Share News

Weather Update: రాష్ట్రం భగభగ

ABN , Publish Date - Apr 13 , 2025 | 04:43 AM

శనివారం కోస్తా, రాయలసీమలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాయవ్య గాలులతో వాతావరణం వేడెక్కి 97 మండలాల్లో వడగాడ్పులు వాతావరణంపై ప్రభావం చూపాయి

Weather Update: రాష్ట్రం భగభగ

  • రావిపాడులో 43.7, దరిమడుగులో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత

  • నేడు 97 మండలాల్లో వడగాడ్పులు

  • వాయవ్య గాలులతో వేడెక్కిన వాతావరణం

విశాఖపట్నం, అమరావతి, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): కోస్తాతోపాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో శనివారం ఎండ మండిపోయింది. వాయవ్య గాలులతో వాతావరణం వేడెక్కింది. ప్రధానంగా మధ్య కోస్తాలో మధ్యాహ్న సమయంలో వడగాడ్పులు వీచాయి. పగటి ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఏడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. 119 ప్రాంతాల్లో 41 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా రావిపాడులో 43.7, ప్రకాశం జిల్లా దరిమడుగులో 43.4, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 43, తిరుపతి జిల్లా రేణిగుంటలో 42.8, తూర్పుగోదావరి జిల్లా చిన్నాయిగూడెంలో 42.6, జంగమహేశ్వరపురంలో 41.8, బాపట్లలో 41.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 22 ప్రాంతాల్లో తీవ్రంగా, 73 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచాయి. ఆదివారం ఏలూరు, భీమడోలు, జీకొండూరు మండలాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లోని 30 మండలాల్లో తీవ్రంగా, శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు 67 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణుడు తెలిపారు.

Updated Date - Apr 13 , 2025 | 04:43 AM