కోకో హబ్‌గా కోనసీమ
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:42 AM
దశలవారీగా సాగు విస్తీర్ణాన్ని పెంచుతూ జిల్లాను కోకో హబ్‌గా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఉద్యానవన అధికారులను ఆదేశించారు.

కొబ్బరి తోటల్లో అనువైన సాగు కోకో
జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్
అమలాపురం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): దశలవారీగా సాగు విస్తీర్ణాన్ని పెంచుతూ జిల్లాను కోకో హబ్‌గా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఉద్యానవన అధికారులను ఆదేశించారు. కోనసీమలో కొబ్బరితోటలు కోకో సాగుకు అంతర పంటగా అనువైన వాతావరణం మెండుగా ఉందన్నారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లాస్థాయి కోకో కమిటీ సమావేశం ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, కమిటీ సభ్యులతో నిర్వహించారు. కోకో కాయల కోత అనంతరం ప్రోసెసింగ్ యూనిట్ల స్థాపనకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏక పంటగా కొబ్బరి సాగు విరాజిల్లేదని, ఇరియోఫిడ్ నల్లి తెగులు తాకిడితో కొబ్బరి దిగుబడి తగ్గిపోయిందన్నారు. కొబ్బరిపై ఆధారపడి రైతులు మనుగడ సాగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ తరుణంలో రైతులను అన్నివిధాలా ఆదుకునే కోకోను అంతర పంటగా పండించాలన్నారు. కోకో నాటిన మూడో ఏడాది నుంచి దిగుబడి వస్తుందని, కానీ కాయల నుంచి తీసిన గింజలను నాణ్యతతో ప్రోసెసింగ్ చేసే విధానంపై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో గిట్టుబాటు ధరలు పొందలేకపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో వెయ్యి ఎకరాలకు ఒక కామన్ పర్మింటేషన్ కేంద్రాన్ని ఎకరం స్థలంలో నెలకొల్పే దిశగా సమగ్ర ప్రతిపాదనలకు శ్రీకారం చుట్టామన్నారు. గింజల గ్రేడింగ్, బుట్ట పద్ధతి, కృత్రిమంగా ఎండబెట్టడం, నిల్వ చేయడం తదితర అంశాలకు సంబంధించి యూనిట్‌ను నెలకొల్పేందుకు షెడ్ల నిర్మాణం, మానవ వనరుల లభ్యత, వివిధ రకాల పరికరాల ఏర్పాటుపై శాస్త్రవేత్తల సమన్వయంతో సమగ్రమైన ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. దేశీయ అవసరాలకు సరిపడా దిగుబడులు లేనందున ఈ పంటకు మంచి భవిష్యత్తు ఉందని, ఇప్పటికే నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారన్నారు. జిల్లాలో ప్రస్తుతం 2500 ఎకరాల్లో కోకో పంట ఉందని, దీనిని దశల వారీగా ఏడాదికి వెయ్యి ఎకరాల చొప్పున విస్తీర్ణాన్ని పెంచనున్నామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఉద్యానవన విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్ శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత, శాస్త్రవేత్త నవీన్‌కుమార్, జిల్లా ఉద్యాన అధికారి బీవీ రమణ, శ్రీనివాస్‌రెడ్డి, వీరారెడ్డి, జిల్లా పరిశ్రమల కేం ద్రం జనరల్ మేనేజర్ పీకేపీ ప్రసాద్, ఉద్యాన అధికారులు దిలీప్, చందన పాల్గొన్నారు.