Year Ender 2024: వైసీపీ సోషల్ సైకోలకు కలిసిరాని ఈ ఏడాది
ABN, Publish Date - Dec 25 , 2024 | 09:47 AM
Year Enders 2024: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ సోషల్ మీడియా సైకోలు ఎంతటి దారుణాలకు పాల్పడ్డారో అందరికీ తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ సోషల్ సైకోల భరతం పట్టింది.
అధికారంలో ఉంటే కాదేది అనర్హం అన్నట్లు వ్యవహరించింది గత వైసీపీ ప్రభుత్వం. కూల్చివేతలతో పరిపాలనను ప్రారంభించిన జగన్.. ఆ తరువాత కూడా తనకు ఎదురేది లేదు అన్న చందంగా ముందుకు సాగారు. నా మాటే వేదం అన్న తీరుగా జగన్ పరిపాలన సాగింది. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలపై వైసీపీ పెద్దలు వ్యవహరించిన తీరు దారుణం. టీడీపీ నేతలపై దాడులు, హత్యలు, పార్టీ కార్యాలయాలపై దాడులు ఇలా ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ప్రతిపక్షాలను కించపరిచేందుకు సోషల్ మీడియాను కూడా వదలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫోటోలను ఇంటర్నెట్‌లో పోస్టులు పెట్టి నానా హంగామా చేశారు. అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు, చిత్రాలను పోస్టు చేశారు. చివరకు సొంత తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, మరో సోదరి సునీతపై కూడా అసభ్యపదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వైసీపీ నీచత్వానికి నిదర్శనంగా నిలిచింది. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు యద్దేచ్ఛగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూపోయారు. అయితే ఎంతగా కాలం కలిసొచ్చినప్పటికీ ఏదో ఒకరోజు వారి పాపం పండక తప్పదు. అదే పరిస్థితిని ఇప్పుడు వైసీపీ నేతలు ఎదుర్కుంటున్నారు. ఎవరైతే సోషల్ మీడియాను ఓ ఆయుధంగా వాడుకుని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారో ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
వారిని ఉతికి ఆరేసే పనిలో సర్కార్...
కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా సైకోల భరతం పట్టింది. ఎవరెవరు సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల పెట్టారో వారందరినీ ఉతికి ఆరేసే పనిలో పడింది సర్కార్. ఎంతమంది ఈ పోస్టులు పెట్టారు.. ఇందులో అసలు సూత్రధారులు ఎవరు అనే దానిపై ఆరా తీయడం మొదలుపెట్టింది. అలాగే పోలీసులు కూడా సోషల్ మీడియా సైకోలపై ఉక్కుపాదం మోపారు. ఎవరెవరు, ఎక్కడి నుంచి పోస్టులు పెట్టారనే సమాచారాన్ని సేకరించి వారిని జైలుకు తరలించారు. ఈ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ ఏడాది నవంబర్‌లో జరిగిన మంత్రి మండలి సమావేశంలోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం పెద్దలపై, ప్రజాప్రతినిధులపై ఎవరైన ఇలాంటి పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేశారు.
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు
ప్రభుత్వ ఆదేశాలతో పలువురు వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఇళ్లకు వెళ్లి మరీ పోలీసులు నోటీసులు అంటించారు. అలాగే సోషల్ మీడియాలో అసభ్యపదజాలంతో దూషించిన అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అలాగే కూటమి పెద్దలు, మహిళా మంత్రులు, వారి కుటుంబసభ్యులపై పోస్టుల పెట్టే వారిపై ప్రత్యేక నిఘా కూడా పెట్టారు. ఫేక్ ఐటీలతో పోస్టులను పెట్టినా గుర్తించి పట్టుకునే విధంగా సాంకేతికతను పోలీసులు వినియోగించారు. రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాలకు చెందిన వందలకు పైగా సోషల్ మీడియా గ్రూపులపై నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు.
కేసులు నమోదు.. వర్రా అరెస్ట్
సోషల్ మీడియా కేసు వ్యవహారంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డిపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో ఏ1గా ఉన్న వర్రా రవీంద్రారెడ్డిని తొలుత నవంబర్ 6న అరెస్ట్ చే సిన పోలీసులు ఎంపీ అవినాష్ రెడ్డి ఒత్తిళ్ల మేరకు 41 ఏ నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు. దీనిపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వర్రా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఇద్దరు కానిస్టేబుళ్లపైనా వేటు పడింది. ప్రభుత్వ పెద్దలు సీరియస్ అవడంతో వర్రా కోసం గాలించిన పోలీసులు నవంబర్ 10న అతడిని మరోసారి అరెస్ట్ చేసి ఆపై కడప మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చడంతో వర్రాకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ప్రస్తుతం వర్రా కడప సెంట్రల్ జైలులో ఉన్నాడు. అలాగే వర్రాపై రాష్ట్ర వ్యాప్తంగాను అనేక కేసులు నమోదు అయ్యాయి. పోలీసుల విచారణలో వర్రా ఇ చ్చిన వాంగ్మూలం మేరకు వైసీపీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, అసెంబ్లీ ఇన్‌ర్జ్‌లకు పోలీసులు 41 ఏ నోటీసులు జారీ చేశారు. పులివెందుల వైసీపీ సోషల్‌మీడియా కన్వీనర్ వివేకానందరెడ్డికి 41-ఏ నోటీసులు, వైసీపీ సోషల్‌మీడియా జిల్లా కో-కన్వీనర్లు సునీత, నిశాంత్, వరకుమార్‌కు నోటీసులు ఇచ్చారు.
వెనకుండి నడిపించింది సజ్జల భార్గవనే..
మరోవైపు ఈ మొత్తం వ్యవహారం వెనుక అప్పటి వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డి ఉన్నారని తేలింది. 2022 నుంచి వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా సజ్జల భార్గవ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాతే బూతులు పెరిగాయని పోలీసులు నిర్ధారించారు. సోషల్ మీడియాలో వైసీపీ వికృత చేష్టలన్నీ... సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు అర్జున్‌రెడ్డి, వీరారెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లి నుంచి నడిచాయని బయటపడింది. షర్మిల, సునీత, వైఎస్ విజయలక్ష్మిపై పోస్టుల వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి ‘డిక్టేషన్’ ఉన్నట్లు పోలీసులు తేల్చారు. సోషల్ మీడియా పోస్టులపై సజ్జల భార్గవపై కేసులు నమోదు అవగా.. ఎఫ్‌ఐఆర్‌లు కొట్టివేయాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులోనే తేల్చుకోవాలని సజ్జలకు సుప్రీం స్పష్టం చేసింది. తనపై వేసిన కేసులను కొట్టివేయాలని హైకోర్టులో సజ్జల భార్గవ పిటిషన్ వేయగా... విచారించిన ధర్మాసనం.. బీఎన్‌ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది.
Kisan Vikas Patra Scheme:అదిరిపోయే స్కీమ్.. తక్కువ ఇన్వెస్ట్‌తో డబుల్ ప్రాఫిట్..
పోలీసుల విచారణకు అనివాష్ పీఏ
అలాగే వర్రా.. పోలీసుల విచారణలో అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి పేరు చెప్పారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫీస్ నుంచి కంటెంట్ అంతా రాఘవరెడ్డి వాట్సప్ నుంచి వచ్చిందని వర్రా వాంగ్మూలం ఇచ్చారు. రాఘవరెడ్డి కోసం పోలీసులు నెల రోజులుగా గాలిస్తున్నారు. ఈనెల 12 వరకు అరెస్ట్ చేయకుండా హైకోర్టు నుంచి రాఘవరెడ్డి స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో పులివెందులకు వచ్చిన రాఘవరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో మూడు రోజుల పాటు పోలీసుల విచారణకు రాఘవరెడ్డి హాజరయ్యారు.
బోరుగడ్డ అనిల్ అరెస్ట్..
వైసీపీ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించి, హేయమైన భాషలో సోషల్ మీడియాలో చెలరేగిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను కూడా ఈ ఏడాది అక్టోబర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్‌పై ఎవరు విమర్శలు చేసిన రెచ్చి పోయిన ఈ రౌడీషీటర్ల.. సోషల్ మీడియాలో అసభ్యపదజాలంతో పోస్టులు పెట్టేవాడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనిల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలింగ్ తర్వాత కౌంటింగ్‌కు ముందు అనిల్ సోషల్ మీడియాలో చేసిన దూషణలు, బెదిరింపులపై జూన్ 1న నమోదైన కేసులో అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అలాగే ఇతడిపై రాష్ట్ర వ్యాప్తంగా 15 వరకు క్రిమనల్ కేసులు నమోదు అయ్యాయి. మూడు రోజుల పాటు బోరుగడ్డ అనిల్‌ను పోలీస్‌కస్టడీకి కోర్టు అనుమతించడంతో... పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని అనేక విషయాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియా పోస్టులపై కూటమి ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్‌గా ఉంది. ఎవరైనే అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చిరికలు కూడా జారీ చేసింది. ఎక్కడిక్కడ వైసీపీ సోషల్ మీడియా సైకోలు అరెస్ట్‌లు అవుతుండటంతో ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు భయపడిపోయినట్లు తెలుస్తోంది. కాగా.. సోషల్ మీడియా వ్యవహారంలో అరెస్ట్‌లు మాత్రం ఆగడం లేదు.
మరిన్ని Year Ender 2024 వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి...
ACB Files : సంజయ్‌పై ఏసీబీ కేసు
Read latest AP News And Telugu News
Updated Date - Dec 25 , 2024 | 09:57 AM