Hyderabad: ముఖ గుర్తింపు హాజరు ఐఏఎస్లకు వర్తించదా?
ABN, Publish Date - Dec 16 , 2024 | 03:34 AM
సచివాలయంలో ఈ నెల 12నుంచి ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఉదయం 10:30 గంటలలోపు విధులకు హాజరవుతున్నారు.
వారికి మినహాయింపుపై కింది స్థాయి ఉద్యోగుల్లో అసంతృప్తి
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సచివాలయంలో ఈ నెల 12నుంచి ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఉదయం 10:30 గంటలలోపు విధులకు హాజరవుతున్నారు. అయితే కింది స్థాయి ఉద్యోగులకు దీనిని తప్పనిసరి చేసి ఐఏఎస్‌లకు మినహాయింపు ఇవ్వడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని కొందరు అధికారులు చెబుతున్నారు. ఉదయం 10:30 గంటలకు వచ్చిన ఉద్యోగి సాయంత్రం 5గంటల తర్వాత కార్యాలయంలో ఉండి పని చేయమంటే తమ సమయం అయిపోయిందని వెళ్లిపోయే అవకాశం ఉంటుందంటున్నారు.
కొందరు ఐఏఎస్ అధికారులు మధ్యాహ్నం 2గంటల తర్వాత కార్యాలయానికి వస్తుండటం, మరికొందరు రాత్రి 8, 9 గంటల వరకు కార్యాలయంలోనే ఉంటుండటంతో వారి కోసం అదనంగా 2, 3గంటలు సచివాలయంలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుండడంపై కొందరు ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందనే వాదనలు ఉన్నాయి. సమయపాలన పాటించాలని ప్రభుత్వం ఒత్తిడి చేసినప్పుడు అదనపు సమయం కార్యాలయంలో ఉండాల్సిన అవసరం తమకు లేదనే ధోరణిలో కొందరు ఉద్యోగులు మాట్లాడుతున్నారు. సచివాలయంలో శాఖాధిపతి నుంచి కింది స్థాయి వరకు అందరికీ ముఖ గుర్తింపు హాజరును వర్తింపజేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
Updated Date - Dec 16 , 2024 | 03:34 AM