TPCC President Mahesh Kumar Goud : పటేల్‌కు.. బీజేపీకి ఏంటి సంబంధం?
ABN, Publish Date - Sep 18 , 2024 | 04:39 AM
‘‘స్వాతంత్ర్యానంతరం దేశంలోని అన్ని సంస్థానాలను విలీనం చేసే బాధ్యతను తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. తనకు అత్యంత సన్నిహితుడైన అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు అప్పగించారు.
ఆయన నెహ్రూకు అత్యంత సన్నిహితుడు.. విలీనంలో ఎలాంటి పాత్రా లేని బీజేపీ
మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్..తెలంగాణ తల్లి
విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు?
ప్రజా పాలన వేడుకల్లో మహేష్ గౌడ్
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘స్వాతంత్ర్యానంతరం దేశంలోని అన్ని సంస్థానాలను విలీనం చేసే బాధ్యతను తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. తనకు అత్యంత సన్నిహితుడైన అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు అప్పగించారు. పటేల్.. నెహ్రూకు అత్యంత సన్నిహితుడే కాకుండా.. స్వాతంత్య్ర సమరయోధుడు కూడా. స్వాతంత్ర పోరాటంలో కానీ.. హైదరాబాద్ సంస్థానం విలీనంలో కానీ ఎలాంటి పాత్ర లేని బీజేపీకి.. పటేల్‌తో ఎలాంటి సంబంధమూ లేదు. అలాంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీకి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ అన్నారు. సెప్టెంబరు 17 సందర్భంగా గాంధీభవన్‌లో మంగళవారం ప్రజాపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా గాంధీ, నెహ్రూ, పటేల్ చిత్రపటాలకు మహే్‌షకుమార్‌గౌడ్ నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మహే్‌షకుమార్‌గౌడ్ మాట్లాడుతూ సంస్థానాల విలీనంలో నెహ్రూ, పటేల్‌ల దూరదృష్టి, గొప్పదనం, దేశం కోసం వారు చేసిన సేవలు ఒక చరిత్రన్నారు. ఈ రోజున మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న బీజేపీకి, ఈ చరిత్రకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారని, ఆరోజున జనసంఘ్, బీజేపీలు లేవన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూలకారణమైన సోనియాగాంధీని, ఆమె కుటుంబాన్ని కించపరచడం.. బీఆర్‌ఎస్ నీతిమాలిన చర్యలకు పరాకాష్ట అని విమర్శించారు.
దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన రాజీవ్ విగ్రహాన్ని సచివాలయం ముందు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించడం ఆ పార్టీకి తగదన్నారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించిందని చెప్పారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ ప్రజా ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుందని ఆయన పేర్కొన్నారు.
Updated Date - Sep 18 , 2024 | 04:39 AM