Share News

ఎన్నాళ్లీ నిరీక్షణ.!

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:36 AM

గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో గృహ సముదాయాలు నేడు అసౌకర్యాల చెరలో చిక్కుకుపోయాయి.

ఎన్నాళ్లీ నిరీక్షణ.!
బొమ్మూరులోని టిడ్కో గృహ సముదాయం

ప్రభుత్వమొస్తే కష్టాలు తీర్చేస్తామని ఎన్నికల హామీ

వచ్చి పది నెలలు దాటినా అడుగు ముందుకు పడని వైనం

జూన్‌ 12 నాటికి ఇళ్లు అప్పగించాలని తాజా లక్ష్యం

మౌలిక సదుపాయాలు లేకుండా ఎలా ఉండేదని లబ్ధిదారుల ప్రశ్న

ఉన్న ఫ్లాట్లూ అస్తవ్యస్తం.. తాగునీరే లేని దుస్థితి

నేడు విజయవాడలో రాష్ట్రస్థాయి టిడ్కో సమావేశం

పేదవాడి సొంతింటి కలను నిజం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో గృహాల నిర్మాణం పెద్దఎత్తున జరిగింది. అపార్టుమెంటు తరహాలో చేసిన ఈ ఇళ్ల కోసం లబ్ధిదారులు పోటీపడ్డారు. సర్వహంగులతో గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలుగా నిర్మించిన ఈ భవనాలు చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపో యారు. దశల వారీగా చేపట్టిన ఈ ఫ్లాట్ల నిర్మాణం తొలి దశ పూర్తికావడంతో లబ్ధిదారులకు అందించారు. మలి దశ ఫ్లాట్ల నిర్మాణమూ పూర్తయింది. కానీ ఈలోపు ఎన్నికలు రావడంతో గృహ ప్రవేశాలు చేసుకుందామని సిద్ధమైన వారికి ఆ అవకాశం చిక్కలేదు. ఎన్నికలయ్యాక వైసీపీ ప్రభుత్వం ఈ కాలనీలను గాలికి వదిలేసింది. లబ్ధిదారులు ఎన్నిసార్లు ప్రాఽథేయపడినా ఏదొక నెపంతో ఐదేళ్లూ కాలం గడిపేసింది. మౌలిక సదుపాయాలనూ పట్టించుకోలేదు. తమ పార్టీ రంగులు వేసి మమ అనిపించింది. దీంతో మళ్లీ చంద్రబాబు సీఎం అయితేనే తమ ఇళ్లకు మోక్షం కలుగుతుందని లబ్ధిదారులంతా ఎదురుచూశారు. అనుకున్నట్టుగానే చంద్రబాబు సీఎం అయ్యారు. కొత్త ప్రభుత్వం వచ్చి పది నెలలు కావొస్తోంది. ఇప్పటికీ వీరి కష్టాలు తీరలేదు. చంద్రబాబు రాగానే ఈ కాలనీల తీరే మారిపోతుందని కలలు గన్న వారి ఆశలు తీరనేలేదు. ఇప్పటికైనా కాస్త మా కాలనీల వైపు చూడండయ్యా అంటూ లబ్ధిదారులు ఎమ్మెల్యేలను, అధికారులనూ వేడుకొంటున్నారు. నిజానికి జూన్‌ 12 నాటికి టిడ్కో గృహాల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు క్షేత్ర స్థాయిలో చొరవ లేదు. పైగా మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఎలా ఉంటామని లబ్ధిదారుల ప్రశ్న. ఈ నేపథ్యంలో ఏపీ టిడ్కో చైర్మన్‌ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో విజయవాడలో టిడ్కో అధికారులు, ఇంజనీర్లు, సిబ్బందితో సమావేశం జరుగనుంది. మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించే అవకాశం ఉంది.

(అమలాపురం -ఆంధ్రజ్యోతి)

గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో గృహ సముదాయాలు నేడు అసౌకర్యాల చెరలో చిక్కుకుపోయాయి. వైసీపీ ప్రభుత్వం ఈ భవనాలకు రంగులు అయితే మార్చిందిగానీ నివాస గృహాల యజమానులకు అవసరమైన కనీస సౌకర్యాలపై దృష్టి సారించకపోవడంతో ప్రస్తుతం ఆయా టిడ్కో గృహాల్లో నివశిస్తున్న నివాసితులు నిరంతరం కష్టాలతోనే జీవనం గడుపుతున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో అమలాపురంలో 2017లో టిడ్కో గృహాల సముదాయానికి అప్పటి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అయితే నిర్మాణంలో జాప్యం వల్ల లబ్ధిదారులు ఎంపికైనప్పటికీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని లబ్ధిదారులకైతే అందించారుగానీ అక్కడ కనీస సౌకర్యాల కల్పన చేపట్టలేదు. అమలాపురం పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్లవరం మండలం బోడసకుర్రు శివారు దేవర్లంక బ్లోఅవుట్‌ సైట్‌ సమీపాన 2017లో 1632 టిడ్కో గృహాలను నిర్మించి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని లబ్ధిదారులకు 1576 గృహాలను అందించారు. వాటిలో ఇంకా 56 గృహాల ను అర్హులకు అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 550 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటుండగా వెయ్యికి పైగా గృహాలు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. ఇక సెకండ్‌ ఫేజ్‌లో 962 ఇళ్లు నిర్మించాల్సి ఉన్నప్పటికీ ఆ ప్రతిపాదనను ప్రభుత్వం దాదాపు విరమించుకున్నట్టే. ఇక్కడ మంచినీటి సమస్యతో డ్రైనేజీ సమస్య ఉంది. తాగునీరు లేకపోవడంతో అక్కడ నివాసం ఉండేందుకు ఎవరూ వెళ్లడం లేదు. పదిరోజులకోసారి బోడసకుర్రు టిడ్కో గృహాలకు మున్సిపల్‌ వాటరు ట్యాంకరు ద్వారా నీళ్లు పంపిస్తున్నా రు. జనసేన నుంచి ఒక ట్యాంకరు ద్వారా నీళ్లు అందిస్తున్నారు. ప్రస్తుతం ఉంటున్న వారికి టిడ్కో గృహాల వద్దే రేషన్‌ను తీసుకునే సదుపాయం కల్పించినా పెన్షన్లు మాత్రం అమలాపురం పట్టణంలో వారి వారి వార్డులకు వెళ్లి 1వ తేదీన తీసుకోవాల్సిందే.

కొవ్వూరులో అసౌకర్యాల చెరలో టిడ్కో ఇళ్లు

కొవ్వూరు,ఏప్రిల్‌2(ఆంధ్రజ్యోతి):గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన టిడ్కో గృహాలు ఇప్పటికీ లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే ఉన్నాయి. మెరుగైన వసతులతో ఈ గృహా ల నిర్మాణం దాదాపు పూర్తయినప్పటికీ త ర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపుగా వాటిని పక్కనపెట్టేసింది. దీంతో ఆ భవనాల చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి అధ్వానంగా మారింది. కొవ్వూరు మునిసిపాలిటీ పరిధిలోని పెదతాళ్లపుంతలోని ఎన్టీఆర్‌ నగర్‌లో 2018లో రూ.31.27 కోట్ల వ్యయంతో 480 గృహాల నిర్మాణం చేపట్టారు. వాటిలో 300 చదర పు అడుగుల సింగిల్‌ బెడ్‌రూమ్‌ గృహాలు 240, 430 చదరపు అడుగుల డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహాలు 240 నిర్మాణం చేపట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు గృ హ నిర్మాణాలు పూర్తికాగా, తాగునీరు, రోడ్లు, విద్యుత్‌, డ్రైనేజీల నిర్మాణం జరగా ల్సి ఉంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరా వు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ లబ్ధిదారు లు ఇళ్లలోకి వెళ్లకుండానే బ్యాంకు వాయిదాలు కట్టుకోవాల్సిన వస్తోందన్నారు. తక్ష ణం వాటిని లబ్ధిదారులు అప్పగించాలని కోరారు. కాగా కొవ్వూరు మునిసిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ జూన్‌ 12 నాటికి మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు.

కాకినాడలోనూ అంతే..

కాకినాడ సిటీ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కాకినాడ పర్లోవపేటలో టిడ్కో గృహ సము దాయం ఉంది. ఇక్కడ తొలిఫేజ్‌లో 1152ఇళ్లు నిర్మించగా వాటిని లబ్ధిదారులకు అప్పగించా రు. రెండో ఫేజ్‌లో 800 ఫ్లాట్లు నిర్మించగా లబ్ధిదారులకు అందించలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వీటి నిర్మాణం జరిగినా ఆ తర్వా త అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిపట్ల పూర్తి నిర్లక్ష్యం వహించింది. దీంతో ఇప్పటివరకు తాగునీటి పైప్‌లైన్లు, అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు వంటి సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించలేదు. ఈ సముదాయం లోని వాటర్‌ సంప్‌ పరిసరాలు అపరిశుభ్రం గా మారగా, సీవేజ్‌ వాటర్‌ డ్రెయిన్‌ దెబ్బ తింది. ఇక ఏ వస్తువు కావాలన్నా దూర ప్రాంతానికి వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు మహిళా మార్ట్‌ భవనం నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది.

వాలుతిమ్మాపురంలో ఎదురుచూపులే..

పెద్దాపురం, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): పెద్దాపురం వాలుతిమ్మాపురంలో నిర్మించిన టిడ్కో భవనాలు రెండో విడత కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. మొదటి విడతలో 1724 ఇళ్లను అప్పట్లో టీడీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించింది. రెండో విడతలో 1672 ఇళ్లను నిర్మించింది. ఈలోపు వైసీపీ ప్రభుత్వం రావడంతో టిడ్కో ఇళ్లను పట్టించుకోలేదు. దీంతో రెండో విడతలో నిర్మించిన టిడ్కో ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించలేదు. 500 ఇళ్లకు వైరింగ్‌ చేయాల్సి ఉంది.

నిడదవోలులో మోక్షం ఎప్పుడో..

నిడదవోలు, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిడదవోలు పట్టణంలోని తీరుగూడెంలో 1152 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి టిడ్కో గృహాల నిర్మాణం చేపట్టింది. తుది దశలో ఉండగా ఎన్నికలు రావడం, తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టు మూలనపడింది. వైసీపీ ఐదేళ్లూ పట్టించుకోకపోవడంతో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. తిరిగి చంద్రబాబు సీఎం అయితే తమకు ఇళ్లు దక్కుతాయని లబ్ధిదారులు ఎదురుచూశారు. కొత్త ప్రభుత్వం వచ్చి పది నెలలైనా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం, మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి ప్రగతి లేదు. దీంతో లబ్ధిదారులంతా తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు.

బొమ్మూరులో బాగు ఏదీ

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి):రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ ప్రాం తాల్లో 2014-19 మధ్య పేదవాని సొంతింటి కలను నిజంచేస్తూ బొమ్మూరులో అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం టిడ్కో గృహాల నిర్మాణాలను చేపట్టి 99 శాతం పూర్తి చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ గృహాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందించలేకపోయింది. దాంతో ఐదేళ్ల పాటు 6,304 మంది లబ్ధిదారులు టిడ్కో గృహా ల కోసం ఎదురుచూశారు. రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్న వరకైనా తమ ఇళ్లను అప్పగించాలని వేడుకుంటూనే ఉన్నారు. చివర్లో మాత్రం వైసీపీ రంగులు ఆ భవనాలకు వేసి హడావుడి చేసింది. కానీ ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. ఈలోపు ప్రభుత్వం మారింది. చంద్రబాబు సీఎం అయ్యారు. తమ కష్టాలు తొలగినట్టేనని లబ్ధిదారులు సంతోషపడ్డారు. కానీ అధికారంలోకి పది నెలలు కావొస్తున్నా ఇప్పటికీ అప్పగించలేదు. మౌలిక సదుపాయా లను పూర్తిస్థాయిలో ఏర్పాటుచేయలేదు. ప్రస్తు తం బొమ్మూరులో ఉన్న టిడ్కో ఇళ్లలో సెప్టిక్‌ ట్యాంకుల కనెక్టింగ్‌ చేయాల్సి ఉంది. అలానే తొర్రేడులో ఉన్న టిడ్కో గృహాల వద్ద రహదారులు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాల్సి ఉంది.

Updated Date - Apr 03 , 2025 | 01:36 AM