Share News

Ganta Srinivasa Rao: ఆంధ్రా టు ఆంధ్రా వయా తెలంగాణ

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:33 AM

విశాఖ నుంచి విజయవాడకు నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలో హైదరాబాద్‌ మీదుగా ప్రయాణించాల్సి వస్తుండటంపై విమర్శలు చేశారు

Ganta Srinivasa Rao: ఆంధ్రా టు ఆంధ్రా వయా తెలంగాణ

  • విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలంటే రెండు విమానాలు మారాల్సి వస్తోంది

  • ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన

విశాఖపట్నం, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా రద్దయిపోతుండటంతో రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం విమానాశ్రయం వెలవెలబోతోంది. విశాఖ నుంచి విమాన సర్వీసులకు ఎడాపెడా మంగళం పాడేస్తున్నారంటూ ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. విశాఖలో విమాన ప్రయాణికుల దుస్థితిపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. విశాఖపట్నం నుంచి అమరావతికి విమానంలో వెళ్లాలంటే... హైదరాబాద్‌ మీదుగా ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. మంగళవారం సాయంత్రం విజయవాడలో సీఎం చంద్రబాబుతో సమావేశం కావడానికి తాను ఉదయం 8 గంటలకు విశాఖలో బయలుదేరి హైదరాబాద్‌ చేరుకొని, అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయంలో దిగేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయిందని పేర్కొన్నారు. సీఐఐ, ఫిక్కీ తదితర సంస్థలకు చెందిన వ్యాపారవేత్తలు కూడా తనలాగే విశాఖ నుంచి హైదరాబాద్‌ వచ్చి, అక్కడి నుంచి విజయవాడ చేరుకున్నారని వివరించారు. మంగళవారం వందేభారత్‌ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారాల్సి వచ్చిందని తెలిపారు. విశాఖలో విమాన ప్రయాణికులకు ఎందుకు ఈ దుస్థితి వచ్చిందో ఆలోచన చేసి, తగిన చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.


తన ట్వీట్‌ను సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, మంత్రి లోకేశ్‌కు ట్యాగ్‌ చేశారు. దాంతో పాటు తాను రెండు విమానాల్లో ప్రయాణించేందుకు తీసుకున్న టికెట్లను సైతం గంటా షేర్‌ చేశారు. కాగా, మొన్నటి వరకూ విశాఖ నుంచి విజయవాడకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ రోజూ ఉదయం రెండు సర్వీసులు నడిపింది. ఈ నెల 1నుంచి వాటిని నిలిపివేసింది. ఇప్పుడు విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలంటే రైళ్లు లేదా బస్సులపై ఆధారపడాల్సి వస్తోంది. అదీకాకుంటే విమానంలో హైదరాబాద్‌ వెళ్లి అక్కడినుంచి మరో విమానంలో విజయవాడ చేరుకోవాల్సిందే. దీనికి అదనపు ఖర్చుతో పాటు సమయం కూడా ఎక్కువ పడుతోంది.

Updated Date - Apr 16 , 2025 | 05:33 AM