Heavy Monsoon: నైరుతిలో వర్షాలే వర్షాలు
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:33 AM
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల్లో సాధారణం కంటే 105% అధిక వర్షపాతం నమోదుకానుండగా, ఏపీతో పాటు దేశం మొత్తం మీద ఎక్కువ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి

4 రోజులు ఈదురుగాలులతో వర్షాలు
ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం.. దీర్ఘకాలిక సగటులో 105 శాతం నమోదు
ఉత్తర, దక్షిణ, పశ్చిమ, మధ్య భారతంలో ఎక్కువగా.. ఏపీలోనూ సమృద్ధిగా వానలు పడే అవకాశం
జమ్మూకశ్మీర్, బిహార్, తమిళనాడు, ఈశాన్యంలో మాత్రం సాధారణం కంటే తక్కువ
రైతులకు తీపి కబురు చెప్పిన భారత వాతావరణ శాఖ
విశాఖపట్నం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): దేశంలోని కోట్లాది మంది రైతులకు భారత వాతా వరణ శాఖ మంగళవారం తీపికబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో (జూన్- సెప్టెంబరు) సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దీర్ఘకాలిక సగటులో 105 శాతం వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. వరుసగా రెండో ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ‘దేశంలో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు మధ్య సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్ల వర్షపాతంతో పోల్చుకుంటే.. 105% ఎక్కువగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నాం’’ అని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర చెప్పారు. రుతుపవన వేగాన్ని ప్రభావితం చేసే ఎల్‌నినో పరిస్థితులు ఈ దఫా తక్కువగానే ఉంటాయని తెలిపారు. అధిక వర్షపాతం నమోదు అంచనాల నేపథ్యంలో వ్యవసాయం, దానిపై ఆధారపడిన ఆర్థిక రంగాలు పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ ఆధారిత స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 18 శాతంగా ఉన్న నేపథ్యంలో ఇది మరింత పెరగడం లేదా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇదిలావుంటే, సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిసినా.. దేశంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా ఉండే అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాగా, గత ఏడాది 106% వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణశాఖ అంచనా వేయగా, 108% నమోదు కావడం గమనార్హం.
మెజార్టీలో ప్రాంతాల్లో అధిక వానలే
నైరుతి రుతువనాల సీజన్‌కు సంబంధించి ఐఎండీ ఈ తొలిదశ దీర్ఘకాలిక అంచనా బులెటిన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో దక్షిణ, మధ్య, పశ్చిమ, ఉత్తర భారతాల్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయి. కోర్ మాన్‌సూన్ ప్రాంతంగా పిలిచే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమబెంగాల్‌తోపాటు దక్షిణాదిలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కానున్నది. జమ్మూ కశ్మీర్, బీహార్, తమిళనాడు, ఈశాన్యంలో సాధారణం కంటే తక్కువ నమోదు కానున్నది.
ఈసారి రాష్ట్రంలో మంచి వర్షాలు
వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడే ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది నైరుతి సీజన్‌లో మంచి వర్షాలు కురవనున్నాయి. గత ఏడాది కోస్తాలో శ్రీకాకుళం, ప్రకాశం, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో వర్షాభావం కొనసాగింది. ఈ ఏడాది మాత్రం ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అత్యంత ఎక్కువగా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని, రాయలసీమ ల్లోని అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానున్నదని ఐఎండీ వెల్లడించింది. కృష్ణా, గోదావరి బేసిన్ పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
4 రోజులు ఈదురుగాలులతో వర్షాలు
ఉపరితలద్రోణి, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, వాయువ్యగాలులతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. వీటి ప్రభావంతో మంగళవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆ తర్వాత నాలుగు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అనంతలో రూ.2.28 కోట్ల పంటనష్టం
అనంతపురం జిల్లాలో సోమవారం రాత్రి ఈదురు గాలులు, వర్ష బీభత్సానికి 266.6 హెక్టార్లల్లో రూ.2.88 కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Dy Collectors Transfer: భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు.. ఎప్పటి నుంచంటే..
National Herald Case: ఈడీ ఛార్జ్‌షీట్లో సోనియా, రాహుల్ పేర్లు
BRS MLA: ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ వ్యాఖ్యలపై స్పందించిన కొత్త ప్రభాకర్ రెడ్డి
Farmers: దేశ ప్రజలకు అదిరిపోయే వార్త
Errabelli Dayakar Rao: అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకొంటా..
PM Modi: ఏపీకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..
వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
Hyderabad Summit:హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ..
For AndhraPradesh News And Telugu News