AP Seeks Funds: పదేళ్లయినా ఇంకా కోలుకోలేదు
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:31 AM
విభజన జరిగి పదేళ్లు గడిచినా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కోలుకోలేకపోతోందని ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘానికి వివరించనుంది. మౌలిక సదుపాయాలు, పరిశ్రమల అభివృద్ధి, రాజధాని నిర్మాణం, నదుల అనుసంధానానికి ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ విజ్ఞప్తి చేయనుంది

విభజిత ఆంధ్రకు రెవెన్యూ లోటు గ్రాంటు కావాలి
16వ ఆర్థిక సంఘాన్ని కోరనున్న ఆంధ్ర
మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ఇది అవసరం
రాజధాని, రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులకు ప్రత్యేకంగా నిధులివ్వండి
విజయవాడ, విశాఖ మెట్రోకు, నదుల అనుసంధానానికి కూడా
14వ తేదీ నుంచి మూడ్రోజులు రాష్ట్రంలో ఫైనాన్స్ కమిషన్ పర్యటన
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ఏయే అవసరాలకు ఎన్నెన్ని నిధులు కావాలో ఆర్థిక సంఘానికి వివరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 16వ ఫైనాన్స్ కమిషన్ ఈ నెల 14 నుంచి 16 వరకు మూడ్రోజుల పాటు ఏపీలో పర్యటించనుంది. విభజన జరిగి పదేళ్లు దాటినప్పటికీ ఇంకా రాష్ట్రం ఆర్థికంగా కోలుకోకపోవడాన్ని ప్రభుత్వం ప్రముఖంగా ప్రస్తావించనుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రెవెన్యూ మిగులు ఉండేదని.. విభజన తర్వాత నవ్యాంధ్ర రెవెన్యూ లోటు కోరల్లో చిక్కుకున్న విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లనుంది. సాధారణంగా ఏపీకి ప్రకృతి విపత్తులు ఎక్కువ. కోస్తా ప్రాంతం తుఫాన్లతో, రాయలసీమ కరువుతో విలవిల్లాడుతుంటాయి. దీనికి తోడు రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరగడంతో రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం కుదేలైంది. గత ఐదేళ్ల జగన్ పాలనలో ఆదాయం పూర్తిగా క్షీణించి అప్పులు విపరీతంగా పెరిగాయి.
ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైంది. దీంతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు ఆకర్షణ, పారిశ్రామిక రంగానికి ఉత్తేజమివ్వడానికి రెవెన్యూ లోటు గ్రాంటు అవసరమని కమిషన్‌ను కోరనున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, కొత్త పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం, విజయవాడ, విశాఖపట్నం మెట్రోరైల్ ప్రాజెక్టులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని అభ్యర్థించనున్నారు. రాష్ట్రంలో గోదావరి నుంచి ప్రతి ఏటా 2,000 టీఎంసీల వరద సముద్రంలో కలుస్తోంది. మరోవైపు అనంతపురం జిల్లాలో దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా-గోదావరి నదులను పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సీఎం చంద్రబాబు అనుసంధానం చేశారు. అదేవిధంగా కృష్ణా, పెన్నా, వంశధార నదులను అనుసంధానించి వర్షపాతం లేక అల్లాడుతున్న జిల్లాలకు ప్రాణం పోయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో నదుల అనుసంధానానికి నిధులు కేటాయించాలని ఆర్థిక సంఘాన్ని ప్రభుత్వం కోరనుంది.