Kakinada : పిల్లల సమక్షంలో గన్ ఫైరింగ్
ABN, Publish Date - Jan 07 , 2025 | 05:30 AM
కాకినాడ జిల్లా పెద్దాపురంలో సోమవారం పోలీస్ ఫైరింగ్ రేంజ్‌లో జైళ్ల శాఖ అధికారులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.
వివాదాస్పదంగా జైళ్ల శాఖ అధికారుల తీరు
పెద్దాపురం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పెద్దాపురంలో సోమవారం పోలీస్ ఫైరింగ్ రేంజ్‌లో జైళ్ల శాఖ అధికారులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. చిన్నారులను పక్కన కూర్చోబెట్టుకుని జైళ్ల శాఖ సిబ్బందికి వార్షిక ఫైరింగ్ శిక్షణ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదంతా కోస్టల్ ఆంధ్రా జైళ్ల డీఐజీ సమక్షంలో జరగడం గమనార్హం. జైళ్ల శాఖ ఎస్‌ఐలు, ఇతర సిబ్బందికి ఫైరింగ్ శిక్షణ ఇచ్చారు. అదే సమయంలో ముగ్గురు చిన్నారులను కుర్చీలో కూర్చోబెట్టి వారి ఎదురుగా ఒకేసారి టార్గెట్‌లకు గన్ ఫైరింగ్ చేయడం పోలీస్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. చిన్నారుల సమక్షంలో ఇటువంటివి చేయకూడదని నిబంధనలు ఉన్నా పట్టించుకోకపోవడంతో నిబంధనలు అతిక్రమించినట్లైంది. ఫైరింగ్ సమయంలో అక్కడున్న చిన్నారులు ఓ పోలీస్ అధికారికి చెందిన సంతానంగా తెలుస్తోంది. వారికి కూడా గన్ ఇచ్చి ఫైరింగ్ చేయించినట్లు సమాచారం. ఇది బయటకు తెలియడంతో భయపడిన పోలీస్ అధికారులు ఈ వీడియోలను డిలీట్ చేయించినట్టు తెలిసింది.
Updated Date - Jan 07 , 2025 | 05:30 AM