పండుగ రోజు పెను విషాదం
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:48 AM
శ్రీరామ నవమి పండుగ రోజు అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో పెను విషాదం జరిగింది. రాములోరి కల్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రామస్థూపాన్ని కృష్ణానదిలో శుద్ధి చేయించేందుకు తీసుకెళ్లిన కార్యక్రమంలో భాగంగా నీటిలో మునిగి ముగ్గురు బాలురు మృతి చెందారు. వీరిలో అన్నదమ్ముల పిల్లలు ఇద్దరు ఉండటం, వారు కూడా ఒక్కో కుటుంబానికి ఒక్కరే వారసులుగా ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొత్తగా ఈ ఏడాది ఏర్పాటు చేసుకున్న డీజేనే తమ బిడ్డల ప్రాణాల మీదకు తెచ్చిందని వాపోయారు.

-కొత్తపేట రేవులో మునిగి ముగ్గురు బాలురు మృతి
- మృతుల్లో ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు
- మృతులంతా మోదుమూడికి చెందిన వారే..
- ప్రాణాల మీదకు తెచ్చిన డీజే సరదా!
- కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
శ్రీరామ నవమి పండుగ రోజు అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో పెను విషాదం జరిగింది. రాములోరి కల్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రామస్థూపాన్ని కృష్ణానదిలో శుద్ధి చేయించేందుకు తీసుకెళ్లిన కార్యక్రమంలో భాగంగా నీటిలో మునిగి ముగ్గురు బాలురు మృతి చెందారు. వీరిలో అన్నదమ్ముల పిల్లలు ఇద్దరు ఉండటం, వారు కూడా ఒక్కో కుటుంబానికి ఒక్కరే వారసులుగా ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొత్తగా ఈ ఏడాది ఏర్పాటు చేసుకున్న డీజేనే తమ బిడ్డల ప్రాణాల మీదకు తెచ్చిందని వాపోయారు.
అవనిగడ్డ, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి):
ఏటా శ్రీరామనవమి పర్వదినాన్ని మోదుమూడి గ్రామంలో సాంప్రదాయబద్ధంగా మేళతాళాలతో నిర్వహించి గ్రామంలో ఏర్పాటు చేసుకునే రామ స్థూపాన్ని నదికి తీసుకెళ్లి శుభ్రపరిచి అనంతరం గ్రామంలో సీతారాముల కల్యాణాన్ని చేస్తూ ఉంటారు. ఈ ఏడాది కొత్తగా డీజె పెట్టి శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించాలని స్థానిక యువకులు నిర్ణయించుకుని మత్తి గోపీ కిరణ్ ఇంటి సమీపంలో చిన్న మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలలోపు రామస్థూపాన్ని కొత్తపేట కృష్ణానది ఘాట్ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లగా, యువత సరదాగా డీజెలు పెట్టుకుని వెళ్లటంతో వారు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి కొత్తపేట రేవుకు చేరుకున్నారు. ఆ సమయంలో ఘాట్ వద్ద ఎవరు లేకపోవటంతో ఎనిమిది మంది యువకులు స్నానాలకు దిగారు. కొత్తగా ఏర్పడిన గుండాల్లో మత్తి గోపీ కిరణ్ (15), వీరబాబు(15), యతిరాజు(16) గల్లంతు అయ్యారు. వెంటనే వారితో వచ్చిన వారు కొత్తపేట గ్రామంలో సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టగా, యతిరాజ్ మృతదేహం నది ఒడ్డునే లభించింది. గోపీ కిరణ్, వీరబాబు జాడ తెలియకపోవడంతో వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ నేతృత్యంలో రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కలసి గాలింపు చర్యలు చేపట్టారు. నాగాయలంక, పులిగడ్డ గ్రామాల నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. ఘాట్ ఎదురుగా కొత్తగా ఏర్పడిన గుండాల్లో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. గాలింపు చర్యలను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆయన కుమారుడు మండలి వెంకట్రామ్ పర్యవేక్షించారు. మృతదేహాలను అవనిగడ్డ సీఐ యువకుమార్, ఎస్‌ఐ శ్రీనివాస్ అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, పులిగడ్డ సర్పంచ్ దాసరి విజయ్‌కుమార్ సహకారంతో రేవులో దిగి మృతదేహాలను బయటకు తీసిన గజ ఈతగాళ్లు పెనుమూడికి చెందిన విశ్వనాథపల్లి దిలీప్, తమ్మాడి సాయి, లంకే చందు, నాగాయలంకకు చెందిన విశ్వనాథపల్లి వంశీలను అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ, సీఐ యువకుమార్, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు ప్రత్యేకంగా అభినందించారు.
మూడు కుటుంబాల్లో కడుపు కోత..
మత్తి గోపీ కిరణ్, మత్తి వీరబాబు వారి కుటుంబాలకు ఏకైక వారసులు, అంతేకాకుండా వారిరువురు తండ్రులు సైతం అన్నదమ్ములే కావటంతో ఆయా కుటుంబాలకు వారసులు లేకుండాపోయారని గోపీ కిరణ్ తండ్రి రంగారావు, వీరబాబు తండ్రి వరదరాజులు విలపిస్తున్నారు. గోపీ కిరణ్, వీరబాబు అవనిగడ్డలో 9వ తరగతి చదువుతుండగా, యతిరాజు ఇటీవల చదువు మానేసి వ్యవసాయంలో కుటుంబానికి సాయంగా ఉంటున్నాడు. చేతికి అంది వస్తున్న కొడుకు విగత జీవిగా మారడం చూసి యతిరాజు తండ్రి మత్తి భావన్నారాయణ కన్నీటిపర్యంతమయ్యాడు.
బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ
యువకులు గల్లంతైన విషయం తెలుసుకున్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తన కుమారుడు మండలి వెంకట్రామ్‌తో కలసి కొత్తపేట ఘాట్‌కు చేరుకుని, అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ, సీఐ యువకుమార్‌ను పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుం బాలను పరామర్శించారు. విషయం తెలుసుకున్న అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను సందర్శించి వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇసుక అక్రమ తవ్వకాలతోనే గుండాలు
కొత్తపేట పుష్కరఘాట్ వద్ద నది లోతు చాలా తక్కువగా ఉంటుందని, అక్కడ ఒకేసారి పది అడుగుల లోతున గుండాలు ఏర్పడటానికి కారణంగా ఇసుక అక్రమ తవ్వకాలేనని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నది ఒడ్డు నుంచి అవతల వరకు నడిచి వెళ్లిపోయే అవకాశం గతంలో ఉండేదని, ఈ అక్రమ తవ్వకాల కారణంగా నదిలో అనూహ్యంగా గుండాలు ఏర్పడి ప్రాణాల మీదకు తెస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.