అమలాపురం నుంచి విశాఖపట్నం వరకు..!
ABN , Publish Date - Feb 05 , 2025 | 11:44 PM
అమలాపురం రూరల్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): గంజాయి వంటి మత్తు పదార్ధాలకు బానిసలైన ముగ్గురు యువకులు మరో ముగ్గురు బాలలతో కలిసి వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. అమలాపురం నుంచి ప్రారంభించి విశాఖపట్నం జిల్లా కంచరపాలెం పోలీసుస్టేషన్ పరిధి వరకు వీరు చోరీలకు పాల్పడ్డారు. అమలా

గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై
చోరీల బాట పట్టిన యువకులు అరెస్టు
రూ.8.82లక్షల విలువైన 13 మోటారు సైకిళ్లు స్వాధీనం
అమలాపురం రూరల్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): గంజాయి వంటి మత్తు పదార్ధాలకు బానిసలైన ముగ్గురు యువకులు మరో ముగ్గురు బాలలతో కలిసి వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. అమలాపురం నుంచి ప్రారంభించి విశాఖపట్నం జిల్లా కంచరపాలెం పోలీసుస్టేషన్ పరిధి వరకు వీరు చోరీలకు పాల్పడ్డారు. అమలాపురం తాలూకా పోలీసు స్టేషన్‌లో నమోదైన మోటారు సైకిల్ చోరీ కేసును చేధించేందుకు తాలూకా సీఐ డి.ప్రశాంత్‌కుమార్, తాలూకా ఎస్‌ఐ వై.శేఖర్‌బాబుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నేరస్తులను పట్టుకునేందుకు నియమించారు. కోనసీమ జిల్లాలో వరుస దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు యువకులను తాలూకా సీఐ ప్రశాంత్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్కే ప్రసాద్ స్థానిక తాలూకా పోలీసుస్టేషన్‌లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. 13 మోటారు సైకిళ్లను చోరీ చేసిన మేకల హరివీరవెంకటశ్రీరామమూర్తి, వీరమల్లు తరుణ్ శశికుమార్, దొంగ లోకేశ్‌లతో పాటు మరో ముగ్గురు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. 13 మోటారు సైకిళ్లతో పాటు 3 ఎక్సైడ్ బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. అమలాపురం తాలూకా పోలీసుస్టేషన్‌తో పాటు అల్లవరం, ముమ్మిడివరం, అమలాపురం టౌన్, కొత్తపేట, విశాఖ జిల్లా కంచరపాలెం, ఉప్పలగుప్తం, అంబాజీపేట పోలీసుస్టేషన్ల పరిధిలో వీరు వరుస దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. రూ.8.82లక్షల విలువైన మోటారు సైకిళ్లతో పాటు ఎక్సైడ్ బ్యాటరీలను రికవరీ చేసినట్టు వెల్లడించారు. కేసును చేధించిన సీఐ, ఎస్‌ఐలతో పాటు ఏఎస్‌ఐ వి.సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ యు.రవికుమార్‌రాజు, కానిస్టేబుళ్లు బి.శివరామకృష్ణ, ఎం.ధర్మరాజులను డీఎస్పీ ప్రసాద్, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. కేసును చేధించిన వీరికి రివార్డులు అందజేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు. చోరీ చేసిన మోటారు సైకిళ్లను అమ్మడంతో పాటు తాకట్టు పెట్టడం, ఒక్కోసారి చెత్తను కొనుగోలు చేసేవారికి స్ర్కాప్ కింద అమ్మివేయడం జరుగుతుందన్నారు. సీసీ కెమెరాల ఆధారంగానే ఈ కేసును చేధించామన్నారు. యువకులపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని, గంజాయి వంటి మత్తు పదార్ధాలకు బానిసలైతే దొంగతనాలకు పాల్పడడంతో పాటు ఒక్కోసారి లా అండ్ ఆర్డరు సమస్యలు సృష్టించే అవకాశం ఉందన్నారు. భద్రత కోసం తప్పనిసరిగా ముఖ్యకూడళ్లలో, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకతను డీఎస్పీ వివరించారు. బాల నేరస్తులను వ్యక్తిగత పూచీకత్తులపై ఇంటికి పంపిస్తున్నట్టు వెల్లడించారు.