ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Education Development: రూ.5 వేల కోట్లతో.. సమీకృత గురుకులాలు

ABN, Publish Date - Aug 20 , 2024 | 03:47 AM

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయతలపెట్టిన సమీకృత గురుకులాలకు అవసరమైన భూములను సేకరించాలని, త్వరితగతిన డిజైన్లను పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు.

  • 30 ప్రాంతాల్లో 120 భవనాలు

  • 8 నెలల్లోపు పూర్తి చేయాలి

  • ప్రతి హాస్టల్‌ విద్యార్థికీ మంచం

  • 29లోగా నివేదికలు ఇవ్వాలి

  • గురుకులాలపై సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయతలపెట్టిన సమీకృత గురుకులాలకు అవసరమైన భూములను సేకరించాలని, త్వరితగతిన డిజైన్లను పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సమాహారంగా ఈ సమీకృత గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సోమవారం సచివాలయంలో ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల సంస్థల అధికారులతో సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్ల వ్యయంతో 30 చోట్ల 120 సమీకృత గురుకుల భవనాలను నిర్మించనున్నామని తెలిపారు. ఒకే సముదాయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు ఉంటాయని చెప్పారు. ఈ బడ్జెట్‌లో విద్యా రంగానికి పెద్దపీట వేశామన్నారు. సమీకృత గురుకులాలకు గ్రామీణ ప్రాంతాల్లో 15-25 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 10-15 ఎకరాల భూములు అవసరమవుతాయని, ఆ మేరకు భూసేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 8 నెలల్లో ఈ భవనాలను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా స్థలాలను సేకరించి, డిజైన్లను ఖరారు చేయాలని సూచించారు.


ఈ విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో 100 శాతం అడ్మిషన్లను పూర్తి చేయాలని చెప్పారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే ప్రతి విద్యార్థికీ మంచాన్ని కేటాయించాలని, ఎవరూ కింద పడుకోవడానికి వీల్లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని 1029 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో మంచాలు, దుప్పట్లు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎన్ని కావాలి? అన్న వివరాలను సమర్పించాలని ఆదేశించారు. గురుకుల పాఠశాలలు, హాస్టళ్లకు అవసరమైన మరుగుదొడ్లు, స్నానాల గదులు, నీరు, విద్యుత్తు వంటి సదుపాయాలన్నింటినీ కల్పించాలని చెప్పారు. ఈ సదుపాయాల కల్పనపై ఈ నెల 29లోగా నివేదికలు ఇవ్వాలన్నారు.


గురుకుల భవనాల అద్దె డబ్బును త్వరలోనే చెల్లిస్తామని తెలిపారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్పుల రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేసిన విజ్ఞప్తికి భట్టి సానుకూలంగా స్పందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల్లోని ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్పుల బకాయిల వివరాలను పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది బీసీ విద్యార్థులు 800 మందికి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు 500 మందికి ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్పులను అందజేస్తామని తెలిపారు. పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలను ఇటీవల తాను సందర్శించిన అనంతరం అక్కడ చేపట్టిన చర్యల గురించి సంస్థ కార్యదర్శి రమణకుమార్‌ను అడిగారు. విద్యార్థులకు మంచాలు, దుప్పట్లు, ఇతర సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని భట్టి ఆదేశించారు.

Updated Date - Aug 20 , 2024 | 03:48 AM

Advertising
Advertising
<