Municipal Development : అమరావతికి మరో రూ.11వేల కోట్లు!
ABN , Publish Date - Mar 17 , 2025 | 04:01 AM
అమరావతిలో అభివృద్ధి పనుల నిమిత్తం రూ.11వేల కోట్ల రుణ సహాయం అందించేందుకు జనవరి 22న హౌసింగ్ అండ్ అర్బన్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (హడ్కో) బోర్డు సమావేశంలో

రుణం మంజూరుపై సీఆర్డీఏతో హడ్కో ఒప్పందం
త్వరలో మరో జర్మన్ బ్యాంకు నుంచి 5 వేల కోట్లు
మొత్తం 16 వేల కోట్లతో మలిదశ పనులకు శ్రీకారం
ఇప్పటికే రూ.40 వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు
గుంటూరు/అమరావతి, మార్చి 16(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి పునర్నిర్మాణం దిశగా మరో ముందడుగు పడింది. అమరావతిలో అభివృద్ధి పనుల నిమిత్తం రూ.11వేల కోట్ల రుణ సహాయం అందించేందుకు జనవరి 22న హౌసింగ్ అండ్ అర్బన్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (హడ్కో) బోర్డు సమావేశంలో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ అథారిటీతో ఆదివారం ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠ, మున్సిపల్ శాఖ అధికారులు ఆదివారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే హడ్కో, సీఆర్డీఏ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. దీంతో అతి త్వరలోనే రాజధానికి రూ.11వేల కోట్ల రుణం అందనుంది. కాగా, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవల్‌పమెంట్ బ్యాంకు ద్వారా మరో రూ.5వేల కోట్ల రుణానికి కూడా మార్గం సుగమమైనట్లుగా తెలుస్తోంది. వారం, పది రోజుల్లో ఈ ఒప్పందంపై అంగీకారం వస్తుందని సమాచారం. హడ్కో, కేఎ్‌ఫడబ్ల్యూ డెవల్‌పమెంట్ బ్యాంకు నిధులతో రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టనున్నారు. మలిదశ పనుల్లో రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టనున్నారు. సీఆర్డీఏ పరిధిలో అంతర్గత రహదారులు అభివృద్ధి చేయడం, సీడ్ యాక్సెస్ రోడ్డు, ఇతర ప్రధాన రహదారులను జాతీయ రహదారితో అనుసంధానం చేయడం వంటి పనులు చేపడతారు.
ఉపాధి సిబ్బందికి బదిలీలు
ఉపాధి సిబ్బంది బదిలీలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఉపాధి హామీ పథకం డైరెక్టర్ బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేశారు. జిల్లాల్లో బదిలీలు చేపట్టేందుకు డ్వామా పీడీలకు అనుమతి మంజూరు చేశారు. ఈ నెల 15నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించి 20లోపు పూర్తిచేసి, కొత్త ప్రదేశాల్లో 22 నాటికి విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధి హామీ పథకంలోని ఎఫ్‌టీఈ, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో పనిచేసే సిబ్బందికి ఆయా జిల్లాల్లో అంతర్గత బదిలీలకు అవకాశం కల్పించారు. డ్వామా కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఒకే సీటులో మూడేళ్లు సర్వీసు పూర్తిచేసి ఉంటే వారిని వేరే సీట్లకు బదిలీ చేయాలని పేర్కొన్నారు. సెప్టెంబరు 30 నాటికి రిటైర్ కాబోయే సిబ్బందిని మాత్రం బదిలీల నుంచి మినహాయించారు.
ఉపాధి నిధులతో శ్మశానాలు, కోనేర్ల అభివృద్ధి
ఉపాధి హామీ పథకంలో కొత్త రకాల పనులకు శ్రీకారం చుట్టారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో శ్మశానాల అభివృద్ధి పనులు ఎన్‌ఆర్‌ఐల సహకారంతో చేపట్టారు. 70శాతం ఉపాధి మెటీరియల్ నిధులు, 30శాతం ఎన్‌ఆర్‌ఐ విరాళాలను వాటికి వెచ్చించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అటకెక్కించారు. తాజాగా శ్మశానాల అభివృద్ధి కోసం మండల స్థాయిలో సిబ్బంది పనులు చేపట్టేందుకు ఉపాధి హామీ డైరెక్టర్ ఆదేశాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో శ్మశానవాటికల్లో స్థలాల లభ్యతను బట్టి, అవసరమైన నిర్మాణాలు చేపట్టేందుకు వివిధ రకాల కొలతలతో డిజైన్లు రూపొందించింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల వద్ద సుమారు 750 పురాతన కోనేరుల అభివృద్ధికి గ్రామీణాభివృద్ధిశాఖ యోచిస్తోంది.