నీటి కష్టాలు
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:57 AM
ఏప్రిల్ వచ్చేసింది. వడగాల్పులతో పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని తీరప్రాంతంతో పాటు ఇతర ఏరియాల్లోని తాగునీటి చెరువుల్లో నిల్వ ఉన్న నీరు క్రమంగా అడుగంటుతోంది. దీంతో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం కనిపిస్తుండగా, మోపిదేవి, నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను, మచిలీపట్నం తదితర మండలాల్లో ఇప్పటికే తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వలకు నీటిని ఎప్పుడు విడుదల చేస్తారా.. అని కృష్ణాజిల్లావాసులు ఎదురుచూస్తున్నారు.

జిల్లాకు పొంచి ఉన్న తాగునీటి ఎద్దడి
266 చెరువుల్లో పడిపోయిన నీటిమట్టం
తరకటూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులోనూ అంతే
తీరానికి ట్యాంకర్ల ద్వారా అందించే ప్రతిపాదనలు
రూ.1.12 కోట్లతో ప్రభుత్వానికి నివేదిక
15 నుంచి ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వలకు నీరు
4 నుంచి 5 టీఎంసీల వరకు అందించే అవకాశం
ఆశగా ఎదురుచూస్తున్న తీరప్రాంత వాసులు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలోని తీరప్రాంతంలో ఉన్న కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, మచిలీపట్నం తదితర మండలాల్లో వేసవిలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు రూ.1.12 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాల్సి ఉంది. దీనికి అనుబంధంగా ఈ వేసవిలో తీరప్రాంతంలోని గ్రామాల్లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తన ఎంపీ లాడ్స్‌తో పాటు సీఎస్‌ఆర్ నిధులు రూ.3.30 కోట్లు కేటాయిస్తానని ఇటీవల జరిగిన దిశ సమావేశంలో ప్రకటించారు. ఈ నిధులు కూడా విడుదల కావాల్సి ఉంది. ఈ నిధులన్నీ విడుదలైతే ఈ ఏడాది వేసవిలో తీరప్రాంత గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి.
15 నుంచి కాల్వలకు నీటి విడుదల
ఫిబ్రవరి 26 నుంచి కాల్వలకు సాగునీటి విడుదలను నీటిపారుదల శాఖ అధికారులు నిలిపివేశారు. అప్పట్లో జిల్లాలోని 266 తాగునీటి చెరువులను పంచాయతీల ద్వారా నింపారు. ఇది జరిగి దాదాపు 40 రోజులు కావస్తుండటంతో పాటు వేసవిలో నీటి వినియోగం పెరిగి చెరువుల్లోని నీటిమట్టం క్రమేణా తగ్గుతోంది. 100కుపైగా చెరువుల్లో 50 శాతానికి నీటిమట్టం పడిపోగా, మిగిలిన 166 చెరువుల్లో 25 నుంచి 30 శాతమే నీరు అందుబాటులో ఉంది. దీంతో ఈ నెల 15 నుంచి ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రధాన కాల్వలకు తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేయనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని అన్ని తాగునీటి చెరువులను నింపేందుకు ఏప్రిల్ నెలాఖరు వరకు 4 నుంచి 5 టీఎంసీల నీటిని ఆయా ప్రాంతాలకు విడుదల చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
తరకటూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌కు నీరు
మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌లోని 2.50 లక్షల మందికి, పెడన పురపాలక సంఘంలోని 35 వేల మందికి, మచిలీపట్నం సౌత, నార్త్ మండలాల్లోని 75 వేల మందికి, గూడూరు మండలంలోని నాలుగైదు గ్రామాలకు తరకటూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ద్వారా తాగునీరు సరఫరా కావాల్సి ఉంది. ఈ ట్యాంకు 180 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. నీటి సామర్థ్యం 5.60 మీటర్లు కాగా, ప్రస్తుతం 3.10 మీటర్లకు తగ్గింది. ఈ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో రెండు రోజులుగా ఈ ట్యాంకును నింపేందుకు ప్రకాశం బ్యారేజీ నుంచి బందరు కాల్వకు నీటిని విడుదల చేస్తున్నారు. కాల్వ ద్వారా వచ్చిన నీటిని కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణలో పెద్ద మోటార్ల ద్వారా చెరువుల్లోకి పంపే పనులు చేస్తున్నారు. గత ఏడాది ఎన్నికల సమయం కావడంతో తరకటూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో నీటిమట్టం తగ్గి మచిలీపట్నం నగరంతో పాటు పెడన, మచిలీపట్నం మండలాలకు మూడు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేయాల్సి వచ్చింది.
పంచాయతీల ద్వారానే చెరువులు నింపాలి
కాల్వలకు నీటిని విడుదల చేస్తే పంచాయతీల ద్వారా తాగునీటి చెరువులను నింపాల్సి ఉంది. జిల్లాలో 266 తాగునీటి చెరువులు ఉండగా, వాటిలో 18 మాత్రమే ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా నింపుతామని, మిగిలిన అన్నింటినీ పంచాయతీల నిధులతోనే నింపాలని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది వేసవిలో కొన్ని పంచాయతీల్లోని కాల్వలకు గ్రావిటీ ద్వారా వచ్చిన నీటిని చెరువులను నింపి సరిపెట్టారు. విద్యుత మోటార్లు లేదా ఆయిల్ ఇంజన్లను ఏర్పాటుచేసి నీటిని పంపింగ్ చేయకపోవడంతో తీర ప్రాంతంలోని తాగునీటి చెరువులు పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతోపాటు ఊర చెరువులను పూర్తిస్థాయిలో నింపకపోవడంతో గత వేసవిలో పశువులకు తాగునీరు అందుబాటులో లేక అల్లాడిపోయాయి. గత ఏడాది మచిలీపట్నం మండలంలోని కోన, పల్లెతుమ్మలపాలెం తదితర గ్రామాల్లోని చెరువులను నింపకుండానే సరిపెట్టేశారు. ఈ ఏడాది ఈ తరహా ఇబ్బందులు లేకుండా ముందుచూపుతో వ్యవహరించి పంచాయతీల ద్వారా తాగునీటి చెరువులను నింపేలా అధికారులు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది. వేసవిలో తాగునీటి అవసరాల కోసం విడుదల చేసేనీటిని చేపల చెరువులకు మళ్లించకుండా నిఘా బృందాలను ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.