వాడపల్లి వెంకన్న కల్యాణోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:43 AM
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు.

ఆత్రేయపురం, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం వాడ పల్లి కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే బం డారు సత్యానందరావు అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ నిషాంతి పాల్గొన్నారు. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు సంబంధించి అధికారులు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది జరిగిన ఉత్సవాలను ప్రొమో ద్వారా ఉపకమిష నరు నల్లం సూర్యచక్రధరరావు కలెక్టర్‌కు వివరించారు. ప్రస్తుతం ఉత్సవాలకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను ఆయనకు వివరించా రు. ఏప్రిల్ 8న రథోత్సవం, తీర్థం, స్వామివారి కల్యాణోత్సవాలకు లక్షలాదిమంది భక్తులు తరలిరానున్న దృష్ట్యా ఏర్పాట్లు ఏ స్థాయిలో నిర్వహిస్తున్నారో చర్చించారు. టాయిలెట్లు, భక్తుల స్నానాలు, తాగునీరు, వైద్య శిబిరం, విద్యుత్ తదితర సమస్యలపై శాఖల వారీగా సంబంధి త అధికారులతో ఆయన చర్చించారు. అందరి సమష్టి కృషితో బాధ్యతాయుతంగా ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగం ఉత్సవాల్లో తమవంతు సేవలను అందిస్తుందని చెప్పారు. ఐదు సెక్టార్లుగా విభజించి పోలీసులు విధులు నిర్వహిస్తారన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడు తూ గత ఏడాది లోటుపాట్లను సరిచేసుకుని ఉత్సవాల ఏర్పాట్లలో నిమగ్నం కావాలని తద్వారా రోజురోజుకు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలన్నారు. కల్యాణోత్సవాల అనంతరం మాస్టర్ ప్లాన్ ద్వారా వెంకన్న ఆలయ అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పి.శ్రీకర్, డీఎస్పీ సుంకర మురళీమోహన్, సీఐ విద్యాసాగర్, ఎస్‌ఐ ఎస్.రాము, తహశీల్దారు రాజేశ్వరరావు, ఎంపీడీవో రామన్ పాల్గొన్నారు.