Share News

Education dept : మహిళా టీచర్లనుఅవమానించినా అక్కడే!

ABN , Publish Date - Feb 10 , 2025 | 06:02 AM

పాఠశాల విద్యాశాఖ అధికారుల నిర్ణయంపై టీచర్లలో అసహనం వ్యక్తమవుతోంది.

Education dept : మహిళా టీచర్లనుఅవమానించినా అక్కడే!

  • సస్పెండ్‌ చేసిన రెండు రోజులకే మళ్లీ అదే స్థానంలో పోస్టింగ్‌

  • పాఠశాల విద్య తీరుపై టీచర్ల అసహనం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

తమహిళా టీచర్లను అవమానించిన డైట్‌ కాలేజీ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌కు తిరిగి అక్కడే పోస్టింగ్‌ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. పాఠశాల విద్యాశాఖ అధికారుల నిర్ణయంపై టీచర్లలో అసహనం వ్యక్తమవుతోంది. ఫౌండేషన్‌ లిటరసీ న్యూమరసీ(ఎఫ్ఎల్‌ఎన్‌)పై ప్రాథమిక పాఠశాలల టీచర్లకు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా డైట్‌ కాలేజీల ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా టీచర్లకు ఒంగోలులో శిక్షణ తరగతులు నిర్వహించారు. మైనంపాడు డైట్‌ కాలేజీ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ సోమా సుబ్బారావు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. మహిళా, పురుష టీచర్లను వేర్వేరు వరుసల్లో కూర్చోబెట్టి ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శిక్షణ తరగతులు ప్రారంభమైన ఈనెల 3న సాయంత్రం కోఆర్డినేటర్‌ సుబ్బారావు ప్రతి లైనులోనూ మహిళా, పురుష టీచర్లను పక్కపక్కనే కూర్చోబెట్టారు. దీనిపై టీచర్లు అసహనం వ్యక్తంచేశారు. ఇదేం విధానం అని ఓ మహిళా టీచర్‌ నిలదీయడంతో ఆగ్రహించిన కోఆర్డినేటర్‌ ఆమెకు ఇరువైపులా పురుష టీచర్లను కూర్చోబెట్టి అవమానించారు. ఇది బయటకి పొక్కడంతో ఉన్నతాధికారులు ఆ మరుసటి రోజే ఆర్జేడీతో విచారణ జరిపించారు. శిక్షణ కేంద్రంలో ఉన్న 150 మంది టీచర్లను ఆర్జేడీ విచారించి.. కోఆర్డినేటర్‌ తప్పుగా వ్యవహరించినట్టు నిర్ధారించి, వెంటనే సస్పెండ్‌ చేశారు. అయితే అనూహ్యంగా రెండు రోజుల తర్వాత సోమా సుబ్బారావుకు తిరిగి మైనంపాడు డైట్‌ కాలేజీ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. పైగా ఆయనను ప్రశ్నించిన మహిళా టీచర్‌దే తప్పు అనే కోణంలో ప్రచారం మొదలుపెట్టారు.


సుబ్బారావు తప్పు చేసినట్లు విచారణలో టీచర్లు స్పష్టంగా చెప్పిన తర్వాతే సస్పెండ్‌ చేయగా, రెండు రోజుల్లో ఏం మారిందని ఆయన్ను తిరిగి అదే స్థానంలో నియమించారని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. విశాఖపట్నంకు చెందిన టీడీపీ ముఖ్య నేత అండతో సుబ్బారావును కాపాడినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలోనూ శిక్షణ కార్యక్రమాల్లో మహిళా, పురుష టీచర్లను పక్కపక్కనే కూర్చోబెట్టి అసౌకర్యానికి గురిచేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఆయన సస్పెన్షన్‌తో జిల్లాలోని టీచర్లంతా ఊపిరి పీల్చుకోగా, తిరిగి అక్కడే పోస్టింగ్‌ ఇవ్వడంపై అందరూ విస్మయం వ్యక్తంచేస్తున్నారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 06:02 AM