Share News

Sanskrit Teacher: మార్కుల కోసం మాతృభాషకు మంట

ABN , Publish Date - Apr 11 , 2025 | 03:29 AM

సంస్కృతం కోసం కొత్త అధ్యాపక పోస్టులు సృష్టించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ద్వితీయ భాషగా తెలుగు ఎంపిక తగ్గించే అవకాశాన్ని పెంచుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది

Sanskrit Teacher: మార్కుల కోసం మాతృభాషకు మంట

  • అన్ని ప్రభుత్వ కాలేజీల్లోనూ ‘సంస్కృతం’?

  • వివరాలు కోరిన ఇంటర్‌ విద్య సంచాలకులు

  • వచ్చే ఏడాదే అమలు చేయాలని యోచన?

  • మూడేళ్ల ప్రతిపాదన తెరపైకి.. అమలైతే ఇంటర్‌లో తెలుగు కనుమరుగే

  • ఆలోచన విరమించుకోవాలి.. తెలుగు సంఘాల డిమాండ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనూ తెలుగుకు గండికొట్టే ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. అన్ని కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టేందుకు అవసరమైన పోస్టులకు సంబంధించి సవివర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సమాచారం అందించాలని ఇంటర్‌ విద్య ప్రాంతీయ సంచాలకులు అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఈనెల 8న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో ఇప్పటికే ఉన్న సంస్కృత అధ్యాపకుల పోస్టులు, చదువుతున్న విద్యార్థుల సంఖ్యనూ తెలపాలని, కొత్తగా ఎన్ని పోస్టులు అవసరమవుతాయో పేర్కొనాలని ఆదేశించారు. కాలేజీల నుంచి సమాచారం వచ్చిన తర్వాత దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇదే జరిగితే ఇంటర్‌లో తెలుగు పూర్తిగా కనుమరుగవుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. మార్కులు ఎక్కువగా వస్తాయన్న ఉద్దేశంతో ద్వితీయ భాషగా సంస్కృతంను ఎంచుకునే జాఢ్యం కార్పొరేట్‌, ప్రైవేటు కాలేజీల్లోనే ఎక్కువగా ఉంది. దీన్ని ప్రభుత్వ కాలేజీలకూ వర్తింపజేయాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ కాలేజీల్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా అమలుచేయాలన్న నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు, తెలుగు భాషా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకూ అక్కరకు రాని సంస్కృతం భాషతో విద్యార్థులకు మార్కులు పెరుగుతాయని ఇంటర్‌ విద్య అధికారులు చెప్పడం... వారి అవివేకానికి నిదర్శనమని మండిపడుతున్నాయి


గతంలోనూ ఓ సారి ప్రతిపాదన

అన్ని ప్రభుత్వ కాలేజీల్లో సంస్కృతం ప్రవేశపెట్టాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే ప్రతిపాదన వచ్చింది. 2022లో ఎమ్మెల్సీ కవిత చేసిన విజ్ఞప్తి మేరకు సర్కారు ఆ దిశగా చర్యలు చేపట్టింది. కనీసం 150 ప్రభుత్వ కాలేజీల్లో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని భావించగా, కొత్త పోస్టులపైనా చర్చలు జరిగాయి. కానీ, అప్పట్లో దీనిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ తర్వాత అది ముందుకు వెళ్లలేదు. ఇదే అంశం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. వాస్తవానికి గత ఏడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. మాతృభాషలో బోధనకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది. ఈ దిశగా రెండు నెలల క్రితం పాఠశాల విద్యలో తెలుగును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదోతరగతి వరకు రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ స్కూళ్లలోనూ తెలుగును ఓ భాషగా అమలుచేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయంపై తెలుగు భాషాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కానీ, ఇప్పుడు మార్కుల కోసం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించడాన్ని భాషావేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఆగిన ప్రతిపాదనను తాజాగా ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుండడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.


సంస్కృతంతో సాధించిందేమిటి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు దశాబ్దాల క్రితమే ఇంటర్‌లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 436 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలుండగా.. 20 కాలేజీల్లోనే ద్వితీయ భాష సంస్కృతం బోధించే అధ్యాపకులున్నారు. మిగతా 416లో 90శాతం కాలేజీల్లో తెలుగు అధ్యాపకులు, మిగతా 10శాతం కాలేజీలో హిందీ, ఉర్దూ, అరబిక్‌ బోధకులు ఉన్నారు. పదోతరగతి వరకు మాతృభాషలో చదువుకున్న విద్యార్థులందరూ ఇంటర్‌లోనూ ద్వితీయ భాషగా తెలుగునే ఎక్కువగా తీసుకుంటున్నారు. డిగ్రీ, ఆపై ఉన్నత విద్య ఇంగ్లిషు మాద్యమంలో అభ్యసించినా.. తెలుగు పునాదులు బలంగా ఉంటున్నాయి. మూడు దశాబ్దాల క్రితం ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టినప్పుడే తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగే కొందరు బడా స్వాముల విజ్ఞప్తులతో ఇంటర్‌లో వచ్చి చేరిన సంస్కృతాన్ని ఇంటర్‌ బోర్డు అధికారులు ప్రోత్సహిస్తూ వచ్చారు. వాస్తవానికి దేవనాగరి లిపిలో ఉండే సంస్కృతాన్ని ఆ లిపిలో ఏ ఒక్క విద్యార్థి కూడా పరీక్ష రాయరు. ప్రస్తుతం కార్పొరేట్‌, ప్రైవేటు కాలేజీల్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ఎంచుకున్న విద్యార్థులందరూ ఇంగ్లిషు లేదా తెలుగులోనే రాస్తారు. అయినా.. వీరికి 100 మార్కులకు అత్యధికంగా 99 వరకు వస్తున్నాయి. మరోవైపు తెలుగు, హిందీకి గరిష్ఠంగా 70కి మించి మార్కులు రావడం లేదు. దీంతో మార్కుల కోసమే విద్యార్థులు సంస్కృతాన్ని తీసుకుంటున్నారన్న వాదనలున్నాయి.


విరమించుకోవాలి: సంఘాలు

ప్రభుత్వ ఆలోచన అమల్లోకి వస్తే రాష్ట్రంలో మాతృభాష పరిస్థితి మరింత దిగజారుతుందని తెలుగు భాష, సాహితీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మాతృ భాషను బతికించుకోవడానికి తమిళనాడు వంటి రాష్ట్రాలు కేంద్రంతో పోట్లాడుతుంటే తెలంగాణలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని ప్రముఖ సాహితీవేత్త తూమాటి సంజీవరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యలో తెలుగు తప్పనిసరి చేయాల్సిన ప్రభుత్వం.. కీలకమైన ఇంటర్‌లో నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామని తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్ల సంఘం పేర్కొంది. పదోతరగతి వరకు సంస్కృతం చదవని విద్యార్థులకు ఇంటర్‌లో ప్రవేశపెడితే కలిగే ప్రయోజనం ఏంటని సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి.శ్రీనివాస్‌, కొపిశెట్టి సురేష్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


సంస్కృత పోస్టుల కోసమేనా..?

వేద పాఠశాలల్లో సంస్కృతం చదివిన తమకు ఉద్యోగ అవకాశాల్లేవని గతంలో సంస్కృత పండితులు మాజీ సీఎం కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న ఓ స్వామిని ఆశ్రయించారు. ఆయన సూచనల మేరకు గత ప్రభుత్వం అమలు చేయాలని మూడేళ్ల క్రితమే అనుకున్నా సాధ్యపడలేదు. రాష్ట్రంలోని చాలా కాలేజీల్లో శాశ్వత తెలుగు అధ్యాపకులే లేరు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలోనే ఏటా నియమిస్తున్నారు. అలాంటిది ఏకంగా సంస్కృత అధ్యాపకుల కోసం కొత్త పోస్టులు క్రియేట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ద్వితీయ భాషగా తెలుగును ఎంచుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గనుంది. వచ్చే ఏడాది నుంచి సంస్కృతం అందుబాటులోకి వస్తే చాలా మంది సంస్కృతాన్ని ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇంటర్‌లో తెలుగుతో పాటు తెలుగు అఽధ్యాపకులూ కనుమరుగు కానున్నారు.

Updated Date - Apr 11 , 2025 | 03:32 AM