CM Revanth reddy: తుపాకీ సిద్ధంగా ఉంది ఒక్క తూటా చాలు
ABN, Publish Date - Apr 13 , 2024 | 02:58 AM
‘‘కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవడం ఇంకా ప్రారంభించనే లేదు.. తుపాకీ సిద్ధంగా ఉంది. ఒక్క తూటా చాలు.. నేను పిల్లులు, కుక్కలను కొట్టను. కొడితే పులినే కొడతాను’’ అని సీఎం రేవంత్ రెడ్డి ‘ఇండియా టీవీ’ సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించే ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్‌ను కొట్టాలంటే అసెంబ్లీలోనే వెళ్లి కొట్టేవాడినని.. అందుకు కుర్చీయే (అధికారమే) అవసరం లేదని చెప్పారు.
సింహమని చెప్తుర్రు కదా బయటకు రానివ్వండి..
పిల్లులు, కుక్కలతో పోరాడే వాడిని కాదు
జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలెట్టనే లేదు
కవిత అరెస్టుపై తెలంగాణలో చర్చ కూడా లేదు
కేటీఆర్ సంతోషం రెండు నెలల్లో తేలిపోతుంది
ఐదు సీట్లలో గెలుపునకు బీఆర్‌ఎస్‌కు బీజేపీ సుపారీ
ఈ ఎన్నికల్లో బీజేపీకి కష్టంగా 240 సీట్లు
400 రావాలంటే పాక్ ఎన్నికల్లోనూ గెలవాలి
నిధులు ఇచ్చి బడేభాయ్ అనిపించుకోమన్నా
మోదీతో సమావేశం ప్రభుత్వాధినేతల భేటీ మాత్రమే
వ్యవస్థలతో పోరాడను.. సత్సంబంధాలే కోరతా
మోదీ అదానీకి దేశాన్ని చౌకగా దోచిపెట్టారు
ఆ డబ్బుల్ని తెలంగాణలో పెట్టుబడి పెట్టించా
పెట్టుబడులకు భరోసా ఇస్తా... దోపిడీ చెయ్యనివ్వ
అధికార కోసమైతే బీజేపీలో చేరి మంత్రినయ్యేవాణ్ణి
సీఎంగా ఉండి బీజేపీలో చేరాల్సిన అవసరమేంటి?
పోరాడి సీఎంనయ్యా.. ఎవరి దయతో కాదు
ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్టు అవసరమా?
మోదీ నాయకత్వంలో బీజేపీ పట్టాలు తప్పింది
మందిర్ పనిచేయట్లేదని అవినీతి ఎత్తుకున్నారు
రాహుల్, ఖర్గే, వేణుగోపాల్‌లలో ఒకరు ప్రధాని
ఇండియా టీవీ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్
ఆప్ కీ అదాలత్‌లో ముఖ్యమంత్రికి చప్పట్ల వర్షం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ‘‘కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవడం ఇంకా ప్రారంభించనే లేదు.. తుపాకీ సిద్ధంగా ఉంది. ఒక్క తూటా చాలు.. నేను పిల్లులు, కుక్కలను కొట్టను. కొడితే పులినే కొడతాను’’ అని సీఎం రేవంత్ రెడ్డి ‘ఇండియా టీవీ’ సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించే ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్‌ను కొట్టాలంటే అసెంబ్లీలోనే వెళ్లి కొట్టేవాడినని.. అందుకు కుర్చీయే (అధికారమే) అవసరం లేదని చెప్పారు. అలాగే.. కవితను తెలంగాణలో జరిగిన అవినీతికి అరెస్టు చేయలేదని, ఢిల్లీలో జరిగిన అవినీతికి అరెస్టు చేశారని రేవంత్ గుర్తుచేశారు. కేసీఆర్‌ను అరెస్టు చేస్తే తెలంగాణ ఎన్నికల్లో ఏమైనా ప్రభావం ఉండేదిగానీ.. కవిత అరెస్టు ఏ మాత్రం ప్రభావం చూపదని, ఆ అంశంపై చర్చ కూడా జరగదని ఆయన తేల్చిచెప్పారు.
రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటారని, కేసీఆర్ ఉన్నంత కాలం రేవంత్ ఉంటారని వ్యాఖ్యానించారు. ‘ఆప్ కీ అదాలత్’లో పాల్గొనేందుకు రేవంత్ ప్రత్యేకంగా గురువారం ఢిల్లీకి వచ్చి వెళ్లిపోయారు. రజత్ శర్మతో పాటు ప్రేక్షకులు అడిగిన పదునైన ప్రశ్నలకు తనదైన శైలిలో ఆయన ఇచ్చిన జవాబులకు అడుగడుగునా చప్పట్ల వర్షం కురిసింది. ఈ ఇంటర్వ్యూను ‘రేవంత్ రెడ్డి రోర్స్ (ఆర్‌ఆర్‌ఆర్)’ పేరుతో ఇండియా టీవీ శనివారం రాత్రి ప్రసారం చేయనున్నది. ఉత్తర భారతంలో బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మీడియాలో రేవంత్ రెడ్డి తొలిసారి తన బలమైన ముద్ర వేశారు.
మోదీ బూటకపు హామీలు..
మోదీ నేతృత్వంలోని బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు రావాలంటే ఒక్క భారతదేశంలో పోటీ చేస్తే చాలదని, పాకిస్తాన్‌లో కూడా ఆ పార్టీ పోటీ చేయాలని రేవంత్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీజేపీ యూపీ, ఢిల్లీ, బిహార్ తదితర రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలుచుకుందని, ఈసారి ఆయా రాష్ట్రాల్లో మళ్లీ అన్ని సీట్లు రావడం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. కమలనాథులకు ఈసారి 200-240 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. దక్షిణాదిన ఉన్న 129 సీట్లలో కర్ణాటకలో 10-12, తెలంగాణలో రెండు సీట్ల కంటే ఎక్కువ రావని.. అలాంటప్పుడు దేశవ్యాప్తంగా 400 సీట్లు ఎక్కణ్నుంచి వస్తాయని ప్రశ్నించారు. కేసీఆర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 100 సీట్లకు పైగా వస్తాయన్నారని.. కానీ 39 మాత్రమే వచ్చాయని గుర్తుచేశారు. రాజకీయ నాయకులు ఒక వాతావరణం కల్పించేందుకు.. వాట్సాప్ యూనివర్సిటీల్లో ప్రచారం కోసం గొప్పలు చెప్పుకోవడం సహజమని పేర్కొన్నారు.
మోదీ అసలు విజయం వాట్సాప్ యూనివర్సిటీల్లోనేనని ఎద్దేవా చేశారు. ఈసారి ప్రజలు ఆలోచిస్తున్నారని.. నిరుద్యోగం, అధిక ధరలు జనంపై తీవ్ర ప్రభావం చూపుతాయని రేవంత్ స్పష్టం చేశారు. యువకుల్లో 62 శాతం నిరుద్యోగులేనని.. వారు మోదీ వ్యతిరేకులేనని ఒక సర్వేలో తేలిందని గుర్తుచేశారు. నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయని.. మోదీ అన్నీ బూటకపు హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ.. 7 కోట్ల మందికే ఇచ్చారని.. పార్లమెంట్‌లో తాను అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పారని వెల్లడించారు.
జన్ ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్నారని.. ఆ డబ్బులు ఎక్కడొచ్చాయని అడిగారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారని చెప్పారని.. కానీ ఇవాళ ఢిల్లీలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, నెలల తరబడి రైతులు ధర్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు చేసిన వాగ్దానం ప్రకారం ఇళ్లు ఎక్కడ ఇచ్చారని నిలదీశారు. అయినప్పటికీ మోదీ మూడోసారి ప్రధాని అవుతానని కలలు కంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 67 సంవత్సరాల్లో 14 మంది ప్రధానమంత్రులు రూ.55 లక్షల కోట్లు అప్పు చేస్తే.. మోదీ గత పదేళ్లలో రూ.113 లక్షల కోట్ల మేర అప్పులు చేశారని.. ఆ డబ్బంతా ఎక్కడకు వెళ్లిందని నిలదీశారు. గత ప్రధానులు ఎన్నో ఆనకట్టలు కట్టారని, ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.
వ్యవస్థలతోపోరాడను..
‘‘మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసిన రాహుల్‌గాంధీ.. మోదీని ‘కౌకదార్ చోర్‌హై’ అంటారు. మీరు మాత్రం మోదీని ‘బడే భాయ్’ అంటారు? అని రజత్‌శర్మ ప్రశ్నించగా.. ‘‘మీరు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. నేను సీఎం అయ్యాక తొలిసారి ప్రఽధాని మోదీ మా రాష్ట్రానికి వచ్చారు. మేమిద్దరమూ ఒకే వేదికపై కూర్చున్నాము. ప్రధానిగా ఆయన దేశానికేపెద్దన్నలాంటివారు. నాకేకాదు, ఈ దేశంలో ముఖ్యమంత్రులందరికీ ఆయన బడేభాయ్ లాంటివారు. అందుకే.. ‘మీరు పెద్దరికం చూపాలి. మీరు గుజరాత్‌కు గిఫ్ట్ సిటీ తెచ్చారు. సబర్మతీ రివర్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేశారు. మా తె లంగాణకు కూడా మూసీ రివర్ ఫ్రంట్ ఇవ్వండి. అభివృద్ధి కోసం ఎన్ని నిధులివ్వాల్సి ఉంటే అన్ని నిధులూ ఇచ్చి ‘బడే భాయ్’ అని నిరూపించుకోండి’ అని చెప్పాను’’ అని రేవంత్ జవాబిచ్చారు. మోదీ ఎప్పూడూ 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడతారని.. అది రావాలంటే దేశంలో ఐదు మెట్రోపాలిటన్ నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా.. అన్నీ అభివృద్ధి చెందాలని రేవంత్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు రావాలన్నారు. ‘మోదీజీ, మీరు తెలంగాణకు అన్యాయం చేశారు. తెలంగాణకు రావల్సిన ప్రాజెక్టులన్నీ భయపెట్టి, బెదిరించి గుజరాత్ కు తీసుకువెళుతున్నారు. అందుకే బడేభాయ్ లాగా మాకు మద్దతివ్వాలి’ అని చెప్పానని రేవంత్ తెలిపారు. ప్రధానితో తన సమావేశం ఇద్దరు రాజకీయ నేతల మధ్య భేటీ కాదని.. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాధినేతల మధ్య సమావేశమని రేవంత్ వివరణ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలుండాలని.. వ్యవస్థలతో తాను పోరాడదల్చుకోలేదని సీఎం స్పష్టం చేశారు. కేంద్రం, గవర్నర్, ప్రధాని లాంటి వ్యవస్థలతో తాను పోరాడనని.. బీజేపీతో సైద్ధాంతిక పోరాటం చేస్తానని తేల్చిచెప్పారు. ‘‘కానీ రాహుల్ గాంధీ కేంద్రంతో రోజూ పోరాడుతూనే ఉంటారు కదా?’’ అన్న ప్రశ్నకు.. రాహుల్ కూడా బీజేపీతో సైద్ధాంతిక పోరాటమే చేస్తున్నారని సమాధానమిచ్చారు. రాహుల్ ఒక రాజకీయ పార్టీ అధినేతగా మాట్లాడడం వేరని.. ఒక సీఎంగా తాను మాట్లాడుతున్నప్పుడు రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుంటానని స్పష్టత ఇచ్చారు.
అదానీ జేబులో డబ్బులతో..
‘‘రాహుల్ గాంధీ గౌతమ్ అదానీని జేబు దొంగ అన్నారు. మౌనంగా జేబు కత్తిరిస్తారని విమర్శించారు. కానీ మీరు సీఎం కాగానే అదానీకి రూ.12,500 కోట్ల మేర ప్రాజెక్టులు ఇచ్చారు కదా?’’ అని ర జత్ శర్మ ప్రశ్నించగా.. రేవంత్ గట్టిగా బదులిచ్చారు. ప్రభుత్వం నిర్మించిన రేవులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, నవరత్న సంస్థలను మోదీ అతి చౌకధరలకు అదానీకి కట్టబెట్టారని.. తాను అదానీ జేబులో ఉన్న డబ్బులతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టించానని, రెంటికీ తేడా అది అని చెప్పారు. తాను తెలంగాణ ఆస్తులేవీ అదానీకి కట్టబెట్టలేదని.. విద్యుత్, కృత్రిమ మేధ రంగాల్లో అదానీ పెట్టుబడులు స్వీకరించానని గుర్తుచేశారు. అదానీ అయినా, అంబానీ అయినా టాటా అయినా బిర్లా అయినా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకొస్తే తాను ఆహ్వానిస్తానని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం అన్నిటినీ చవకగా అదానీకి కట్టబెడుతోందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని రేవంత్ పేర్కొన్నారు.
అదానీతో రేవంత్ దిగిన ఫొటోను రజత్ శర్మ ప్రదర్శించినప్పుడు.. ‘మంచి ఫొటో’ అని రేవంత్ కితాబిచ్చారు. తానేమీ అదానీని రహస్యంగా కలుసుకోలేదని.. బహిరంగంగా ప్రజల ముందు కలుసుకుని, పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరానని గుర్తుచేశారు. ‘మీరు కూడా తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెడితే ఆహ్వానిస్తాను’ అని రజత్‌శర్మపై చలోక్తి విసిరారు. తాను సీఎంగా ఉన్న తెలంగాణలో అదానీని దోపిడీ చేయనివ్వనని స్పష్టం చేశారు. ‘‘పెట్టుబడిదారులకు నేను భరోసాగా నిలుస్తాను. గ్యారంటీ ఇస్తాను. కానీ, దోపిడీ మాత్రం చేయనివ్వను. పెట్టుబడికి లూటీకి తేడా ఉంది’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
కేజ్రీ అరెస్టు అక్రమమే..
కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారని.. అందువల్ల ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడంలో తప్పేమీ లేదని రేవంత్ అన్నారు. రెండేళ్లుగా కేసులు నడుస్తుంటే ఎన్నికల సమయంలో ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. ‘‘రెండు నెలల తర్వాత అరెస్టు చేసి ఉంటే కొంప మునిగేది కాదు కదా? సాక్ష్యాధారాలుంటే రెండేళ్లుగా ఎందుకు మౌనంగా ఉన్నారు?’’ అని నిలదీశారు. అవినీతికి శిక్ష పడకూడదని తాను అనట్లేదని.. కానీ ఎలా అరెస్టు చేశారో కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది దేశానికి మంచిదా అని అడిగారు. ‘‘వంద కోట్ల రూపాయలు మద్యం వ్యాపారుల నుంచి తీసుకుని గోవా, పంజాబ్ ఎన్నికల్లో ఉపయోగించారనేదే కదా మీ ఆరోపణ! కానీ.. అదే మద్యం వ్యాపారి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.400-500 కోట్లు భారతీయ జనతా పార్టీకి అరెస్టు తర్వాత ఇచ్చారు’’ అని రేవంత్ గుర్తుచేశారు. ‘‘బీజేపీ వైట్‌లో తీసుకుంది. వారు బ్లాక్‌లో తీసుకున్నారు ఏం తేడా?’’ అని ప్రశ్నించారు. దీని ప్రభావం ఎన్నికలపై తప్పకుండా ఉంటుందని.. ప్రజలు అన్నీ చూస్తున్నారని తెలిపారు. రూ.22,500 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో వసూలుచేస్తే అందులో రూ.7వేల కోట్లు బీజేపీకి వచ్చాయని గుర్తుచేశారు. బీజేపీకి నిధులిచ్చినవారంతా ఎవరు? అని నిలదీశారు. వారంతా ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా అని వ్యాఖ్యానించారు.
బీజేపీకి, బీఆర్‌ఎ్‌సకు, టీఎంసీకి తేడా ఏమున్నదని.. బీజేపీ నీతి వాక్యాలు ఎందుకు పలుకుతోందని ప్రశ్నించారు. బీజేపీకి, ఇతర అవినీతి పార్టీలకూ తేడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను విద్యార్థి పరిషత్ కాలం నుంచీ బీజేపీని చూస్తున్నానని.. ఎన్నికల ముందు ఎప్పుడూ బీజేపీ ఒక ఎజెండాను ఖరారు చేస్తుందని.. కానీ మొదటిసారి మోదీ నాయకత్వంలో బీజేపీ ఖరారు చేసిన ఎజెండా ప్రకారం ఎన్నికల్లోకి వెళ్లడం లేదని రేవంత్ విశ్లేషించారు. మోదీ నాయకత్వంలో బీజేపీ పట్టాలు తప్పిందన్నారు. 2024 ఎన్నికల్లో రామమందిరం పేరుతో ఎన్నికల్లోకి వెళ్లాలని నిర్ణయించారని.. కానీ మందిర నిర్మాణం పూర్తికాగానే సోరేన్, కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని.. ఇప్పుడు టీవీల్లో రామమందిరం బదులు అరెస్టుల గురించి చర్చ జరుగుతోందని రేవంత్ గుర్తుచేశారు.
బీజేపీవారు తమ ఎజెండాను తామే నీరుగార్చారని వ్యాఖ్యానించారు. అవినీతిపరులను వదిలిపెట్టబోనని, అందర్నీ జైలుకు పంపిస్తానని మోదీ అంటున్నారని.. అలా అయితే హిమంత విశ్వ శర్మ, జ్యోతిరాదిత్య సింధియా, నవీన్ జిందాల్, అశోక్ చవాన్, అజిత్ పవార్‌పై కూడా కేసులు ఉన్నాయి కదా వారిని ఎందుకు జైలుకు పంపలేదు? అని రేవంత్ నిలదీశారు. ఈడీ కేసులున్నవారందరూ బీజేపీలో చేరిన వెంటనే మహాత్ములయ్యారని ఎద్దేవా చేశారు. వారందర్నీ పక్కన పెట్టుకుని తాను అవినీతికి వ్యతిరేకినని మోదీ అంటున్నారని మండిపడ్డారు. మోదీ అవినీతిపరుడని తాను అనడం లేదని.. కానీ ఆయన పక్కన ఉన్నవారి సంగతేమిటని ప్రశ్నించారు. అవినీతిపరులను లోపలికి పంపిస్తానని మోదీ అంటే బీజేపీలోకి పంపించడమా అని అడిగారు.
అలాగే మాట్లాడతారు..
కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయినవారు బీజేపీ భాషలో మాట్లాడడంలో ఆశ్చర్యంలేదని.. పదవుల కోసం, కేసుల నుంచి తప్పించుకునేందుకు వారు అలా మాట్లాడతారని రేవంత్ అన్నారు. ఈడీ కేసుల వల్ల బీజేపీలో చేరేవారు పెరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆదాయ పన్ను, సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ కేసుల్లో ఏదో ఒకటి ఎంచుకొమ్మని మోదీ వారిని బెదిరిస్తున్నారని విమర్శించారు. ‘‘మరి బీఆర్ ఎస్ నేతల్ని మీ పార్టీలో చేర్చుకుంటున్నారు కదా? మీరు కూడా వాషింగ్ మెషీన్ వాడుతున్నారా?’’ అని అడగ్గా.. తామింకా వాషింగ్ మెషీన్ కొనుక్కోలేదని రేవంత్ బదులిచ్చారు.
ఇవి కూడా చదవండి..
Telangana:ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం.. పలు చోట్ల వర్షాలు
Mixer Grinder vs Blender: మిక్సర్ గ్రైండర్ vs బ్లెండర్.. వీటి మధ్య తేడాలేంటో తెలుసా?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
Updated Date - Apr 13 , 2024 | 12:16 PM