Share News

మరణంలోనూ వీడని స్నేహబంధం

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:25 AM

ఒకరి వైద్య చికిత్సల కోసం వెళ్లిన ఆ నలుగురు స్నేహితులు.. సహాయం చేసేందుకు వెళ్లిన వారిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది.

మరణంలోనూ వీడని స్నేహబంధం
నుజ్జునుజ్జయిన కారు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

మహానంది కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు

కడప రిమ్స్‌కు తరలింపు

యువకుల కుటుంబాల్లో తీరని విషాదం

కన్నీరుమున్నీరైన బంధువులు

కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద ఘటన

నంద్యాల, ఏప్రిల్‌ 14( ఆంధ్రజ్యోతి): ఒకరి వైద్య చికిత్సల కోసం వెళ్లిన ఆ నలుగురు స్నేహితులు.. సహాయం చేసేందుకు వెళ్లిన వారిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ఈప్రమాదంలో ముగ్గురు మిత్రులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా నంద్యాల జిల్లా వాసులే. ఈఘటన కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నంద్యాలలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన తేజనాయుడు(21) పట్టణంలో ఐటీఐ విద్యను అభ్యసిస్తున్నాడు. ఇదేకాలనీకి చెందిన సమీప బంధువు సునీల్‌నాయుడు 2011లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఇతను మహానంది పోలీసుస్టేషన్‌లో రెండేళ్లుగా కోర్టు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అయితే వీరిద్దరికి స్వయాన బాబాయి అయిన హరినాయుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో వీరిద్దరూ కలిసి హరినాయుడికి వైద్యచికిత్సల నిమిత్తం తిరుపతిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని భావించారు.

తన స్నేహితులతో కలిసి..

కానిస్టేబుల్‌ సునీల్‌నాయుడు ఈనెల 13న తన విధులకు సెలవు పెట్టాడు. ఆ తర్వాత తన స్నేహితులైన చాగలమర్రి మండలం కొత్తపల్లికి చెందిన బత్తూరు ధర్మారెడ్డి(27), బండి ఆత్మకూరు మండలం సోమరాజులపల్లికి చెందిన వినోద్‌ (29) (వీరిద్దరూ నంద్యాలలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో) ఉద్యోగం చేస్తున్నారు. తన చిన్నాన్న ఆరోగ్య విషయం సునీల్‌ వారితో చర్చించాడు. ఆ తర్వాత ఈ నలుగురు కలిసి హరినాయుడిని తీసుకొని ఈ నెల 13న కారులో నంద్యాల నుంచి తిరుపతికి వెళ్లి అతడిని అక్కడ ఆస్పత్రిలో చేర్పించారు.

ఆ కుటుంబాల్లో విషాదం

ఈ ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురితో పాటు గాయపడిన కానిస్టేబుల్‌ సైతం అందరూ స్నేహితులే కావడంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. మృతి చెందిన వారికి ఏ కుటుంబాన్ని కదలించిన కన్నీరుమున్నీరవుతున్నారు. ఐటీఐ చదువుతున్న తేజనాయుడు తమ చిన్నాన్న ఆరోగ్యం కోసం వెళ్లి ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు భద్ర, రాజేశ్వరి భోరమని విలపించారు. ఒక్క కుమారుడు దూరం కావడంతో వారు బాధ వర్ణణాతీతం. బత్తూరి ధర్మారెడ్డి మృతి విషయం తెలియగానే.. బాధిత తల్లిదండ్రులు బత్తూరు శివ శంకర్‌రెడ్డి, అరుణమ్మ హుటాహుటిన కడప కు బయలుదేరారు. ధర్మారెడ్డి మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకు న్నాయి. మృతుల్లో మరోకరైన వినోద్‌ చిన్నతనం నుంచే.. తాత అవ్వలు, మేనమామల) వద్ద ఉంటూ చదువు కున్నాడు. ప్రస్తుతం జియో కంపెనీ లో పనిచే స్తున్నాడు. ఈ రోడ్డు ప్రమాదంలో వినోద్‌ మృతి చెందా డనే విషయం తెలియగానే.. ఇంటి వద్ద అవ్వ, తాతలతో పాటు బంధు వుల రోదనలు మిన్నంటాయి. ఇదే ఘటనలో కానిస్టేబుల్‌ సునీల్‌నాయుడు తీవ్ర గాయపడి ప్రాణాలతో బయట పడ టంతో బాధిత కుటుంబ ఊపిరి పీల్చుకున్నట్లైంది.

తిరుగు ప్రయాణంలో ప్రమాదం..

హరినాయుడిని అక్కడ వదిలి.. వీరందరూ అదే వాహనంలో సోమవారం నంద్యాలకు బయలుదేరారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలం నడి ంపల్లి వద్దకు రాగానే.. ఎదురుగా వస్తున్న.. పోలీసు పెట్రోలింగ్‌ వాహనంతో పాటు కడప- తిరుపతి బస్సును కూడా ఢీకొట్టడంతో వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో నుజ్జునుజ్జైంది. దీంతో అక్కడిక్కడ తేజనాయుడు, వినోద్‌, బత్తూరు ధర్మారెడ్డి మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ సునీల్‌నాయుడిని వైద్య చికిత్సల నిమిత్తం కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఆయితే కానిస్టేబుల్‌ పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం.

Updated Date - Apr 15 , 2025 | 12:25 AM