Naravaripalli : సంక్రాంతికి స్వగ్రామానికి చంద్రబాబు
ABN, Publish Date - Jan 12 , 2025 | 05:46 AM
సంక్రాంతి పండగకు తన స్వగ్రామం నారావారిపల్లికి వెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
భువనేశ్వరి పట్టుదలతోనే పాతికేళ్లుగా వెళ్తున్నా
తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు: సీఎం
అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగకు తన స్వగ్రామం నారావారిపల్లికి వెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. 13, 14 తేదీల్లో తమ గ్రామంలో గడపనున్నట్లు చెప్పారు. ‘నా సతీమణి భువనేశ్వరి పట్టుదలతోనే పాతికేళ్లుగా క్రమం తప్పకుండా సంక్రాంతికి మా ఊరికి వెళ్లి అక్కడ ఉంటున్నాను. సమాజంలో పైనున్నవారు ఒక సంప్రదాయం పాటిస్తే అది మిగిలిన ఒక ప్రేరణగా ఉంటుంది. ఈ రోజుల్లో మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఏదో ఒక సందర్భంలో నలుగురూ ఒకచోట కలవడం, మాట్లాడుకోవడం అవసరం. దానికి ఈ పండగ ఒక సందర్భం కావాలని ఆశిస్తున్నాను. తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగ తెలుగువారందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆనందం పంచాలని కోరుకొంటున్నాను’ అని ఆయన అన్నారు. మన ఊళ్లో ఆనందంగా పండగ చేసుకొనే సమయంలో అదే గ్రామంలో పేదవాడు కూడా ఆనందంగా ఉండేలా చూసుకోవాలని, ఈ విషయంలో కలిగిన వారి పాత్ర పెంచడానికి పి4 విధానాన్ని తీసుకురాబోతున్నామని తెలిపారు. ‘ఆర్థికంగా స్థిరపడినవారు తమ గ్రామంలో ఒకటి లేదా కొన్ని పేదల కుటుంబాలను దత్తత తీసుకొని ఆర్థికంగా వారిని పైకి తేవాలి. అదే పి4 విధానం. దీనిపై కాన్సెప్ట్ పత్రాన్ని ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయబోతున్నాం. ఈ పనిని బాగా చేసినవారిని ఎంపిక చేసి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులు కూడా ఇస్తాం’ అని వివరించారు.
సంక్రాంతి నాటికి రాష్ట్రంలో రోడ్లపై గుంతలు పూడ్చాలని అనుకొని చాలావరకూ చేశామని, మిగిలిన వాటిని వచ్చే నెలాఖరు నాటికి బాగు చేస్తామని, అవసరమైతే అదనపు బడ్జెట్ ఇస్తామని చంద్రబాబు వివరించారు. కాగా, సీఎం సతీమణి భువనేశ్వరితో పాటు ఆమె సోదరి లోకేశ్వరి, తోడికోడలు నారా ఇందిర, బంధువులు కంఠమనేని శ్రీనివాస్, శ్రీనివాస్, శ్రీమాన్ తదితరులు శనివారం మధ్యాహ్నం నారావారిపల్లి చేరుకున్నారు. ఆదివారం రాత్రికి చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర రానున్నారు.
Updated Date - Jan 12 , 2025 | 05:46 AM