Yadadri Hospital: 20 నిమిషాలు చీకట్లోనే జిల్లా ఆస్పత్రి
ABN, Publish Date - May 24 , 2024 | 04:32 AM
యాదాద్రి భువనగిరి జిల్లా ఆస్పత్రిలో బుధవారం రాత్రి 20 నిమిషాల పాటు అంధకారం నెలకొంది. సెల్‌ఫోన్ టార్చ్ వెలుతురులోనే వైద్యులు రోగులకు చికిత్స అందించాల్సి వచ్చింది. వర్షాలతో ఆస్పత్రికి విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరాను రాత్రి 9.30 గంటలకు నిలిపివేశారు.
సెల్‌ఫోన్ టార్చ్ వెలుగులో వైద్య చికిత్సలు
సాంకేతిక లోపంతో విద్యుత్ సరఫరా నిలిపివేత
పనిచేయని జనరేటర్.. అధ్వానంగా నిర్వహణ
7 నిమిషాల్లో సరఫరా పునరుద్ధరించామన్న సీఎండీ
భువనగిరి టౌన్, మే 23: యాదాద్రి భువనగిరి జిల్లా ఆస్పత్రిలో బుధవారం రాత్రి 20 నిమిషాల పాటు అంధకారం నెలకొంది. సెల్‌ఫోన్ టార్చ్ వెలుతురులోనే వైద్యులు రోగులకు చికిత్స అందించాల్సి వచ్చింది. వర్షాలతో ఆస్పత్రికి విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరాను రాత్రి 9.30 గంటలకు నిలిపివేశారు. దాంతో 150 పడకల ఆస్పత్రిలో అంధకారం అలుముకుంది. ఆస్పత్రి సిబ్బంది 10 నిమిషాల తర్వాత జనరేటర్‌ను ఆన్ చేయగా అది కొద్దిసేపటికే ఆగిపోయింది. డయాలసిస్, ప్రసూతి, పిల్లల వార్డులు, ఆపరేషన్ థియేటర్‌లో ఇన్వర్టర్లు ఉండగా ఎమర్జెన్సీ వార్డులోని ఇన్వర్టర్ మాత్రం పనిచేయడం లేదు. దాంతో అక్కడ, ఇతర వార్డుల్లో రెండుసార్లు సుమారు 20 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో వచ్చిన రోగులకు, ఇన్‌పేషెంట్లకు వైద్యులు, సిబ్బంది సెల్‌ఫోన్ టార్చిలైట్ల వెలుతురులోనే వైద్య సేవలు అందించారు.
ఆ వెలుతురులోనే ఇంజక్షన్లు ఇచ్చారు. జనరేటర్‌కు మరమ్మతులు చేసేలోపు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. రాష్ట్రంలో కరెంటు కోతలకు ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తన ‘ఎక్స్’ ఖాతాలో బుధవారం రాత్రి ట్వీట్ చేశారు. ఆస్పత్రికి 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యేలా ప్రత్యేక లైన్ ఏర్పాటుకు ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో చర్చిస్తానని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ఆస్పత్రిని పరిశీలించిన ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చిన్నానాయక్ స్పందిస్తూ తాత్కాలిక విద్యుత్ అవాంతరాలతో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగలేదన్నారు. గురువారం జనరేటర్‌కు పూర్తిస్థాయి మరమ్మతులు చేయించినట్లు తెలిపారు. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ మీడియాతో మాట్లాడుతూ సాంకేతిక సమస్యలతో నిలిచిన విద్యుత్ సరఫరాను ఏడు నిమిషాల్లో పునరుద్ధరించామని తెలిపారు.
Updated Date - May 24 , 2024 | 04:32 AM