GV Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఎందుకు పారిపోయారు
ABN , Publish Date - Feb 08 , 2025 | 05:35 AM
పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా మాచర్ల టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు.

ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్న జగన్.. ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి
మాచర్లటౌన్, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరుగుతున్న శాసన మండలి ఎన్నికల బరి నుంచి వైసీపీ ఎందుకు తప్పుకుందో సమాధానం చెప్పాలని ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా మాచర్ల టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం వైసీపీ ఈవీఎంలపై ఆరోపణలు చేసిందని, ఇప్పుడు శాసనసమండలి ఎన్నికలు బ్యాలట్ పేపర్లో జరుగుతాయని, కనుక వైసీపీ తాను చేసిన ఆరోపణలు నిరూపించుకునేందుకు ఇది చక్కటి అవకాశం కదా అని అన్నారు. కానీ, ఇప్పుడు ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో వారు చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా రుజువైందని చెప్పారు. రాష్ట్రాన్ని జగన్ ఆర్థికంగా పాతాళానికి తొక్కేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం 9 నెలల కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలోని ఆర్థిక సమస్యల దృష్ట్యా ఇచ్చిన హామీలు అమలులో కాస్త ఆలస్యం కావొచ్చు గానీ అమలు చేయబోమని చెప్పడం లేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియని గందరగోళంలో ప్రజలు బతికారని, నేడు సగర్వంగా రాష్ట్ర నడిబొడ్డున ఉన్న అమరావతి రాజధాని అని ప్రజలు తలెత్తుకు తిరిగేలా చేశామని చెప్పారు. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా రెచ్చగొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు. కూటమి నేతల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను గెలిపించుకోవాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..
Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం