Share News

Gannavaram : రంగ రంగా!

ABN , Publish Date - Feb 16 , 2025 | 03:41 AM

ముఖ్యంగా ఆయనకు గుండెకాయలాంటివాడైన ఓలుపల్లి మోహన రంగారావు అలియాస్‌ రంగా పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తోంది.

Gannavaram : రంగ రంగా!

  • వంశీ ముఖ్య అనుచరుడు మోహన రంగారావే కిడ్నాప్‌ కేసులో కీలక నిందితుడు

  • కొమ్మా కోట్లుతో కలిసి అపహరణ స్కెచ్‌

  • సత్యవర్ధన్‌ను అతడి బంధువు ద్వారా ట్రాప్‌ చేసిన మోహన రంగారావు

  • ఈ ఇద్దరి కోసం పోలీసుల గాలింపు

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ మూకల దాడిపై పోలీసులకు ఫిర్యాదుచేసిన ముసునూరి సత్యవర్ధన్‌ కిడ్నాప్‌, బెదిరింపుల వ్యవహారంలో వంశీ కీలక అనుచరులకు ఉచ్చు బిగుస్తోంది. ముఖ్యంగా ఆయనకు గుండెకాయలాంటివాడైన ఓలుపల్లి మోహన రంగారావు అలియాస్‌ రంగా పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. వంశీ ఎమ్మెల్యేగా ఉన్నన్నాళ్లూ తన వ్యవహారాలను, సెటిల్మెంట్లను, ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టడానికి చుట్టూ అరాచక వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈయన అనుంగు సన్నిహితుల్లో కొమ్మా కోటేశ్వరరావు అలియాస్‌ కోట్లు, రంగా కీలక వ్యక్తులు.. వంశీకి అత్యంత విశ్వాసపాత్రులు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసి వేధించిన వ్యవహారంలో విజయవాడ పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో 11 మంది నిందితులు ఉన్నట్లు పేర్కొన్నారు. దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ ఈ సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రంగా పేరు తెరపైకి వచ్చింది. వంశీకి సంబంధించిన రాజకీయ వ్యవహారాలన్నీ ఇతడే చూస్తుంటాడు. సత్యవర్ధన్‌ అంశాన్ని కూడా డీల్‌ చేశాడు. వంశీ ఎమ్మెల్యేగా ఉండగా గన్నవరంలో నివాసం ఉంటూ కార్యకలాపాలు నిర్వహించిన రంగా.. ప్రస్తుతం ఏలూరుకు మకాం మార్చేసినట్లు తెలుస్తోంది.

సత్యవర్ధన్‌కు టచ్‌లోకి ఇలా..

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి, ధ్వంసం, వాహనాల దహనం కేసులో వంశీ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు పలువురు అరెస్టయి జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. దాడి ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే ఈ కేసు వీగిపోతుందన్న ఉద్దేశంతో.. రంగా మొదట సత్యవర్ధన్‌ గురించి తెలుసుకున్నాడు. సత్యవర్ధన్‌ బంధువు ద్వారానే అతడిని పిలిపించి మాట్లాడాడు. తర్వాత కొమ్మా కోట్లుతో చర్చించి.. ఇద్దరూ కలిసి సత్యవర్ధన్‌ను ట్రాప్‌ చేసి కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరిద్దరూ ఇప్పుడు మాయమయ్యారు. వీరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.


‘సంకల్పసిద్ధి’ మోసం

గన్నవరంలో మధ్యతరగతి వ్యక్తి అయిన రంగా అనతి కాలంలోనే కోట్లకు పగడలెత్తాడు. ఏకంగా బీఎండబ్ల్యూ కారులో తిరిగే స్థాయికి ఎదిగాడు. వంశీ గన్నవరం రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత రంగా ఆయన పంచన చేరాడు. అత్యంత విశ్వాసపాత్రుడిగా మారిపోయాడు. వంశీని ఎవరైనా కలవాలంటే ముందుగా రంగాను కలవాల్సి ఉంటుంది. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని కుదిపేసిన ‘సంకల్పసిద్ధి’ కుంభకోణంలో ఇతడి పాత్ర ఉన్నట్లు అప్పట్లో భారీగా ఆరోపణలు వచ్చాయి. రూ.500 కోట్ల ఈ స్కాంను రంగాయే నడిపించాడని విజయవాడ పోలీసులు గుర్తించారు. ఇది మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసం. గన్నవరం నియోజకవర్గానికి చెందిన గుత్తా వేణుగోపాలకృష్ణ, ఆయన కుమారుడు కిరణ్‌ డైరెక్టర్లుగా సంకల్పసిద్ధి ఈకార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో ఏర్పాటు చేశారు. కొద్దినెలల క్రితం ఏలూరు రోడ్డులో అరండల్‌పేటకు మార్చారు. దీనిని ప్రధాన కార్యాలయంగా, మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఆఫీసును బ్రాంచ్‌ కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. సంస్థలోకి సభ్యులను ఆకర్షించడానికి నిర్వాహకులు వివిధ ప్లాన్లను వదిలారు. ఒక్కసారి రూ.10వేలు పెట్టుబడి పెడితే 300 రోజుల్లో (11నెలలు) రూ.30 వేలు పొందవచ్చని ప్రకటించారు. ఒక వ్యక్తి ఒకసారి రూ.10 వేలు డిపాజిట్‌ చేస్తే రోజుకు రూ.100 చొప్పున 300 రోజులపాటు చెల్లిస్తారు. అదనంగా రూ.20వేలు లాభం ఇస్తామని సంకల్పసిద్ధి ప్రచారం చేసింది. 10వేలు డిపాజిట్‌ చేసిన వెంటనే ఒక డిజిట్‌ వ్యాలెట్‌కు సభ్యుడి బ్యాంకు ఖాతాను లింక్‌ చేశారు. ఈ వ్యాలెట్‌ను సభ్యులతో ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేయించారు. సంస్థ రోజువారీగా ఇచ్చే రూ.100 నిల్వ ఈ వ్యాలెట్‌లో కనిపిస్తుంది. ఆ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ కాకపోయినా.. వ్యాలెట్‌లో ఉన్న మొత్తం ఖాతాలో పడినట్లు చూపిస్తారు. పెరుగుతున్న నిల్వ డిజిటల్‌ వ్యాలెట్‌లో మాత్రమే కనిపిస్తుంది. కొన్ని రోజులు గడిచాక ఈ డబ్బులను మరో ప్లాన్‌లో పెట్టుబడిగా పెట్టించారు.


  • వేణుగోపాలకృష్ణ, కిరణ్‌ 20 ఎకరాల్లో ఆగ్రోఫామ్‌ కొనుగోలు చేశారు. అందులో వచ్చిన లాభాలను సభ్యులకు ఇస్తున్నామని ప్రచారం చేసుకున్నారు. విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరులో ఉన్న సంకల్పసిద్ధి ఈకార్ట్‌లో అన్ని రకాల నిత్యావసర సరుకులను ఉంచారు. ఇందులో రూ.1,000 సరుకు కొనుగోలు చేసిన వారికి రూ.200-300 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తామని నమ్మించారు.

  • ఒక సభ్యుడు మరో సభ్యుడిని చేర్పిస్తే అందులోనూ కమీషన్‌ ఉంటుందని చైన్‌లింక్‌ విధానాన్ని అమలు చేశారు.

  • ఇక రూ.లక్షల్లో వసూలు చేయడానికి సంకల్ప రిఫరల్‌ ప్లాన్‌ను అమలు చేశారు. ఇందులో మొత్తం ఐదు దశలు ఉంటాయి. ఈ ప్లాన్‌లో రూపాయిని రూపాయిగా కాకుండా పీవీ అనే కోడ్‌తో పిలిచేవారు. ఈ ప్లాన్ల ద్వారా మొత్తం రూ.500 కోట్ల వరకు ప్రజల నుంచి వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం కుంభకోణానికి మోహనరంగారావే కర్త, కర్మ, క్రియ అని ప్రచారం జరిగింది.

Updated Date - Feb 16 , 2025 | 03:41 AM