Share News

Year Ender 2024: కాళేశ్వరం చుట్టూ ఈ ఏడాది రాజకీయం

ABN , Publish Date - Dec 30 , 2024 | 10:02 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌లోని ఓ పిల్లర్ 2023 అక్టోబర్‌లో కుంగుబాటుకు గురైంది. తెలంగాణలో ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి గట్టి దెబ్బే అని చెప్పుకొచ్చారు. పిల్లర్ కుంగడంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది.

Year Ender 2024: కాళేశ్వరం చుట్టూ ఈ ఏడాది రాజకీయం
Year Ender - 2024 Kaleshwaram Project

‘‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాని’’ ఇదే కేసీఆర్ సంకల్పం. తెలంగాణలో లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్. అనుకున్నట్లు గానే అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించారు. దీని ఆయకట్టు 45,00,000 ఎకరాలు. ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువ‌లు, సొరంగాల‌ స‌మాహారం. కానీ, అన్నీ ఒక‌దానితో ఒక‌టి సంబంధం ఉన్నవే. గోదావ‌రి నీటిని వీలైనంత ఎక్కువ‌గా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. తెలంగాణలోని దాదాపు 13 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్‌కు మొత్తంగా 80 వేల ఎకరాల భూసేకరణ జరిపారు. ఏడాదిలో 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరందించేందుకు, రాష్ట్రంలోని 70 శాతం తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు పరిశ్రమల అవసరాలను కూడా తీర్చేలా దీన్ని రూపొందించారు. రూ.80,500 కోట్ల ప్రాజెక్టుకు 2016లో శంకుస్థాపన జరుగగా... 2019 జూన్ 21న ప్రాజెక్ట్‌ను కేసీఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు.


సొంత నిధులతోనే..

kaleshwaram.jpg

కాళేశ్వరం ప్రాజెక్టులో 1,832 కి.మీ మేర నీటి సరఫరా మార్గం, 1,531 కి.మీ.ల పొడవునా గ్రావిటీ కెనాల్, సొరంగ మార్గాలలో 203 కి.మీ, 20 లిఫ్టులు, 19 పంప్ హౌస్‌లు మరియు 19 రిజర్వాయర్లు కలిపి 141 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఉన్నాయి. మొదటి దశలో ప్రతిరోజూ 2 టీఎంసీల నీటిని పంపింగ్ చేయడానికి దాదాపు 4,992 మెగావాట్ల విద్యుత్ అవసరం. తర్వాతి ఏడాది నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు 7,152 మెగావాట్లకు అవసరమవుతుంది. అలాగే కేసీఆర్ ప్రభుత్వం సొంత నిధులతోనే ప్రాజెక్ట్‌ను నిర్మించింది. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి అప్పటి ప్రభుత్వం రుణాలు పొందింది. ఆంధ్రాబ్యాంకు ఇచ్చిన రూ.7,400 కోట్ల రుణాన్ని ఆమోదించడంతో పాటు 2017-18 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.6,681.87 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది.


కుంగిన పిల్లర్.. ప్రతిపక్షాల రచ్చ

medigadda.jpg

అయితే ఎంతో ప్రతిష్మాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఓ కలంకం వచ్చి పడింది. ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌లోని ఓ పిల్లర్ 2023 అక్టోబర్‌లో కుంగుబాటుకు గురైంది. తెలంగాణలో ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి గట్టి దెబ్బే అని చెప్పుకొచ్చారు. పిల్లర్ కుంగడంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించింది. అంతేకాకుండా అప్పటి టీపీసీసీ చీఫ్, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మేడిగడ్డకు చేరుకుని కుంగిన పిల్లర్‌ను పరిశీలించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం కుంభకోణంపై విచారణ జరుపుతామని... నిజానిజాలు బయటపెడతామని స్పష్టం చేశారు.


విచారణకు ఆదేశాలు..

medigadda-barrage.jpg

ఆ తరువాత ఎన్నికలు రావడం పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిపోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, కుంభకోణంపై విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశించింది. కాళేశ్వరం కమిషనర్ పేరుతో ఓ విచారణ కమిటినీ నియమించింది. వెంటనే రంగంలోకి దిగిన కాళేశ్వరం విచారణ కమిటీ.. ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన వారందరిని విచారించాలని నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ విచారణ జరిపింది. నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు, మాజీ ఈఎన్‌సీలు, చీఫ్‌ ఇంజనీర్లు, ఎస్‌ఈల క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసింది. దాదాపు 45 మంది ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, అకౌంట్స్ అధికారులను కమిషన్ విచారించింది.


కమిషన్ ప్రశ్నలు.. అధికారుల తడబాటు

kaleshwaram-commission-2.jpg

చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి, ఎస్‌డీఎస్‌వో చీఫ్‌ ఇంజనీర్‌ ప్రమీల, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) విజయలక్ష్మి ఇలా చాలా మందిని కమిషన్ ఎగ్జామినేషన్ చేసింది. డ్యామ్ సేఫ్టీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి ముందు, నిర్మాణం జరిగేటప్పుడు, జరిగాక.. మోడల్‌ స్టడీస్‌ ఏమైనా జరిగాయా అనే ప్రశ్నలు సంధించింది. అయితే కమిషన్ అడిగిన ప్రశ్నలకు పలువురు అధికారులు తడబాటుకు గురైనట్లు తెలుస్తోంది. అలాగే పొంతలేని సమాధానాలు చెప్పడంతో పాటు కమిషనర్ ఎదుట నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది.


మరింత విచారణ...

కాగా.. ఇప్పటి వరకు పూర్తి అయిన విచారణ ప్రకారం ఏఈల నుంచి ఈఎన్‌సీల వరకు దాదాపు 20 మంది ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని కమిషన్ యోచిస్తున్నట్లు కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. పలువురు ఇంజనీర్ల అవినీతి, అలసత్వం, బ్యారేజీల వైఫల్యానికి కారణమని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే విచారణను తప్పుదోవ పట్టించిన, నేరపూరితంగా వ్యవహరించిన ఇంజనీర్లపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్స్ చేసే యోచనలో కాళేశ్వరం కమిషన్ ఉన్నట్లు సమాచారం. ఈనెల(డిసెంబర్)లో మరోసారి విచారణను చేపట్టిన కాళేశ్వరం కమిషన్.. మాజీ ఐఏఎస్‌, ఐఏఎస్ అధికారులను విచారించింది. అలాగే కాళేశ్వరం విచారణను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉంది.


మరిన్ని Year Ender-2024 వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి...

ఉల్లిపాయలతో ఆ సామర్థ్యం.. నిజమెంత..

న్యూ ఇయర్ ముందు పసిడి ప్రియులకు షాక్..

Read latest Telangana News And Telugu News

Updated Date - Dec 30 , 2024 | 10:32 AM