Share News

Captive Port Construction: అనకాపల్లి జిల్లాలో క్యాప్టివ్‌ పోర్టు

ABN , Publish Date - Apr 04 , 2025 | 04:58 AM

అనకాపల్లి జిల్లాలో క్యాప్టివ్‌ పోర్టు నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆర్సెలర్‌ మిట్టల్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ అభ్యర్థన మేరకు 2.9 కిలోమీటర్ల వాటర్‌ఫ్రంట్‌తో పోర్టు నిర్మించేందుకు ఒప్పందం సవరించడంపై నిర్ణయం తీసుకుంది

Captive Port Construction: అనకాపల్లి జిల్లాలో క్యాప్టివ్‌ పోర్టు

  • రూ.5,816 కోట్లతో నిర్మాణం

  • పోలవరం-బనకచర్ల కోసం ‘జల హారతి’ కార్పొరేషన్‌

  • 710 కోట్ల హడ్కో రుణానికి గ్యారెంటీ

  • 3 స్టార్‌ హోటళ్లకు బార్‌ లైసెన్స్‌ ఫీజు రూ.25 లక్షలకు కుదింపు

  • ప్రత్యేకంగా డ్రోన్‌ కార్పొరేషన్‌

  • ఫైబర్‌నెట్‌ నుంచి విడదీసి ఏర్పాటు

  • మంత్రివర్గ నిర్ణయాలు

అమరావతి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లాలో క్యాప్టివ్‌ పోర్టు నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ (ఏఎం/ఎన్‌ఎల్‌ఎల్‌) అభ్యర్థన మేరకు డీఎల్‌ పురం వద్ద 2.9 కిలోమీటర్ల వాటర్‌ఫ్రంట్‌తో క్యాప్టివ్‌ పోర్టు నిర్మించేందుకు అనుమతి కోసం కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్‌తో ఒప్పందాన్ని సవరించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల స్టీల్‌ ప్లాంటు తొలి దశకు మార్గం సుగమమైంది. ఈ దశలో రూ.55,964 కోట్ల పెట్టుబడితో ఏటా 7.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 2029నాటికి ప్లాంటు ఏర్పాటు చేస్తారు. దీనికి అనుసంధానంగా రూ.5,816 కోట్ల వ్యయంతో 20.5 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో పై క్యాప్టివ్‌ పోర్టును 2029 జనవరికల్లా నిర్మిస్తారు. రెండో దశ ప్లాంటును రూ.80 వేల కోట్ల వ్యయంతో ఏటా 10.5 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 2033కి నెలకొల్పుతారు. దీనికోసం రెండో దశ క్యాప్టివ్‌ పోర్టును 5,380 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేస్తారు. కేబినెట్‌ నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వివరించారు.

మంత్రివర్గ నిర్ణయాలివీ..

  • పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు కోసం జల హారతి కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం.

  • ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌తో అనుబంధంగా ఉన్న డ్రోన్‌ కార్పొరేషన్‌ను విడదీసి ప్రత్యేకంగా డ్రోన్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు.

  • త్రీస్టార్‌, ఆపైబడి గుర్తింపు కలిగిన హోటళ్లకు బార్‌ లైసెన్సు ఫీజు రూ.25 లక్షలకు కుదింపు.

  • పర్యాటకాభివృద్ధి కోసం యువజన, పర్యాటక శాఖ జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం.

  • రాష్ట్ర విద్యుత్‌ సమన్వయ కమిటీ (ఏపీపీసీసీ) తీసుకునే రూ.710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చేందుకు అంగీకారం.


బనకచర్లకు ఆర్థిక ఇబ్బందుల్లేకుండా..

పోలవరం-బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ అనుసంధాన పథకానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ప్రత్యేకంగా ‘జలహారతి కార్పొరేషన్‌’ ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ పథకానికి జూన్‌ 1న టెండర్లు పిలవాలని సీఎం జల వనరుల శాఖను ఇప్పటికే ఆదేశించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కాలువలు, నల్లమల సాగర్‌ మీదుగా టన్నెళ్లు తవ్వేందుకు, ఎత్తిపోతల పథకాలు నిర్మించేందుకు భారీగా నిధులు సమీకరించాల్సి ఉంది. స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్‌పీవీ) తరహాలో రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ‘జలహారతి కార్పొరేషన్‌’ ఏర్పాటు చేస్తే ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు వీలుంటుందని జల వనరుల శాఖ భావిస్తోంది. అలాగే ఈ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్‌ ఉత్పత్తికి పథకం పొడవునా నిర్దిష్ట ప్రాంతాల్లో 4,400 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్కేంద్రాలు.. పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్లు, సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు స్థాపించనుంది. వీటికి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ), గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ) వంటి కేంద్ర ఆర్థిక సంస్థల నుంచి రుణాల సమీకరణకు ఈ కార్పొరేషన్‌ సహాయపడుతుంది.

రిటైనింగ్‌ వాల్‌కు అదనపు సాయం

చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగార్జున సాగర్‌ ఎడమ కాలువను ఆనుకుని వేంపాడు మేజర్‌లో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి రూ.44.60 కోట్ల అదనపు ఆర్థిక సాయం అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది. వాస్తవానికి 2019లోనే చంద్రబాబు ప్రభుత్వం దీని నిర్మాణం తలపెట్టింది. అయితే తర్వాత వచ్చిన వైసీపీ సర్కారు మిగతా పనులు చేయకపోవడం.. నిర్వహణ లోపం కారణంగా వాల్‌ బాగా దెబ్బతింది. పైగా కట్టిన కాంట్రాక్టరుకు కూడా డబ్బులివ్వలేదు. ఈ నేపథ్యంలో అదనంగా 44.60 కోట్లు ఇవ్వాలని మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఈ వ్యవహారంలో బాధ్యులెవరో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు.


ఇవి కూడా చదవండి

కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త

Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 04:59 AM