High Court: గ్రూప్-1పై అభ్యంతరాలకు అర్థం లేదు
ABN, Publish Date - Oct 04 , 2024 | 04:36 AM
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలపై వచ్చిన అభ్యంతరాలకు అర్థం లేదని గురువారం హైకోర్టులో టీజీపీఎస్సీ వాదించింది.
హైకోర్టులో వాదనలు.. విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలపై వచ్చిన అభ్యంతరాలకు అర్థం లేదని గురువారం హైకోర్టులో టీజీపీఎస్సీ వాదించింది. పరీక్షను రద్దుచేయాలని, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు చెల్లదని, తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలు విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్‌లపై విచారణ జరిగింది. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా పిటిషన్‌లు దాఖలు చేశారని తెలిపారు.
నిపుణులు పరిశీలించిన తర్వాతే ఫలితాలు, కీ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. 3 లక్షల మందికి లేని అభ్యంతరం ఒకరిద్దరికి ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. మెయిన్స్ కోసం సిద్ధమవుతున్న వారిని అయోమయానికి గురిచేయకూడదని పేర్కొన్నారు. త్వరలో మెయిన్స్ జరగనున్న నేపథ్యంలో ఈ దశలో జోక్యం చేసుకోరాదని తెలిపారు. ఒక పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకుని ప్రశ్నలు తప్పని పిటిషనర్లు పేర్కొనడం సరికాదని చెప్పారు. వారికి అర్థంకాకపోతే ప్రశ్నే తప్పు అని నిర్ధారణకు రాకూడదని తెలిపారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.
Updated Date - Oct 04 , 2024 | 04:36 AM