BRS: మహబూబాబాద్‌లో గురువారం బీఆర్ఎస్ మహాదర్నా
ABN, Publish Date - Nov 20 , 2024 | 09:11 AM
లగచర్ల ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం ఆరా తీసినట్టు సమాచారం. దాడికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని రాష్ట్రపతి కార్యాలయం బీఆర్‌ఎస్‌ను కోరినట్టు తెలిసింది. ఫార్మా విలేజ్‌కు భూసేకరణ విషయంలో లగచర్ల గ్రామస్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరును, వార్త కథనాలను రాష్ట్రపతి కార్యాలయానికి బీఆర్‌ఎస్ అందించినట్టు సమాచారం.
హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కీలక నిర్ణయం (BRS key decision) తీసుకుంది. ఆ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా (Maha Dharn) జరగనుంది. గురువారం మహబూబాబాద్ వేదికగా జరగనున్న ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పాల్గొంటారు. రాష్ట్రంలో గిరిజనులు, దళితలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ మహాదర్నా కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే లగచర్ల ఘటనను సీరియస్ గా తీసుకున్న పార్టీ.. జాతీయస్థాయిలో కేటీఆర్ ఎండగట్టారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు బుధవారం మహబూబ్‌నగర్‌కు వెళ్లనున్నారు. ఉదయం11.30 గంటలకు కురుమూర్తి జాతరలో ఆయన పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు కురుమూర్తి గ్రామంలో హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే…. రేపు మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించనుంది.
బీఆర్ఎస్ లగచర్ల ఘటన , గిరిజన సమస్యలపై పోరాటం చేయనుంది. లగచర్లలో అర్థరాత్రి గిరిజన ఆడబిడ్డలపై దమనకాండే కాదు.. పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా.. అంటూ కేటీఆర్ ఆగ్రహించారు. నిజనిర్ధారణకు వెళ్లిన వారిని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. వాస్తవాలను తొక్కిపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
కాగా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో కీలక పాత్రధారి, రెండో నిందితుడు (ఏ-2) బోనగాని సురేశ్ రాజ్ కోర్టులో లొంగిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం తన న్యాయవాదులతో కలిసి వచ్చి కొడంగల్ జూనియర్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయిన అతనికి జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు. లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ విజయకుమార్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డిపై రైతులు, గ్రామస్థులు దాడి చేయడం వెనక సురేశ్ రాజ్ కీలకంగా వ్యవహరించాడన్న అభియోగం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 11న లగచర్ల ఘటన చోటుచేసుకోగా.. అప్పటి నుంచి సురేశ్ రాజ్ పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం వారం రోజులుగా నాలుగు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతను పోలీసుల కళ్లుగప్పి నేరుగా కోర్టు లో లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది లా ఉండగా, ఇదే కేసులో ఏ-38 నేరెళ్ల హనుమంతు, ఏ-41 నీరటి సురేశ్‌ను మంగళవారం కోర్టులో హాజరుపరచగా వారికీ 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు ముగ్గురు నిందితులనూ సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. కాగా.. సురేశ్ రాజ్‌ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో ఏ-1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ బుధవారం విచారణకు రానుంది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 28కి చేరుకుంది. జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులపై దాడిని రాజకీయ కుట్రగా నిర్ధారించుకున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సురేశ్ రాజ్ సెల్‌ఫోన్‌ను విశ్లేషిస్తే ముఖ్యమైన సమాచార ం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
వారం రోజులు ఎక్కడున్నాడు...
లగచర్ల ఘటన తర్వాత పరారీలో ఉన్న సురేశ్ రాజ్ వారం రోజుల పాటు ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరినీ కలిశాడనేది చర్చనీయాంశంగా మారింది. అతనికి ఎవరు ఆశ్రయం కల్పించారనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినా చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టిన సురేశ్ రాజ్ తన ఫోన్ కాకుండా వేరే ఫోన్, సిమ్ కార్డులు ఉపయోగించినట్లు తెలుస్తోంది. అతను హైదరాబాద్‌లోనే షెల్టర్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సురేశ్‌రాజ్‌ను పోలీసులు విచారణ చేస్తే లగచర్ల ఘటన సూత్రధారులతో పాటు అతనికి ఎవరు ఆశ్రయం ఇచ్చారనే విషయం తెలుస్తుందని అంటున్నారు.
Updated Date - Nov 20 , 2024 | 09:11 AM