బఫర్ జోన్ రగడ !
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:22 AM
జిల్లాలో రాతి నిక్షేపాలకు నెలవైన పరిటాలలో క్రషర్స్, రియల్ ఎస్టేట్ వెంచర్ల నిర్వాహకుల మధ్య బఫర్ జోన్ రగడ నడుస్తోంది. నలభై సంవత్సరాలుగా రాతి క్వారీలను లీజులకు తీసుకుని క్రషింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి రోడ్డు మెటల్, బిల్డింగ్ మెటల్ ఉత్పత్తి చేస్తున్న ప్రాంతంలోకి వచ్చి మరీ కొందరు లే అవుట్లు వేస్తుండటంతో వివాదం తలెత్తింది. మైనింగ్ బఫర్ జోన్ పరిధిలో వేసిన లే అవుట్లను తొలగించాలని క్రషర్స్ యజమానులు చేసిన విజ్ఞప్తులను వెంచర్ల నిర్వాహకులు పెడచెవిన పెడుతున్నారు. దీంతో క్రషర్స్ యజమానులు మైనింగ్, రెవెన్యూ, సీఆర్‌డీఏ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

క్రషర్స్ వర్సెస్ వెంచర్స్!
- స్టోన్ క్రషర్స్ సమీపంలో నాన్ లే అవుట్లు
- అభ్యంతరం వ్యక్తం చేసిన క్రషర్స్ యజమానులు
- బేఖాతరు చేసిన వెంచర్ల నిర్వాహకులు
- సీఆర్‌డీఏ, రెవెన్యూ, మైనింగ్‌లకు ఫిర్యాదు
- మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్
జిల్లాలో రాతి నిక్షేపాలకు నెలవైన పరిటాలలో క్రషర్స్, రియల్ ఎస్టేట్ వెంచర్ల నిర్వాహకుల మధ్య బఫర్ జోన్ రగడ నడుస్తోంది. నలభై సంవత్సరాలుగా రాతి క్వారీలను లీజులకు తీసుకుని క్రషింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి రోడ్డు మెటల్, బిల్డింగ్ మెటల్ ఉత్పత్తి చేస్తున్న ప్రాంతంలోకి వచ్చి మరీ కొందరు లే అవుట్లు వేస్తుండటంతో వివాదం తలెత్తింది. మైనింగ్ బఫర్ జోన్ పరిధిలో వేసిన లే అవుట్లను తొలగించాలని క్రషర్స్ యజమానులు చేసిన విజ్ఞప్తులను వెంచర్ల నిర్వాహకులు పెడచెవిన పెడుతున్నారు. దీంతో క్రషర్స్ యజమానులు మైనింగ్, రెవెన్యూ, సీఆర్‌డీఏ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
దశాబ్దాలుగా పరిటాల ప్రాంతంలో స్టోన్ క్రషింగ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లే అవుట్లు వెలుస్తున్నాయి. నాన్ లే అవుట్లు కావటంతో తక్కువ ధరకే ప్లాట్లు సొంతం చేసుకోండంటూ వాటి నిర్వాహకులు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ కొనసాగుతున్న స్టోన్ క్రషింగ్, క్వారీలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతాన్ని మైనింగ్ జోన్‌గా ప్రకటించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. మైనింగ్ కార్యకలాపాలు, స్టోన్ క్రషింగ్‌కు అనుమతించిన ప్రాంతాల పక్కనే నివాస ప్రాంతాలకు అనుమతులు ఇవ్వకూడదు. సీఆర్‌డీఏ నుంచి అనుమతులు రావు. అయినా కొంత మంది బడా వ్యక్తులు నాన్ లే అవుట్లు వేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టి ప్లాట్ల వ్యాపారం చేస్తున్నారు. అనధికార వెంచర్ల దెబ్బతో మైనింగ్ జోన్‌కు డిమాండ్ చేస్తున్న పారిశ్రామికవేత్తలు, స్టోన్ క్రషింగ్స్ యూనిట్ల యజమానులు తమ దుకాణాలను సర్దుకునే పరిస్థితి రానుంది. ఈ ప్రమాదాన్ని గ్రహించిన స్టోన్ క్రషింగ్ యూనిట్ల నిర్వాహకులంతా సంఘటితమయ్యారు. స్టోన్ క్రషర్స్ అసోయేషన్ తరఫున నాన్ లే అవుట్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్‌డీఏ, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు తాజాగా ఫిర్యాదులు చేయటం సంచలనం సృష్టిస్తోంది.
1300 ఎకరాల్లో క్వారీలు
నందిగామ నియోజకవర్గం పరిటాల గ్రామంలోని సర్వే నెంబర్ 801లో 1300 ఎకరాల రెవెన్యూ భూముల్లో నాలుగు దశాబ్దాలుగా పారిశ్రామికవేత్తలు రోడ్డు మెటల్, గ్రావెల్ క్వారీలను అధికారికంగా లీజుకు తీసుకున్నారు. వ్యాపార సౌలభ్యం కోసం చాలా మంది పారిశ్రామికవేత్తలు తాము లీజు పొందిన క్వారీల చెంతనే భూములను కూడా కొనుగోలు చేశారు. ఇలా కొనుగోలు చేసిన భూములలో పారిశ్రామికవేత్తలు స్టోన్ క్రషింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఈ యూనిట్లను కూడా పూర్తిగా కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు తీసుకుని ఏర్పాటు చేయటం జరిగింది. అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతే ఈ స్టోన్ క్రషింగ్ యూనిట్లను ప్రారంభించారు. ఈ స్టోన్ క్రషింగ్ యూనిట్లలో రోడ్డు మెటల్, బిల్డింగ్ మెటల్ తయారవుతోంది. పరిటాల క్రషింగ్ యూనిట్ మీద ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల నిర్మాణ రంగం ఆధారపడి ఉంది. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. పరిటాలలో రాతి క్వారీలు ఎక్కువుగా ఉన్నాయి. వీటి లీజుదారులు రాతిని తవ్వటం కోసం బ్లాస్టింగ్స్ చేస్తారు. ఆ తర్వాత క్రషింగ్ జరుగుతుంది. ఇలాంటి క్వారీలను కానీ, క్రషింగ్ యూనిట్లను చట్టబద్ధంగా సురక్షిత ప్రాంతాలలోనే నిర్వహించాలి. ఈ ప్రాంతాన్ని సురక్షితమైన ప్రాంతంగా ఆనాడు గుర్తించటం ద్వారా అప్పట్లో క్వారీ లీజులకు, స్ర్టోన్ క్రషింగ్ యూనిట్లకు అనుమతులు ఇవ్వటం జరిగింది. కాలక్రమంలో సమస్యలు వస్తాయన్న ఉద్దేశ్యంతో ఈ ప్రాంతాన్ని మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని ఎప్పటి నుంచో స్టోన్ క్రషర్స్ నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.
మైనింగ్ జోన్ పరిధి ఏమిటి ?
మైనింగ్ జోన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 153ని కూడా జారీ చేసింది. ఈ జీవో ప్రకారం చూస్తే.. క్వారీలు, స్టోన్ క్రషర్లను నిర్వహించటానికి అవసరమైన భూమిని మైనింగ్ జోన్‌గా వర్గీకరించాల్సి ఉంటుంది. మైనింగ్ జోన్‌లో క్వారీయింగ్, స్టోన్ క్రషింగ్ మినహా ఇతర కార్యకలాపాలను అనుమతించరు. మైనింగ్ జోన్ చుట్టూ ఒక కిలోమీటరు పరిధిలో బఫర్ జోన్ ఉంటుంది. ఈ బఫర్ జోన్‌లో ఎలాంటి రెసిడెన్షియల్ డెవలప్‌మెంట్‌కు అనుమతించరు.
గతంలోనూ వివాదాలు.. హైకోర్టుకు క్రషర్స్ నిర్వాహకులు
క్వారీలు, క్రషర్స్ యూనిట్లను ఆనుకుని ఉన్న భూములను నివాస ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు గతంలో కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నించారు. ఆ సందర్భంలో జీవోఎంఎస్ నెంబర్ 74 ప్రకారం మినరల్ బేరింగ్ ప్రాంతాలను పరిరక్షించాలని సీఆర్‌డీఏను ఆదేశించాలని కోరుతూ క్వారీ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై క్వారీ, క్రషింగ్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించవద్దని మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేయటం జరిగింది.
800 మీటర్ల బఫర్ జోన్‌కు డిమాండ్
పరిటాల గ్రామం పరిధిలోని సర్వే నెంబర్ 801లో క్రషర్స్ యూనిట్ల ప్రాంతం 500 మీటర్ల పరిధిలో ఉంది కాబట్టి కనీసం 800 మీటర్ల లోపు ఎలాంటి అభివృద్ధి ప్రణాళికలను ఆమోదించకుండా చర్యలు తీసుకునేలా ఖనిజాభివృద్ధి సంస్థకు స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ లేఖ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా సీఆర్‌డీఏ అధికారులను కూడా జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్‌లో మైనింగ్ జోన్‌గా గుర్తించి వ్యవసాయభూములను కన్వర్షన్ చేయటానికి అనుమతులు ఇవ్వవద్దని కోరారు. కానీ, ఏ శాఖలు కూడా వీరి విజ్ఞప్తిని పట్టించుకోలే దు.
బడా వ్యక్తుల నాన్ లే అవుట్లు
పరిటాల సర్వే నెంబర్ 801, దాని పరిసర ప్రాంతాల్లో మైనింగ్, క్రషింగ్ అధికారమైనపుడు.. వాటి పక్కనే వెంచర్లకు ఎవరూ అనుమతులు ఇవ్వకూడదు. అలా ఇస్తే.. ఇక్కడ ప్లాట్లు కొన్నవారు కాలుష్యం బారిన పడతారు. రోగాల పాలవుతారు. ఏ శాఖ కూడా పట్టించుకోకపోవటంతో మైనింగ్ బఫర్ జోన్ పరిధిలో ఇటీవల కాలంలో వెంచర్లు వెలుస్తున్నాయి. కొంతమంది బడా వ్యక్తులు అధికార బలంతో నాన్ లే అవుట్లు వేస్తున్నారు. క్ర షర్స్‌కు అత్యంత సమీపంలో ఈ వెంచర్లు వేస్తున్నారు. వీటికి సీఆర్‌డీఏ అనుమతి కూడా లేదని తెలుస్తోంది. సీఆర్‌డీఏ అనుమతి లేకుండా కేవలం నాన్ లే అవుట్లుగా వీటిని అభివృద్ధి చేస్తున్నారు.
నిర్మాణ రంగంపై ప్రభావం
పరిటాలలో క్రషర్స్ యూనిట్ల ద్వారా ఉత్పత్తి అవుతున్న రోడ్డు మెటల్, బిల్డింగ్ మెటల్ కోస్తా జిల్లాల నిర్మాణ రంగ అవసరాలను తీర్చుతోంది. సీఆర్‌డీఏ పరిధిలో ఎక్కడ నిర్మాణానికైనా ఇక్కడి నుంచే ఎగుమతులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అమరావతి రాజధాని నిర్మాణ పనులకు కూడా ఇక్కడి నుంచే కంకర సరఫరా అవుతుంది. క్వారీల పక్కన నివాసాలకు అనుమతిస్తే.. రేపు ప్రజలు కాలుష్యమంటూ వాటిని తరలించాలని తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు బిల్డింగ్, రోడ్డు మెటల్‌ను అందించే క్రషర్స్ సంస్థలు మూసివేసుకోవాల్సి వస్తుంది. ఇదే జరిగితే మెటల్‌ను దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి దుస్థితి ఏర్పడుతుంది. మెటల్ భారంగా కూడా మారే ప్రమాదం ఉంది.