Share News

గోరుకల్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:57 AM

ఎస్‌ఆర్‌బీసీ ప్రాజెక్టులో కీలకమైన గోరుకల్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్‌ చేశారు.

గోరుకల్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి
తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేస్తున్న రైతు సంఘం నాయకులు

పాణ్యం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఆర్‌బీసీ ప్రాజెక్టులో కీలకమైన గోరుకల్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎస్సార్బీసీ ఆయకట్టు పరిరక్షణ సమితి ఆద్వర్యంలో రైతులు తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీబాగ్‌ ఒడంబడికను గౌరవిస్తూ రాయలసీమలో చేపట్టిన ఏకైక ప్రాజెక్టు ఎస్సార్బీసీ అన్నారు. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎస్సార్బీసీ ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేశారన్నారు. అప్పటి ప్రధాని పీవీ. నరసింహారావు సహకారంతో గోరుకల్లు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. తద్వారా లక్షా 94 వేల ఎకరాలలో సిరులు కురిపించే అవకాశం కల్పించారన్నారు. శ్రీశైలంలో నీరు ఉన్నపుడు బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ ధ్వారా గోరుకల్లు వరకు కాలువ ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని రిజర్వాయర్‌లో నింపడానికి అవకాశం ఉందన్నారు. అయితే రిజర్వాయర్‌ భద్రత కారణాలతో సగం టీఎంసీ నీటినిమాత్రమే రిజర్వాయర్‌లోకి తీసుకువస్తున్నారన్నారు. గోరుకల్లు నిర్మాణం పూర్తి కాకపోవడంతో దాదాపు మూడు లక్షల ఎకరాల సాగు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రతి సంవత్సరం మూడు వందల కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన జరగడమే గాక ప్రజలకు తాగునీరు అందుతుందన్నారు. ఈ సందర్బంగా పాణ్యం తహసీల్దారు నరేంద్రనాథ్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

Updated Date - Apr 16 , 2025 | 12:57 AM