Jalaharati Corporation: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. నూతన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ..
ABN , Publish Date - Apr 08 , 2025 | 07:52 PM
పోలవరం ప్రాజెక్టు నుంచి వరద జలాలను తరలించేలా పోలవరం- బనకచర్ల లింకు ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 80 లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని వెల్లడించారు.

అమరావతి: జలహారతి కార్పొరేషన్‍ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టు చేపట్టేందుకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కార్పొరేషన్ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైస్ ఛైర్మన్‍గా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే సంస్థ సీఈవోగా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సభ్యులుగా ఇతర అధికారులను నియమించింది. కంపెనీల చట్టం కింద వందశాతం ప్రత్యేక వాహక సంస్థగా దీన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు జలహారతి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
లక్షల మందికి తాగునీరు..
పోలవరం ప్రాజెక్టు నుంచి వరద జలాలను తరలించేలా పోలవరం- బనకచర్ల లింకు ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 80 లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని వెల్లడించారు. 9.14 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీరు అందించొచ్చని, కొత్తగా మరో 3 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాకులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే 20 టీఎంసీల మేర నీటిని పరిశ్రమలకు ఇవ్వొచ్చని వెల్లడించారు.
కరవు జిల్లాలకు తాగు, సాగు నీరు..
ఈ ప్రాజెక్టుకు రూ.80,112 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిపారు. గోదావరి బేసిన్‌లో వృథాగా పోతున్న వరదనీటిని సద్వినియోగం చేసుకునేలా ఈ లింకు ప్రాజెక్టు నిర్మించనున్నట్లు చెప్పారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్ వరకూ నీటిని తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సాయిప్రసాద్ తెలిపారు. దీని ద్వారా దాదాపు 150 టీఎంసీల వరకూ నీటిని తరలించేందుకు ఆస్కారం ఉందని, నీటి లోటు ఉన్న జిల్లాలకు ఈ వరద జలాలను తరలించవచ్చని ఆయన చెప్పారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండే రాయలసీమ జిల్లాలకు నీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా..
పోలవరం- బనకచర్ల రెగ్యులేటర్‍కు కాలువలు, ఎత్తిపోతల పథకాలు, భూగర్భ పైప్ లైన్లు, సొరంగాల ద్వారా నల్లమల నుంచి నీటిని తరలించాల్సి ఉంటుందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. దీని కోసం ఓ ప్రత్యేక వాహక సంస్థగా జలహారతి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. ఎస్పీవీగా బహిరంగ మార్కెట్ల నుంచి నిధులు సేకరించేందుకు అవకాశం ఉందని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Bandi Sanjay: రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు ఇదే నా సవాల్.. సిద్ధమా?: కేంద్ర మంత్రి బండి సంజయ్..
Mark Shankar Health Update: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్.. పూర్తి వివరాలు చెప్పిన మంత్రి..