Share News

Tirumala: ఉగాదికి కళకళలాడిన తిరుమల

ABN , Publish Date - Mar 31 , 2025 | 01:03 AM

విశ్వావసు నామ సంవత్సర ఉగాది ళసందర్భంగా ఆదివారం తిరుమల కొండ కళకళలాడింది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం శాస్ర్తోక్తంగా నిర్వహించారు.

Tirumala: ఉగాదికి కళకళలాడిన తిరుమల
శ్రీవారి ఆలయం ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక అలంకరణలు

తిరుమల, మార్చి30(ఆంధ్రజ్యోతి): విశ్వావసు నామ సంవత్సర ఉగాది ళసందర్భంగా ఆదివారం తిరుమల కొండ కళకళలాడింది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ నిర్వహించి పంచాంగ శ్రవణం చేశారు. 10 టన్నుల సంప్రదాయ పుష్పాలు, లక్ష కట్‌ ఫ్లవర్స్‌.. తొలిసారిగా కాలిఫోర్నియా, కొలంబియా నుంచి ట్రెసిలియం, డెల్ఫీనియం అనే పుష్పాలను తెప్పించి అలంకరించారు. ఆలయం ముందు గొల్లమండపం పక్కనే ఏర్పాటు చేసిన పల్లకిలో శయనిస్తున్న శ్రీనివాసుడు, ఇరువైపుల గరుత్మంతుడు, హనుమంతుడి రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక, రాధాకృష్ణులు, వేణుగానం చేస్తున్న చిన్నకృష్ణుడు, తోటలో మిత్రులతో కలిసి మామిడిపండ్లను తింటున్న చిన్నకృష్ణుడు.. పుష్పాలతో తయారు చేసిన ఏనుగులు, నవధాన్యాలతో రూపొందించిన శ్రీమహావిష్ణువు ప్రతిమలు ప్రత్యేకంగా నిలిచాయి. ఉద్యానవనం డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వంద మంది కళాకారులు, టీటీడీ గార్డెన్‌ సిబ్బంది వంద మంది రెండురోజుల పాటు శ్రమించారు. తిరుమల మొత్తం పండుగ సందడి కనిపించింది. ఆలయం ముందు పలువురు భక్తులు ఉగాది పచ్చడి పంచిపెట్టారు.

సంస్కృతి, సంప్రదాయాలను వారసత్వంగా కొనసాగించాలి

ఉగాది వేడుకల్లో జేసీ శుభం బన్సల్‌ పిలుపు

పదిమందికి పురస్కారాల ప్రదానం

తిరుపతి(కల్చరల్‌), మార్చి 30(ఆంధ్రజ్యోతి): మన సంస్కృతి, వేద విజ్ఞానం, సనాతన సంప్రదాయాన్ని వారసత్వంగా కొనసాగించాలని జేసీ శుభం బన్సల్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక, సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సరం ఉగాది వేడుకలు ఆదివారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించారు. కూచిపూడి నృత్యం, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు భావనారాయణాచార్యులు పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం నిర్వహించారు. శనివారం జరిగిన పోటీల్లో జూనియర్‌, సబ్‌ జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగంలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

జిల్లాకు చెందిన 10 మందికి ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు.

వారు.. సాహిత్య రంగంలో డాక్టర్‌ కృష్ణవేణి, సంగీత రంగంలో ఎం.సుధాకర్‌, అవధానంలో ఉప్పుదడియం భరత్‌శర్మ, వాయిద్యంలో డాక్టర్‌ వెంకటరామిరెడ్డి, డాక్టర్‌ టి.భారతి, డాక్టర్‌ ఉషా కళావత్‌, సామాజిక సేవలో డాక్టర్‌ పైడి అంకయ్య, రాష్ట్రీయ సేవా సమితి బాలకృష్ణారెడ్డి, పర్యావరణ పరిరక్షణ రంగంలో పాలేటి శివాజీ ఉన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో నరసింహులు, పర్యాటక శాఖ ఆర్డీ డాక్టర్‌ రమణప్రసాద్‌, జిల్లా అధికారి జనార్దన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.


సర్వ శుభకరం

శ్రీకాళహస్తి, మార్చి30(ఆంధ్రజ్యోతి): విశ్వావసు నామ సంవత్సరం సర్వ శుభకరంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటారని శ్రీకాళహస్తీశ్వరాలయ ఆస్థాన సిద్ధాంతి కరణం లక్ష్మీ సత్యనారాయణశర్మ అన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన పంచాంగ పఠనం చేశారు. ద్వాదశ రాశుల వారి గ్రహగోచారాలను వినిపించారు. ఏయే రాశుల వారి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం వంటి అంశాలు ఎలా సాగుతాయన్న విషయాలను వివరించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి సమాజం సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారన్నారు. భూముల వ్యాపారాలు పుంజుకుని రియల్‌ఎస్టేట్‌ వారికి మంచి ఆదాయం వస్తుందన్నారు. ఈవో బాపిరెడ్డి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ముక్కంటీశుడికి ప్రత్యేక అభిషేకాలు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఉగాది సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. స్వామివారి గర్భాలయం ముందు ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, అభిషేకాలు చేయగా, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఈవో బాపిరెడ్డి ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఆలయఅధికారులు కృష్ణారెడ్డి, నాగభూషణం యాదవ్‌, హరియాదవ్‌, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం లోపల, వెలుపల ఏర్పాటు చేసిన పుష్ప, విద్యుత్‌ దీపాలంకరణలు ఆకట్టుకున్నాయి.

Updated Date - Mar 31 , 2025 | 01:03 AM