Share News

మృత్యువుతో పోరాడి.. ఓడి..

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:35 AM

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఒక్కగానొక్క కూతురు ... 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పుట్టిన బిడ్డ. పేద కుటుంబమైనా ఎంతో అపురూపంగా చూసుకుని పై చదువుల కోసం తపన పడి పట్నం పంపిన ఆ తండ్రికి కూతురు మృతి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరం కిమ్స్‌ బొల్లినేని ఆసుపత్రి ఉద్యోగి లైంగిక వేధింపులతో ఆత్మహత్యాయత్యానికి పాల్పడిన ఫార్మాసిస్ట్‌ నల్లపు నాగాంజలి శుక్రవారం మృ

మృత్యువుతో పోరాడి.. ఓడి..
నాగాంజలి మృతదేహాన్ని అంబులెన్సులో ఎక్కిస్తున్న దృశ్యం

ఫార్మాసిస్ట్‌ నాగాంజలి మృతి

కిమ్స్‌ బొల్లినేని ఉద్యోగి లైంగిక వేధింపులతో ఆత్మహత్యాయత్నం

13 రోజులు వైద్య చికిత్స

రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రిలో

పోస్టుమార్టం, కుటుంబీకులకు అప్పగింత

నాగాంజలి తండ్రికి వివిధ రాజకీయ

పార్టీల నాయకుల పరామర్శ

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఒక్కగానొక్క కూతురు ... 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పుట్టిన బిడ్డ. పేద కుటుంబమైనా ఎంతో అపురూపంగా చూసుకుని పై చదువుల కోసం తపన పడి పట్నం పంపిన ఆ తండ్రికి కూతురు మృతి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరం కిమ్స్‌ బొల్లినేని ఆసుపత్రి ఉద్యోగి లైంగిక వేధింపులతో ఆత్మహత్యాయత్యానికి పాల్పడిన ఫార్మాసిస్ట్‌ నల్లపు నాగాంజలి శుక్రవారం మృతిచెందింది. 13 రోజుల సుదీర్ఘ వైద్యచికిత్స అనంతరం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. ఈ మేరకు నాగాంజలి మృతదేహానికి రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. పోస్టుమార్టం అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో ప్రైవేట్‌ అంబులెన్సులో నాగాంజలి మృతదేహాన్ని స్వగ్రామమైన ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామానికి తరలించారు. నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం, చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన అత్యంత సున్నితం కావడంతో ప్రభుత్వ బోధనాసుపత్రి వద్ద పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రికి వచ్చారు. నాగాంజలి తం డ్రి దుర్గారావును పరామర్శించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌, జనసేన పార్టీ నగర ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, ఐద్వా, మహిళా సంఘం నాయకులు తులసి, లావణ్య, ఇతర విద్యా, ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వ బోధనాసుపత్రికి చేరుకున్నారు. నాగాంజలి మృతదేహాన్ని అంబులెన్సులో తరలించే సమయంలో వామపక్షపార్టీల నాయకులు అరుణ్‌, మధు తదితరులు తీవ్ర నిరసన తెలియజేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

పుట్టెడు దుఃఖంలో తండ్రి దుర్గారావు

ఆసుపత్రి వద్ద నాగాంజలి తండ్రి దుర్గారావు పరిస్థితి చూస్తే ఎవరికైనా కన్నీళ్లు పెట్టించకమానవు. నోటమాట రాని పరిస్థితుల్లో దిగాలుగా, దైన్యంగా ఎవరికీ చెప్పుకోలేక, బాఽధ ఆవేదనలను తనలోనే దిగమింగుకోలేని నిస్సహాయపరిస్థితుల్లో ఆసుపత్రి పోలీస్‌ అవుట్‌పోస్టు వద్ద నున్న చెట్టుకింద వేదనతో కూర్చోవడం అందరినీ కలచివేసింది. కూతురి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుంటే తనవారెవరూ తోడు లేని పరిస్థితుల్లో దుర్గారావు తానొక్కడే మౌనంగా రోదిస్తూన్న స్థితి అత్యంత దయనీయంగా కనిపించింది. ఎవరెవరో నాయకులు రావడం, పరామర్శించడం, సంఘ పెద్దలు తోడుగా నిలవడం ... అవన్నీ దుర్గారావుకు కలగానే మిగులుతాయా అన్నట్టుగా అక్కడి పరిస్థితులు మారాయి.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

మా పాపకు జరిగిన అన్యాయం ఏ పాపకూ జరగకూడదు. వాడిని కఠినంగా శిక్షించాలి, ఏమైనా సరే నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిందే. ఇది మా కోరిక. ప్రభుత్వం తరపున మాకు అన్ని సహకారాలు అందుతున్నాయి. మా సంఘం తరపున కూడా మంచిగానే చూస్తున్నారు అని నాగాంజలి తండ్రి దుర్గారావు తెలిపారు.

Updated Date - Apr 05 , 2025 | 12:35 AM