Vizag Flight Crisis: విశాఖ విమానాశ్రయం వెలవెల
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:43 AM
ఆర్థిక, ఐటీ, టూరిజం హబ్‌గా గుర్తింపు పొందిన విశాఖకు విమాన సర్వీసులు తగ్గిపోతుండటంపై అసంతృప్తి వెల్లువెత్తుతోంది. మే 1 నుంచి మలేసియా, బ్యాంకాక్ సర్వీసులు నిలిపివేయడంతో అంతర్జాతీయ సర్వీసుల సంఖ్య ఒక్కటికే పరిమితమైంది

ఎడాపెడా సర్వీసులకు మంగళం
ఏప్రిల్ 1 నుంచి విజయవాడకు విమానాల నిలిపివేత
మే 1 నుంచి మలేసియా, బ్యాంకాక్ సర్వీ్‌సలూ బంద్
ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా విశాఖకు పేరు
సర్వీసులు పెంచాల్సింది పోయి తగ్గించడంపై అసంతృప్తి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ఆర్థిక రాజధాని.. ఐటీ హబ్.. టూరిజం కేపిటల్.. ఫార్మా సెంటర్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నానికి విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా రద్దయిపోతున్నాయి. కొత్త సర్వీ్‌సలు రావలసింది పోయి.. ఉన్నవాటినే తీసేయడం ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు..! విశాఖపట్నం నుంచి ఇంతకుముందు ఐదు అంతర్జాతీయ విమాన సర్వీ్‌సలు (దుబాయ్, సింగపూర్, మలేసియా, శ్రీలంక, బ్యాంకాక్) నడిచేవి. కరోనా సమయంలో అవన్నీ ఆగిపోయాయి. ఆ తర్వాత సింగపూర్, మలేసియా, బ్యాంకాక్ సర్వీ్‌సలను పునరుద్ధరించారు. దుబాయ్ విమానం కూడా తెస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు హామీ ఇచ్చారు. అది నెరవేరక ముందే ప్రస్తుతం ఉన్న మూడు సర్వీసుల్లో రెండింటికి బుకింగ్స్ నిలిపివేశారు. మే ఒకటో తేదీ నుంచి మలేసియా, బ్యాంకాక్ సర్వీసులు నడపడం లేదని ఎయిర్ ఆసియా ప్రకటించింది. అంటే విశాఖకు ఒకే ఒక అంతర్జాతీయ సర్వీస్ (సింగపూర్ విమానం) మిగులుతుందన్నమాట.
విజయవాడ విమానాలూ రద్దు
విశాఖపట్నం నుంచి విజయవాడకు ఇండిగో ఎయిర్‌లైన్స్ రోజూ ఉదయం రెండు సర్వీసులు నడుపుతోంది. వాటిని ఈ నెల ఒకటో తేదీ నుంచి నిలిపివేసింది. కారణాలు వెల్లడించలేదు. ఇప్పుడు విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలంటే రైళ్లు లేదా బస్సులే ఆధారం. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చేసరికి విశాఖ విమానాశ్రయాన్ని పూర్తిగా ఖాళీ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ‘విజయవాడకు విమానాలు రద్దు చేయడం వల్ల రాజకీయ నాయకులతో పాటు అధికారులు, వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే విజయవాడ విమాన సర్వీ్‌సలు పునరుద్ధరించాలి’ అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కోరారు.
కేంద్ర మంత్రి స్పందించాలి
‘విశాఖకు పారిశ్రామిక నగరంగా బ్రాండ్ ఇమేజ్ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక అది మరింత పెరిగింది. కానీ ఇటు చూస్తే అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు రాజధాని సర్వీసులు కూడా తీసేశారు. తక్షణమే మంత్రి రామ్మోహన్‌నాయుడు స్పందించి వాటిని పునరుద్ధరించాలి.’
- టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
అధ్యక్షుడు ఓ.నరేశ్‌కుమార్