Dr Prabhavati: గాయాలెలా ఉంటాయో తెలియదు
ABN , Publish Date - Apr 09 , 2025 | 03:37 AM
రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసులో విచారణకు హాజరైన డాక్టర్ ప్రభావతి, గాయాలు ఎలా ఉంటాయో కూడా తెలియదని విచిత్ర సమాధానం ఇచ్చారు. గైనకాలజిస్టినని చెప్పిన ఆమెపై దర్యాప్తు అధికారి అసహనం వ్యక్తం చేశారు

నేను గైనకాలజిస్టును
జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి వింత సమాధానం
రఘురామ కేసులో ముగిసిన విచారణ
అసలు సహకరించని డాక్టర్
సుప్రీంకు నివేదిక ఇవ్వనున్న ప్రకాశం ఎస్పీ
గాయాలెలా ఉంటాయో తెలియదు!
ఒంగోలు క్రైం, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): గాయాలు ఎలా ఉంటాయో కూడా తనకు తెలియదని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్) మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి వింతగా ఇచ్చిన సమాధానం విని పోలీసులు విస్తుపోయారు. రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఐదో నిందితురాలి(ఏ-5)గా ఉన్న ప్రభావతి.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వరుసగా రెండో రోజు మంగళవారం కూడా దర్యాప్తు అధికారి అయిన ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎదుట హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ఆమె రాగా.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7.30 వరకు ఆయన ప్రశ్నించారు. సోమవారం మాదిరిగానే విచారణలో తెలియదు, గుర్తులేదు అనడంతోపాటు గాయాలెలా ఉంటాయో తనకు తెలియదని ఆమె చెప్పినట్లు తెలిసింది. రఘురామరాజుకు గాయాలు అయ్యాయి కదా.. లేదని మీరు ఎందుకు నివేదిక ఇచ్చారని ఎస్పీ ప్రశ్నించగా.. ‘అసలు గాయాలెలా ఉంటాయో నాకు తెలియదు.. నేను గైనకాలజిస్టును’ అని ఆమె బదులిచ్చినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన ఎస్పీ.. మీరు డాక్టర్ డిగ్రీ ఎలా తీసుకున్నారని మండిపడినట్లు తెలిసింది. రెండ్రోజుల విచారణలో ఆమె అసలు సహకరించలేదని తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు అధికారి సుప్రీంకోర్టుకు నివేదిక అందజేస్తారని సమాచారం.