Share News

AP Liquor Scam: మద్యం స్కాంలో సిట్‌ విచారణకు కసిరెడ్డి డుమ్మా

ABN , Publish Date - Apr 10 , 2025 | 05:13 AM

వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సిట్ విచారణకు హాజరుకాలేదు

AP Liquor Scam: మద్యం స్కాంలో సిట్‌ విచారణకు కసిరెడ్డి డుమ్మా

  • సహకరించాలని హైకోర్టు ఆదేశించినా గైర్హాజరు

  • మొత్తం కక్కేస్తారని వైసీపీ పెద్దలే దాచారని అనుమానం

  • మూడో నోటీసుకూ స్పందించని జగన్‌ బంధువు

అమరావతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్‌ రాజ్‌ కసిరెడ్డి.. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణకు డుమ్మా కొట్టారు. విజయవాడ పోలీసు కమిషనరేట్‌ ప్రాంగణంలో ఉన్న సిట్‌ కార్యాలయంలో బుధవారం విచారణకు రావాలని సిట్‌ నోటీసివ్వగా.. ఆయన రాలేదు. మాజీ సీఎం జగన్‌కు బంధువు, అత్యంత సన్నిహితుడైన ఈయన.. ఆయన హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేశారు. మద్యం తయారీదారుల నుంచి ప్రతి నెలా రూ.60 కోట్లకు తగ్గకుండా వసూలు చేసి.. సుమారు రూ.3 వేల కోట్లను తాడేపల్లి ప్యాలె్‌సకు ఆయన చేర్చినట్లు ఆరోపణలున్నాయి. అంతేగాక లంచాల నెట్‌వర్క్‌ను రూపొందించి.. వైసీపీ ప్రభుత్వంలో పెద్దరెడ్డిగా పేరున్న నాయకుడితో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని దందా నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత మద్యం కొనుగోలు చేయాలి.. ఏ రోజు ఏ బ్రాండ్లు ఎంత మేరకు విక్రయించాలో కసిరెడ్డే ఖరారుచేసేవారని సమాచారం. లిక్కర్‌ స్కాంను వెలికితీసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌.. కీలక సమాచారాన్ని సేకరించింది. దర్యాప్తులో భాగంగా కసిరెడ్డిని ప్రశ్నించేందుకు సమాయత్తమైంది. దీంతో ఆయన విచారణకు హాజరైతే మొత్తం కక్కించేస్తారని, తాడేపల్లి ప్యాలెస్‌ గుట్టు రట్టవుతుందన్న ఉద్దేశంతో కొందరు వైసీపీ పెద్దలు కసిరెడ్డిని దాచేసినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. బుధవారం ఆయనకు సిట్‌ అధికారులు పదే పదే ఫోన్‌ చేయడానికి ప్రయత్నించినా.. స్విచ్చాఫ్‌ చేసి ఉంది.


వాస్తవానికి మార్చి 28న విచారణకు రావాలని ఆ నెల 25న మొదటిసారి సిట్‌ అధికారులు నోటీసులిచ్చారు. మరుసటి రోజు (26న) హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌లో ఉంటున్న ఆయన తల్లికి నోటీసు అందజేశారు. మార్చి 29న విజయవాడలోని సిట్‌ కార్యాలయానికి కసిరెడ్డి రావాలని సూచించారు. దీంతో మెయిల్‌ ద్వారా స్పందించిన ఆయన కారణం చెబితేనే వస్తానని మెలిక పెట్టారు. సాక్ష్యం చెప్పేందుకు రావాలని సిట్‌ బదులివ్వడంతో తనకు స్కాంతో ఎలాంటి సంబంధం లేదంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న విచారణ జరిపిన కోర్టు.. సిట్‌ నోటీసులకు చట్టబద్ధత ఉందని, విచారణకు సహకరించాలని స్పష్టం చేయడంతో గత శనివారం సిట్‌ అధికారులు మూడో నోటీసు పంపారు. బుధవారం విచారణకు రావాలన్నారు. అయినా ఆయన హాజరుకాలేదు.


Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 05:15 AM