TS News: మా నాన్నని బతికించండి..
ABN , Publish Date - May 10 , 2024 | 06:05 AM
కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ తండ్రికి చికిత్స చేయించేందుకు అవసరమైన ఆర్థిక సాయం చేయాలంటూ ఇద్దరు చిన్నారులు వేడుకుంటున్నారు.
అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్న సిద్దిపేట వాసి
నాలుగు నెలలుగా కొనసాగుతున్న చికిత్స
మెరుగైన చికిత్స కోసం దాతలు సాయం కోరుతూ కన్నబిడ్డల వేడుకోలు
సిద్దిపేట టౌన్, మే9: కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ తండ్రికి చికిత్స చేయించేందుకు అవసరమైన ఆర్థిక సాయం చేయాలంటూ ఇద్దరు చిన్నారులు వేడుకుంటున్నారు. అలాగే, తమ కొడుకుని కాపాడుకునేందుకు సాయం చేయాలంటూ ఆ రోగి తల్లిదండ్రులూ కన్నీటి పర్యంతమవుతున్నారు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల రాము, సునీత దంపతులకు కుమారుడు సాయిచరణ్ (35) ఉన్నాడు. సాయిచరణ్‌కు భార్య లక్ష్మిప్రసన్న, కుమార్తెలు లక్ష్మిసుసజ్ఞ(6), స్మయ(2 నెలలు) ఉన్నారు.
నాలుగు నెలల క్రితం సాయిచరణ్‌కు తీవ్రమైన జ్వరం రావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కానీ, జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చేసిన వైద్య పరీక్షల్లో సాయిచరణ్.. అక్యుర్డ్ మైలాయిడ్ లుకేమియా (బ్లడ్ క్యాన్సర్)తో బాధపడుతున్నట్టు తేలింది. జన్యు మార్పిడి కారణంగా కోటి మందిలో ఒకరికి వచ్చే ఈ క్యాన్సర్ ప్రాణాంతకమని, వెంటనే చికిత్స ప్రారంభించాలని వైద్యులు సూచించారు. దీంతో సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలో తమ ఇంటిని విక్రయించగా వచ్చిన రూ.18 లక్షలతో కుటుంబసభ్యులు సాయిచరణ్‌కు చికిత్స చేయించారు. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నాలుగు నెలలుగా కీమోథెరపీ చేయించుకున్న సాయిచరణ్‌కు మరో రెండ్రోజుల్లో స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉంది.
ఈ ప్రక్రియలో భాగంగా తండ్రి రాము రక్తమూలకణాలను సాయిచరణ్‌కు ఎక్కిస్తారు. ఈ చికిత్స ద్వారా ఏడాదిన్నరలోగా సాయిచరణ్‌కు ఉన్న వ్యాధి 90 శాతం తగ్గే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే, ఈ చికిత్సకు రూ.25 లక్షలు అవసరం. వెల్డింగ్ దుకాణంలో పని చేసి రాము ప్రస్తుతం అన్నీతాన్నై కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పటికే ఉన్న ఇంటిని అమ్మేసిన ఆ కుటుంబం చికిత్సకు అవసరమైన డబ్బు కోసం దాతల సాయం కోరుతోంది. ఇద్దరు చిన్నారుల తండ్రైన సాయిచరణ్‌కు సాయం చేయాలనుకునే దాతలు 92955 55855 నెంబరుకు ఫోన్‌పే ద్వారా డబ్బు పంపించాలని లేదా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులోని సిరిసిల్ల సాయిచరణ్ ఖాతా( 239901000004002, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఐఓబీఏ0002399)లో నగదు జమచేయాలని ఆ కుటుంబం కోరింది.