పీజీఆర్‌ఎస్ అర్జీలపై ఫీడ్ బ్యాక్ ఇలాగేనా?
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:59 AM
జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా వచ్చిన 44,078 అర్జీలను పరిష్కరించి, ఆడిట్ చేశారు. వీటిపై చేపట్టిన ఫీడ్‌బ్యాక్ (అభిప్రాయ) సేకరణ నత్తనడకన సాగుతోంది.

- సోమవారానికి పూర్తయ్యింది 21.41 శాతమే
- సచివాలయ సిబ్బందిపై అధికారుల అసహనం
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా వచ్చిన 44,078 అర్జీలను పరిష్కరించి, ఆడిట్ చేశారు. వీటిపై చేపట్టిన ఫీడ్‌బ్యాక్ (అభిప్రాయ) సేకరణ నత్తనడకన సాగుతోంది. సోమవారం నాటికి 21.41 శాతం మాత్రమే పూర్తవడంతో సచివాలయ సిబ్బందిపై అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించిన తీరుపై అర్జీదారుల అభిప్రాయాలను గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులు సేకరించి యాప్‌లో నమోదు చేయాలని గతనెల పదో తేదీన ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం అర్జీదారుల వివరాలను కార్యదర్శుల లాగిన్లకు పంపించారు. అయితే చాలామంది సచివాలయ కార్యదర్శులు తమ లాగిన్లను కూడా చూడని పరిస్థితి నెలకొంది. చూసినవారూ సమాచారం సేకరణలో వెనుకంజలో ఉన్నారు.
తొమ్మిది అంశాలపై..
అర్జీదారుల నుంచి సచివాలయ కార్యదర్శులు తొమ్మిది అంశాలపై అభిప్రాయాన్ని సేకరించాలి. సంబంధిత అధికారులు అర్జీదారుడితో సౌమ్యంగా మాట్లాడారా? లేదా? అభిప్రాయాన్ని ఓర్పు, సహనంతో విన్నారా లేదా వంటివి ప్రధానమైనవి. చివరగా అధికారులకు ఎంత రేటింగ్ (ఒకటి నుంచి ఐదు వరకు) ఇవ్వవచ్చో అర్జీదారులే తెలియజేసేలా పొందుపరిచారు. ఈ సమాచారాన్ని యాప్‌లో కార్యదర్శులు నమోదు చేయాలి.
సంక్షిప్తంగా..
మొత్తం అర్జీలు : 44078
ఫీడ్‌బ్యాక్ పూర్తయినవి : 9436
మిగిలినవి : 34642