Share News

జనసేన నేతల మధ్య భగ్గుమన్న విభేదాలు

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:34 AM

అమలాపురం/అయినవిల్లి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న పి.గన్నవరం ఎస్సీ రిజర్వు నియోజకవర్గ పరిధిలోని అయినవిల్లి జనసేన నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన నాయకుడిపై మండలాధ్యక్షుడు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి తాలూకా బంధువులు మండలాధ్యక్షుడి వాహనాన్ని ధ్వంసం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. క్షతగాత్రుడిని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఏరియా ఆసుపత్రిలో పరామర్శించడానికి వచ్చినప్పుడు బాధితుడి బంధువులు ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందుకు సంబం

జనసేన నేతల మధ్య భగ్గుమన్న విభేదాలు
పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను ప్రశ్నిస్తున్న ఉమా వర్గీయులు

జనసేన నాయకుడిపై అయినవిల్లి మండలాధ్యక్షుడు హత్యాయత్నం

మండలాధ్యక్షుడు కారు ధ్వంసం

చేసిన వ్యతిరేక వర్గీయులు

ఇరు వర్గాల ఫిర్యాదులపై కేసులు

నమోదు చేసిన అయినవిల్లి పోలీసులు

అమలాపురం/అయినవిల్లి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న పి.గన్నవరం ఎస్సీ రిజర్వు నియోజకవర్గ పరిధిలోని అయినవిల్లి జనసేన నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన నాయకుడిపై మండలాధ్యక్షుడు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి తాలూకా బంధువులు మండలాధ్యక్షుడి వాహనాన్ని ధ్వంసం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. క్షతగాత్రుడిని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఏరియా ఆసుపత్రిలో పరామర్శించడానికి వచ్చినప్పుడు బాధితుడి బంధువులు ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు రోజుల క్రితం కోనసీమ జిల్లా పి.గన్నవరం మండల జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మార్కెట్‌ కమిటీ వ్యవహారంపై ఇద్దరు నాయకుల మధ్య వచ్చిన విబేధాలు ఇందుకు కారణంగా భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం అయినవిల్లికి చెందిన జనసేన నాయకుడు తోలేటి ఉమా ఇంటిపై మండలాధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్‌ తన అనుచరులతో కలిసి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉమా, అతని భార్యపై రాజేష్‌తో పాటు మరికొందరు దాడి చేసి ఉమాను తీవ్రంగా గాయపరిచారు. ఇంట్లోకి చొరబడి కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అడ్డువచ్చిన అతని భార్యపై కూడా దాడికి తెగబడ్డారు. తలపై బలమైన గాయం తగిలిన ఉమాను అమలాపురంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. తోలేటి ఉమాపై దాడిచేసిన పోలిశెట్టి రాజేష్‌ ఇంటిపైకి ఉమా వర్గీయులు ఎదురు దాడికి వెళ్లి బయట ఉన్న రాజేష్‌ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ వ్యవహారం మండలంలో రాజకీయంగా చర్చినీయాంశంగా మారింది. అయితే గాయపడ్డ తోలేటి ఉమాను పరామర్శించేందుకు సోమవారం పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఏరియా ఆసుపత్రికి వచ్చిన క్రమంలో ఆయనతో ఉన్న కొందరు నాయకులు మీడియాపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తూ వీడియోలు తీయకుండా అడ్డుకున్నారు. పరామర్శ అనంతరం బయటికి వచ్చిన ఎమ్మెల్యే సత్యనారాయణను బాధితుడైన ఉమా వర్గం నాయకులు నిలదీశారు. పార్టీ మండలాధ్యక్షుడై ఉండి ఈ విధంగా దాడులకు పాల్పడ్డగా ఏం చర్యలు తీసుకుంటారంటూ గట్టిగా నిలదీశారు. దాంతో ఈ వివాదంపై జనసేన పార్టీ అధిష్టానానికి నివేదిస్తూ లేఖ రాస్తానని, ఇది మా కుటుంబ సమస్య చర్చించి పరిష్కరించుకుంటామంటూ సమాధానమిచ్చారు. అయితే ఈ వివాదంపై అయినవిల్లి పోలీసులు ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించి కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా బాధితుడైన ఉమా భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్యర్థి వర్గానికి చెందిన జనసేన పార్టీ మండలాధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్‌, అబ్బిరెడ్డి యుగంధర్‌, పోలిశెట్టి రవి, మరో ఇద్దరిపై సెక్షన్‌ 329 (4), 109 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా రాజేష్‌ కారు ధ్వంసానికి సంబంధించి రాజేష్‌ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 361(6), 329(3), రెడ్‌ విత్‌ 35 సెక్షన్‌ కింద అయినవిల్లి పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:34 AM