ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఇంటర్మీడియట్‌వరకూ తెలుగును తప్పనిసరి చేయాలి

ABN, Publish Date - Nov 19 , 2024 | 02:35 AM

‘‘తెలుగు రాష్ట్రాలను ఇంగ్లిష్‌ అనే వ్యామోహం కమ్మేసింది’’ అని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ మాతృభాషకు ప్రమాదం లేదని, ఈ విషయంలో ఒడిశా కూడా మనకన్నా మెరుగ్గానే ఉందని వ్యాఖ్యానించారు.

  • ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు.. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’

  • మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ సూచన

  • దక్షిణాదిన మరే రాష్ట్రంలో మాతృభాషకు ముప్పు లేదు

  • తెలుగు రాష్ట్రాల్ని ఆంగ్ల వ్యామోహం కమ్మేసిందని ఆవేదన

  • పోలవరపు కోటేశ్వరరావు సాహిత్యసర్వస్వం ఆవిష్కరణ

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలుగు రాష్ట్రాలను ఇంగ్లిష్‌ అనే వ్యామోహం కమ్మేసింది’’ అని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ మాతృభాషకు ప్రమాదం లేదని, ఈ విషయంలో ఒడిశా కూడా మనకన్నా మెరుగ్గానే ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్న తేడా లేకుండా, సిలబస్‌ ఏదైనా.. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ తెలుగును తప్పనిసరి చేయడం ద్వారా మాత్రమే ఉభయ రాష్ట్రాల్లో మాతృభాష బతుకుతుందని పేర్కొన్నారు. అప్పుడే సాహిత్యానికి మంచి రోజులొస్తాయని, తెలుగు జాతి మనుగడ అద్భుతంగా ఉంటుందని బలంగా నొక్కిచెప్పారు. లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ నిర్వహణలో.. దివంగత పోలవరపు కోటేశ్వరరావు సాహిత్య సర్వస్వం మూడో సంపుటిని సోమవారం మాదాపూర్‌లోని దస్‌పల్లా హోటల్‌లో వేమూరి రాధాకృష్ణ ఆవిష్కరించారు.


పుస్తక ప్రతులను పోలవరపు కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు హీరో అక్కినేని నాగార్జున అందించారు. పుస్తకాన్ని ముద్రించిన రైతునేస్తం వెంకటేశ్వరరావును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన వేమూరి రాధాకృష్ణ.. ఆనాటి గ్రామీణ సంస్కృతి ఇతివృత్తంగా పోలవరపు కోటేశ్వరరావు రాసిన కథలు ఎంతో పఠనాసక్తి కలిగిస్తాయని కొనియాడారు. అయితే ఇప్పుడు మన గ్రామాలను ఇంగ్లిష్‌ కమ్మేసిందని.. గ్రామీణ జీవితమే దాదాపుగా కనుమరుగవుతున్న పరిస్థితిని చూస్తున్నామని విచారం వ్యక్తం చేశారు. ‘‘తెలుగు సాహిత్యం వర్ధిల్లాలంటే, ముందు తెలుగు భాష మనుగడ సాగించాలి. అలాంటిది తెలుగు భాషకే మరణం దాపురించినప్పుడు, ఇక సాహిత్యం పరిస్థితి ఏమిటనేది పెద్ద ప్రశ్న. ఇప్పటి తరంలో తెలుగు అంటే దాదాపుగా ఏమిటి అనే దుస్థితి దాపురించింది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. తెలుగునాట తెలుగులో తప్ప అన్ని భాషల్లో బోర్డులుంటున్నాయని విమర్శించారు. పొరుగు రాష్ట్రాల వారు మాతృభాషతో పాటు ఇతర భాషలు కూడా నేర్చుకోడానికి ఆసక్తి చూపుతుంటే, మనం మాత్రం ‘తెలుగు వద్దు - ఇంగ్లిష్‌ మాత్రమే కావాలి’ అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.


ఒకవేళ ఎవరైనా దీన్ని ఆక్షేపిస్తే, వాళ్లను పేదల వ్యతిరేకి, పెత్తందారీల ప్రతినిధి అంటున్నారని ఆక్షేపించారు. తెలుగు భాష కోసం పత్రిక, చానల్‌ ద్వారా తనవంతు కృషిచేస్తానని రాధాకృష్ణ అన్నారు. శేష జీవితాన్ని భాష కోసం అంకితంచేయాల్సిందిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు సూచించారు. ఇక.. పోలవరపు కోటేశ్వరరావు చేసిన సాహిత్య సేవ గురించి సభాధ్యక్షత వహించిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ వివరించారు. వేమూరి రాధాకృష్ణ సూచన మేరకు తాను తెలుగు భాషాభివృద్ధి కోసం పనిచేస్తానని ప్రకటించారు. సాహితీ, సినీ, మీడియా రంగాలు కలిస్తే తెలుగు భాషకు, సాహిత్యానికి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కోటేశ్వరరావు సమగ్ర సాహిత్యాన్ని ప్రచురించిన ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. ఇక.. ఈ శతాబ్దపు ఉత్తమ కథకుల్లో ఒకరు పోలవరపు కోటేశ్వరరావు అని ఎమెస్కో సంస్థల నిర్వాహకుడు దూపాటి విజయకుమార్‌ కొనియాడారు. ఆయన అన్ని ప్రక్రియల్లో సాహిత్య సృజన చేశారని ప్రశంసించారు. ప్రజలను మంచివైపు మళ్లించే శక్తి సినిమా రంగానికి ఉందిగనుక.. నాగార్జున లాంటి సినీ ప్రముఖులు సాహిత్యాభిరుచిని వ్యక్తం చేయడం వల్ల తెలుగు భాషా, సాహిత్యాలకు మరింత మేలు జరుగుతుందన్నారు. కాగా.. తెలుగులో సాహిత్యానికి ప్రాధాన్యమిస్తున్న పత్రిక ‘ఆంధ్రజ్యోతి’ మాత్రమే అని వక్తలు కొనియాడారు.

Updated Date - Nov 19 , 2024 | 02:35 AM