Share News

Delhi Elections 2025: బీజేపీ ఘన విజయం.. తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల రియాక్షన్..

ABN , Publish Date - Feb 08 , 2025 | 03:03 PM

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం ప్రధాని నరేంద్రమోదీ పట్ల ఆ రాష్ట్ర ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనమని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి తరఫున ప్రచారం చేసి విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఏపీ సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు.

Delhi Elections 2025: బీజేపీ ఘన విజయం.. తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల రియాక్షన్..
Delhi Assembly Elections 2025

అమరావతి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దాదాపు ఖరారు అయ్యింది. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కమలం పార్టీ నేతలు ఎగిరి గంతేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, విశాఖ, విజయవాడ, ఏలూరు, గుంటూరు సహా పలు ప్రాంతాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయం పార్టీ జెండా ఎగరవేయనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. కాగా, బీజేపీ అఖండ విజయం సాధించడంతో తెలుగు రాష్ట్రాల మంత్రులు, కూటమి నేతలు, రాజకీయ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం ప్రధాని నరేంద్రమోదీ పట్ల ఆ రాష్ట్ర ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనమని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి తరఫున ప్రచారం చేసి విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఏపీ సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌తో సహా ఆ పార్టీ ముఖ్య నాయకుల్ని ఓడించి ప్రజాధనాన్ని దోచుకునే వారిని క్షమించబోమని ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని మంత్రి చెప్పుకొచ్చారు. అభివృద్ధి, సంక్షేమానికి అందలం ఎక్కించి, అవినీతి, అబద్ధాలకు ఢిల్లీ ప్రజలు గుణపాఠం నేర్పారని అన్నారు. కాంగ్రెస్ సమాధిపై ఢిల్లీ ప్రజలు మరో రాయిని పేర్చారని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. బీజేపీకి పట్టం కట్టి దేశ రాజధానిని ఒక వికసిత్ ఢిల్లీగా తీర్చిదిద్దడానికి బాటలు వేసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఈసారి బీజేపీని ఆదరించిన దక్షిణాది రాష్ట్రాల ప్రజలకూ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. గెలుపొందిన వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.


ఢిల్లీ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆప్ అధినేత కేజ్రీవాల్‌ నిలబెట్టుకోలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సంక్షేమం, తాయిలాలతో ప్రజలను మభ్యపెట్టాలని కేజ్రీవాల్ చూశారని కేంద్రమంత్రి మండిపడ్డారు. ప్రజల్లో స్పష్టమైన మార్పు తాము ప్రచారం చేసినప్పుడే కనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఢిల్లీలో వెహికల్ పొల్యూషన్‌తోపాటు పొలిటికల్ పొల్యూషన్ ఉందని, బీజేపీ గెలుపుతో ఆ రెండూ పోతాయని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తాను ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రతి చోటా బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారని పెమ్మసాని చెప్పుకొచ్చారు. ఆ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే డబుల్ ఇంజన్ సర్కార్‌ని గెలిపించాలని సంతోషం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ప్రజలకు మంచి నీరు, సరైన రోడ్లు కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. ఆయన మంచి చేస్తారని రెండు సార్లు గెలిపిస్తే అవినీతి ఆరోపణలు ఎదురుకొన్నారని ధ్వజమెత్తారు. నీతి నిజాయతీతో రాజకీయం చేస్తానని గెలిచిన కేజ్రీవాల్ ఆ విధంగా చేయలేకపోయారు కాబట్టే ప్రజలు అతన్ని ఓడించారని చెప్పుకొచ్చారు. ఇక, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటలను ప్రజలు విశ్వసించడం లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పుకొచ్చారు.

Updated Date - Feb 08 , 2025 | 03:18 PM