నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
ABN, Publish Date - Jan 01 , 2025 | 05:05 AM
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది.
గత ప్రభుత్వం రద్దు చేసిన పథకం పునరుద్ధరణ
475 కాలేజీల్లో అమలు.. 1.5 లక్షల మందికి లబ్ధి
వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్టూడెంట్ కిట్స్ పంపిణీ
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇటీవల ఈ పథకం అమలుకు కేబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. బుధవారం నుంచి 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 1.5 లక్షల మంది విద్యార్థులకు పథకం అమలు కానుంది. గతంలో పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమల్లో ఉండేది. ఇంటర్ విద్యార్థులకు అమ్మఒడి పథకం ఇస్తున్నామనే సాకుతో గత వైసీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దుచేసింది. దీనివల్ల పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన కూటమి ప్రభుత్వం తిరిగి అమల్లోకి తీసుకొచ్చింది. పథకం అమలుకు ఏడాదికి రూ. 85.84 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన కాలానికి రూ. 27.39 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం తెలిపింది.
విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కిట్లు
పాఠశాల విద్యార్థులతో పాటు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ మేనేజ్‌మెంట్లలో చదివే ఇంటర్ విద్యార్థులకూ ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర’ స్టూడెంట్ కిట్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. కిట్‌లో పాఠ్యపుస్తకాలు, ఒకేషనల్ పాఠ్యపుస్తకాలు, కాంపిటీటివ్ పరీక్షల మెటీరియల్, ప్రాక్టికల్స్ మాన్యువల్స్, నోట్ పుస్తకాలు, ప్రాక్టికల్స్ రికార్డులు ఇవ్వనుంది. జూనియర్ కాలేజీలతో పాటు కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురుకుల విద్యాలయాలు, హైస్కూల్ ప్లస్‌లలో విద్యార్థులకు కిట్లు అందజేయనుంది. ఇందుకోసం రూ. 32.95 కోట్లు అవుతాయని అంచనా వేసింది.
Updated Date - Jan 01 , 2025 | 05:05 AM