ఇంజనీర్‌ ఓరుగంటి మోహన్‌కుమార్‌, ఎస్‌ఈ సల్లా విజయకుమార్‌, గోదావరి బేసిన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్రమణ్యం ప్రసాద్‌ పాల్గొన్నారు. ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌ కట్టకుండా సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం) బ్యారేజీలో 83 మీటర్ల పైన నిల్వ చేసిన నీటిని మాత్రమే, అందునా వానాకాలంలోనే తరలించాలని తెలంగాణ కోరింది. సమ్మక్కసాగర్‌ దిగువన ఉన్న ప్రాజెక్టులకు 152 టీఎంసీల అవసరాలు ఉన్నాయని తెలిపింది. అనుసంధానంలో తరలించే నీటిలో 50 శాతం (74 టీఎంసీల)ను కేటాయించాలని డిమాండ్‌ చేసింది.


బెడ్తి-వారాదా (కర్ణాటక )లింకు కింద తరలించే 18 టీఎంసీల్లో 9 టీఎంసీలను కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. కర్ణాటక తన వాటా 16 టీఎంసీలను ఆల్మట్టి నుంచి తరలించడాన్ని ఒప్పుకోబోమని కూడా తెలంగాణ స్పష్టం చేసింది. కృష్ణా జలాల పంపిణీపై మరో ఆరు నెలల్లో తీర్పు వెలువడే అవకాశం ఉన్నందున అప్పటి దాకా అనుసంధానంపై ముందుకు వెళ్లరాదని కోరింది. అనుసంధానం కోసం సమ్మక్క కన్వేయర్‌ (నీటి తరలింపు వ్యవస్థ)ను వినియోగించాలని, గొట్టిముక్కల వద్ద రెండు రిజర్వాయర్లు కట్టించాలని కోరింది. ఈ సమావేశానికి కీలకమైన ఛత్తీ్‌సగఢ్‌ దూరంగా ఉండిపోయింది. కాగా, గోదావరి-కావేరి అనుసంధానం వల్ల తమ రాష్ట్రానికి కలిగే ప్రయోజనమేమిటో స్పష్టంచేయాలని కర్ణాటక డిమాండ్‌ చేసిం ది. ప్రయోజనం పొందే తమిళనాడు మాత్రం త్వరగా ప్రారంభించాలని కోరింది. ఎంవోయూపై తమిళనాడు, పుదుచ్చేరి సంతకం చేశాయి. ఏపీ తరఫున పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో రాష్ట్రం వైఖరి కేంద్రానికి చేరలేదు. రాష్ట్రాలు అభిప్రాయాలను లిఖితపూర్వకంగా రెండ్రోజుల్లో అందజేయాలని పాటిల్‌ సూచించారు. గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి కావేరికి తరలించడం కాకుండా పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి తీసుకెళ్లాలని ఏపీ స్పష్టం చేయనుంది. త్వరలోనే ప్రభావిత రాష్ట్రాలతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం నిర్వహిస్తామని పాటిల్‌ తెలిపారు.

Updated Date - Dec 20 , 2024 | 05:47 AM