Share News

Year Ender 2024: లోక్‌సభలో అడుగు పెట్టిన ప్రియాంక

ABN , Publish Date - Dec 30 , 2024 | 03:45 PM

Year Ender 2024: 2024 ఏడాది కాంగ్రెస్ పార్టీకే కాదు... ప్రియాంక గాంధీకి సైతం కలిసొచ్చింది. కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో ప్రతిపక్ష హోదా దక్కించుకొంది. ఇక వయనాడ్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంకగాంధీ గెలుపొందారు.

Year Ender 2024: లోక్‌సభలో అడుగు పెట్టిన ప్రియాంక

ఏదీ ఏమైనా 2024 ఏడాది కాంగ్రెస్ పార్టీకి కొద్దో గొప్పో కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను దక్కించుకొంది. దీంతో లోక్‌సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. ఇక కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలుపొందారు. దాంతో ఆమె సైతం సభ్యురాలిగా తొలిసారిగా లోక్ సభలో అడుగు పెట్టారు.

2004 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సారథ్యంలో మోదీ పాలన పగ్గాలు చేపట్టారు. నాటి నుంచి వరుసగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో.. అంటే 2019లో సైతం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేదు. కానీ ఈ ఏడాది జరిగిన ఈ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ ఆ హోదాను దక్కించుకోవడమే కాకుండా.. ప్రియాంక సైతం ఎంపీగా గెలుపొందారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ.. తమ కుటుంబానికి కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథితోపాటు కేరళలోని వయనాడ్ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే అమేథి నుంచి బీజేపీ అభ్యర్థిగా స్మతీ ఇరానీ బరిలో నిలిచారు. దీంతో ఈ నియోజకవర్గం ప్రజలు ఆమెకు పట్టం కట్టారు. వయనాడ్ నుంచి రాహుల్ గెలుపొందారు.


ఇక 2024 ఎన్నికల పోలింగ్ మొత్తం 7 దశల్లో జరిగింది. దీంతో వయనాడ్‌ ఎంపీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు. తొలి దశలోనే ఈ నియోజకవర్గం పోలింగ్ జరిగింది. అనంతరం రాయబరేలి నుంచి సైతం పోటీ చేయాలని ఆయనపై పార్టీ ఒత్తిడి తీసుకు వచ్చింది. దీంతో ఆయన ఆ స్థానం నుంచి బరిలో దిగారు. ఇక ఎన్నికల ఫలితాల్లో ఆయన రెండు స్థానాల నుంచి విజయకేతనం ఎగుర వేశారు.


అయితే ఈ రెండు స్థానాల్లో ఒక స్థానాన్ని ఆయన వదులుకోవాల్సి వచ్చింది. దీంతో రాహుల్ గాంధీ వయనాడ్ స్థానాన్ని వదులు కోవాల్సి వచ్చింది. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దాంతో ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపింది. ఈ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు.


అలా ఆమె సైతం లోక్ సభలో అడుగు పెట్టారు. అదీకాక.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనే ప్రియాంక గాంధీ ఇలా లోక్ సభలో అడుగు పెట్టేందుకు వయనాడ్ వేదికగా మారింది. లోక్ సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మరో గొంతుక ప్రియాంక రూపంలో తోడు అయినట్లు అయింది.

మరిన్ని Year Ender - 2024 వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 30 , 2024 | 05:04 PM