AP News: రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీ మీల్స్.. ఎవరెవరి కంటే..
ABN, Publish Date - Jan 03 , 2025 | 08:20 AM
సాధారణంగా ఇంటర్ కళాశాలలు మండల కేంద్రాలు, పట్టణాల్లో ఉంటాయి. అప్పటి వరకూ గ్రామాల్లో చదువుకున్న విద్యార్థులు కొంతమంది ఆర్థిక సమస్యలు, పేదరికం కారణంగా పదో తరగతి తర్వాత చిన్నచిన్న పనుల్లో చేరిపోయి కుటుంబానికి అండగా ఉందామని భావిస్తుంటారు.
అమరావతి: పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత గానో కృషి చేస్తోంది. ఆర్థిక సమస్యల కారణంగా పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని చంద్రబాబు సర్కార్ అనేక పథకాలు అమలు చేస్తోంది. "తల్లికి వందనం" పథకం కింద రూ.15 వేలు ఇవ్వాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు "డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన" పథకం కింద ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు భోజనం అందిస్తోంది. అయితే ఈ పథకం అమలును విస్తృతం చేసేందుకు చంద్రబాబు సర్కార్ తీర్మానం చేసింది. ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం ఆదేశాలతో జీవో ఎంఎస్ నెంబర్ 40ను ఏపీ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గతేడాది డిసెంబర్ 31 జారీ చేశారు.
సాధారణంగా ఇంటర్ కళాశాలలు మండల కేంద్రాలు, పట్టణాల్లో ఉంటాయి. అప్పటి వరకూ గ్రామాల్లో చదువుకున్న విద్యార్థులు కొంతమంది ఆర్థిక సమస్యలు, పేదరికం కారణంగా పదో తరగతి తర్వాత చిన్నచిన్న పనుల్లో చేరిపోయి కుటుంబానికి అండగా ఉందామని భావిస్తుంటారు. అలాంటి వారిని చదువు వైపు పోత్సహించేందుకు 2014-19 మధ్య ఇంటర్ విద్యార్థులకు సైతం అప్పటి టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వారికి ఆ పథకాన్ని రద్దు చేసింది. అమ్మకు వదనం కింద వారికి నగదు చెల్లిస్తున్నామని, అందుకే పథకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అనేక మంది పేద విద్యార్థులు మళ్లీ చదువుకు దూరం అయ్యారు.
ఈ విషయంపై 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ యువగళం పాదయాత్రలో అనేక మంది విద్యార్థులు నారా లోకేశ్ వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. తల్లిదండ్రులు ఉదయానే లేచి తమకు భోజనం అందించడం కష్టంగా మారిందని, కొన్నిసార్లు భోజనం అందక బస్ మిస్ అయ్యే వాళ్లమని వివరించారు. ఆటోలకు వెళ్లాలంటే డబ్బులు ఉండేవి కాదని, ఆర్టీసీ బస్సులో బస్ పాస్ ద్వారా రోజూ కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం అందిస్తే తమకు చాలా ఉపయోగంగా ఉంటుందని విద్యార్థులు చెప్పుకొచ్చారు. దీంతో ఎన్నికల్లో గెలిచిన వెంటనే పథకాన్ని పునరుద్ధరిస్తామని నారా లోకేశ్ వారికి హామీ ఇచ్చారు.
అనంతరం జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనవరి 1 నుంచి పథకాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు రూ. 29.39 కోట్ల బడ్జెట్ కేటాయించింది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి మరో రూ. 85.84 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం అమలుకు ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్, మధ్యాహ్న భోజన కార్యక్రమం డైరెక్టర్లు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చింది. మిడ్ డే మీల్ గైడ్ లైన్స్‌ను సైతం ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పథకాన్ని జనవరి 4 నుంచి అధికారులు అమలు చేయనున్నారు. దీంతో లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఆ రోజు నుంచి ఇంటర్ విద్యార్థులు ఇక లంచ్ బాక్సులు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: హైదరాబాద్‌కు వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు..
విజయ్ కుమార్ రెడ్డిపై కేసు వివరాలు ఇవ్వండి
Updated Date - Jan 03 , 2025 | 08:21 AM