Tummala: బీఆర్‌ఎస్ హయాంలో రూ.25వేల కోట్ల దుర్వినియోగం
ABN, Publish Date - Oct 21 , 2024 | 04:12 AM
సాగులో లేని భూములకు కూడా రైతుబంధు ఇచ్చి రూ.25వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిన ఖ్యాతి మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.
సాగులో లేని భూములకూ రైతుబంధు ఇచ్చారు: తుమ్మల
ఖమ్మం సంక్షేమ విభాగం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): సాగులో లేని భూములకు కూడా రైతుబంధు ఇచ్చి రూ.25వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిన ఖ్యాతి మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు పథకాల పేరుతో రూ.7,600 కోట్ల అప్పులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టిందన్నారు. గత ప్రభుత్వంలో చేసిన వందల కోట్ల అప్పులను తాము తీరుస్తున్నామన్నారు.
రైతుబంధు పథకం పేరుతో వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ యాంత్రీకరణ, పంటల బీమా, డ్రిప్ ఇరిగేషన్ పథకాలను బీఆర్‌ఎస్ బొందపెట్టిందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల భీమా, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండదండగా నిలుస్తుందని తుమ్మల చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలనలో మొదటి ఏడాదిలోనే రైతులకు రూ.27వేల కోట్లు సంక్షేమానికి చెల్లించామన్నారు. సన్న వడ్లకు క్వింటాళ్లకు రూ.500 బోన్‌సతో ఎకరానికి రూ.8-10వేల వరకు ప్రోత్సాహకం అందుతుందన్నారు. వరంగల్‌లో చేసిన రైతు డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నామని, డిసెంబర్ 9 నాటికి పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ అమలు చేస్తామని తుమ్మల స్పష్టం చేశారు.
Updated Date - Oct 21 , 2024 | 04:12 AM