ఆగస్టు 15 నాటికి ఏన్కూరు ద్వారా నీళ్లు
ABN , Publish Date - Jun 14 , 2024 | 04:15 AM
ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టు పరిధిలోని ఏన్కూరు లింక్ కెనాల్ నిర్మాణం పూర్తి చేసి 1.20లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లను అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,

1.20 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు అందిస్తాం
ఏన్కూరు కెనాల్‌కు రాజీవ్ కెనాల్‌గా నామకరణం
నీటి పారుదల రంగాన్ని కేసీఆర్ నాశనం చేశారు
సీతారామ రీడిజైన్‌తో ప్రజాధనం దుర్వినియోగం
రూ.8 వేల కోట్లు ఖర్చుపెట్టి.. ఎకరాకైనా నీళ్లివ్వలేదు
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి
భద్రాద్రి జిల్లాలో సీతారామ ప్రాజెక్టు సందర్శన, సమీక్ష
ఖమ్మం(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/కొత్తగూడెం/అశ్వాపురం/ములకలపల్లి, జూన్ 13: ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టు పరిధిలోని ఏన్కూరు లింక్ కెనాల్ నిర్మాణం పూర్తి చేసి 1.20లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లను అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూ.2,654కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను గత ప్రభుత్వ పాలనలో రీడిజైన్ చేసి అంచనా వ్యయాన్ని రూ.20వేల కోట్లకు పెంచారని దుయ్యబట్టారు. పదేళ్లలో రూ.8వేల కోట్లు ఖర్చు చేసి.. ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. మాజీ సీఎం కేసీఆర్ నిర్వాకం వల్లే రాష్ట్రంలో నీటిపారుదల రంగం నాశనమైందని దుయ్యబట్టారు. సీతారామ ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకొచ్చి గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భద్రాద్రి జిల్లాలో చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ నిర్మాణ పనులను గురువారం మంత్రుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా భారీ విద్యుత్ మోటార్ల కోసం ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌ను వారు ప్రారంభించారు. అనంతరం ములకలపల్లి మండలం పూసూరు పంపుహౌస్ వద్ద ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించారు.
డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు- ఎన్నెస్పీ కెనాల్‌ను లింక్ చేయడానికి ఏన్కూరు లింక్ కెనాల్(9కిలోమీటర్లు)ను పూర్తి చేయాలని నిర్ణయించి, రూ.72కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ లింక్ కెనాల్‌కు రాజీవ్ కెనాల్‌గా నామకరణం చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం పంపుల ట్రయల్ రన్ కోసం ప్రాసెసింగ్ కొనసాగుతుందని తెలిపారు. 1, 2, 3 డిస్ర్టిబ్యూటరీ ప్యాకేజీల పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో నీటి పారుదల రంగాన్ని కేసీఆర్ నాశనం చేశారని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. ప్రణాళిక లేకుండా నిధులు దుబారా చేసి, కోలుకోలేని విధంగా రాష్ట్రానికి నష్టం చేకూర్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.90,400 కోట్లు ఖర్చు పెట్టి 93,000 ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే సృష్టించగలిగారని ఆరోపించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.27వేల కోట్లు, సీతారామ ప్రాజెక్టుకు రూ.8,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదన్నారు. ఆగస్టు 15లోగా సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా రైతులకు గోదావరి నీళ్లను అందిస్తామన్నారు. పాలేరు లింక్ కెనాల్‌లో భాగంగా జూలూరుపాడు వద్ద టన్నెల్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. సీతారామ ప్రధాన కాలవ వెంట ఉన్న కొత్తగూడెం, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు డిస్ట్రిబ్యూటరీ కాలువలు నిర్మించనున్నట్లు చెప్పారు. ఏడాదిన్నరలోగా సీతారామ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు.
కష్టమైనా సీతారామ పూర్తి చేస్తాం
కష్టమైనా, భారమైనా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం లింక్‌కెనాల్ హెడ్‌వర్క్, ఎత్తిపోతల పనులు పూర్తయ్యాయని, కొంత భూసేకరణతోపాటు జూలూరుపాడు, పాలేరు లింక్ కెనాల్‌కు సంబంధించి రెండు టన్నెళ్లు నిర్మించాల్సి ఉందన్నారు. ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా వైరా, లంకసాగర్ ప్రాజెక్టులకు నీళ్లు తీసుకెళ్తే.. కొంతమేర సాగర్ ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. సీతారామ ద్వారా మొత్తం 10లక్షల ఎకరాలకు నీరందిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సీతారామ ద్వారా ఆగస్టు 15 నాటికి 1.20లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెంలో ఆయకట్టు పెంచేలా సీతారామను రీడిజైన్ చేయాలని సూచించారు.