Jagan మీ బట్టలు ఊడదీస్తాం..!
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:31 AM
పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన మాజీ సీఎం జగన పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి రాగానే బట్టలు ఊడదీస్తామని హెచ్చరించారు.

చంద్రబాబు పాలన ఎల్లకాలం ఉండదు
పోలీసులకు మాజీ సీఎం జగన వార్నింగ్
మజ్జిగ లింగమయ్య కుటుంబానికి పరామర్శ
హెలిప్యాడ్ వద్ద వైసీపీ నాయకుల రాద్ధాంతం
రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన మాజీ సీఎం జగన పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి రాగానే బట్టలు ఊడదీస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు టీడీపీ నాయకులకు వాచమెనలుగా పనిచేస్తున్నారని, అలాంటి వారిని గుర్తుకు పెట్టుకుని మరీ ఉద్యోగాలు ఊడదీస్తామని హెచ్చరించారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వారం క్రితం జరిగిన ఘర్షణలో మృతిచెందిన మజ్జిగ లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు. లింగమయ్య భార్య రామాంజినమ్మ, కుమారులు మనోహర్, శ్రీనివాసులుతో మాట్లాడారు. అంతకు మనుపు లింగమయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జరిగిన సంఘటన గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. లింగమయ్య కుమారులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలీసులు తమ విధులను మరచి, టీడీపీ ప్రజాప్రతినిధులకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ గురించి పరుషంగా మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే, ఆమె కుమారుడితో తమ పార్టీ ఎంపీసీటీల చేత వీడియో కాల్‌లో మాట్లాడించారని ఆరోపించారు. రామగిరి మండలంలో సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ నాయకులు ఎంపీపీ పదవి కోసం బెదిరింపులకు దిగారని, పోలీసుల అండతో భయబ్రాంతులకు గురిచేశారని అన్నారు. పెనుకొండలో బైండోవర్ చేసి, టీడీపీ వారిని రప్పించి తమ ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటనలో తిరిగి తమ పార్టీ నాయకులపైనే కేసులు నమోదు చేయించారని అన్నారు. చంద్రబాబు పాలన ఎల్లకాలం ఉండదని, తాము అధికారంలోకి వచ్చాక తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తుందని ఆయన పోలీసులను హెచ్చరించారు. ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంలోనే, ఇదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడిపై టీడీపీ వర్గీయులు దాడికి తెగబడ్డారని, అడ్డుకున్నందుకు లింగమయ్యపై, ఆయన కుమారుడిపై దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో లింగమయ్య మృతి చెందితే ఆయన భార్య రామాంజినమ్మతో సంతకం చేయించుకుని ఇద్దరి పేర్లను మాత్రమే కేసులో చేర్చారని అన్నారు. ఈ దాడిని ప్రోత్సహించిన, దాడి చేసిన వారిపై కేసులు లేకుండా చేశారని అన్నారు.
పబ్లిసిటీ స్టంట్
జగన పర్యటనను వైసీపీ పబ్లిసిటీ స్టంట్‌గా మార్చుకుంది. కుంటిమద్ది సమీపంలో హెలిప్యాడ్ వద్దకు జగన రాకముందే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తమ అనుచరులతో అక్కడికి వచ్చి హల్‌చల్ చేశారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు తోపుదుర్తి ప్రకాశరెడ్డి రోడ్డుపై బైఠాయించి, డ్రోన కెమరాతో మరీ వీడియో తీయించారు. ఈ క్రమంలో పోలీసులు వారిస్తున్నా వినకుండా వైసీపీ కార్యకర్తలు భారీగా హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నాయి. జగన రాగానే దిగేందుకు వీల్లేకుండా హెలిక్యాప్టర్‌ను చుట్టుముట్టారు. పోలీసులను తోసుకుంటూ, వారితో గొడవపడుతూ రభస చేశారు.
పోలీసులతో వాగ్వాదం
చెన్నేకొత్తపల్లి మండలం ఎనఎ్‌స గేటు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేసిన తరువాత పాపిరెడ్డిపల్లి మార్గం వైపు అనుమతించారు. ఈ క్రమంలో నాలుగు రోడ్ల కూడలిలో వాహనాలు నిలిచిపోయి జనం ఇబ్బందిపడ్డారు. అనుమతి లేని వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అన్ని వాహనాలను వదిలేవరకూ ఆయన వినుకోలేదు.